అన్న పెద్దనింద వేసినవారిని మాట్లాడనిచ్చేవాడు కాదు!
"అందుకేగా ఆ పరంధామయ్య కూతురుతనకి నచ్చిన వాడితో లేచిపోయింది!" అని మరో అభాండం వేసేవాడు.
వెంకయ్య చెప్పింది నిజమే అనుకునే వారు! రెండు రాత్రులకే వినాయకం గురించిన సమాచారం పూర్తిగా తెలుసుకున్న వారెవ్వరూ పిల్లని యిచ్చేందుకు నిరాకరించేయటంతో ఎంతో ఆనందించాడు.
కామాక్షమ్మనుంచి ఏ క్షణంలోనయినా కబురువస్తుందన్న ఆశతో యింటిని వదిలి ఎక్కడికీ వెళ్ళటంలేదు.
"ఆ రోజునతనని ఎన్ని మాటలు అన్నదో? అవన్నీ అడిగేస్తే?"
ఛా! ఛా!....అలా అడిగితే తన కూతురిని చేసుకోకపోవచ్చును! సుబ్బులు మెడలో ఆ మూడుముళ్ళూ పడిన తరువతః అడగవలసినన్ని మాటలు అడగటమే కాదు, ఆ కామాక్షమ్మ చేత మూడు చెరువుల నీళ్ళు తాగించడూ? తను ఊరుకుంటాడా?
తన కొడుకుకి వేలకివేలు కట్నం యిస్తామని ఎగబడిన వాళ్ళు యిప్పుడు యిలా నిందలు వేయటం ఏమిటని బాధ పడసాగింది కామాక్షమ్మ. ఇంకొక్కరోజు మాత్రమే వుంది అనుకున్న లగ్నానికి వ్యవధి. ఆ కావేరి పోయేది ఎప్పుడో పోయినా బాగుండేది! నిక్షేపంలా తన కొడుక్కి వివాహం అయివుండేది ఈ సరికి!
తీరా లగ్నం పెట్టుకున్న తరువాతపోయి నిక్షేపంలాంటి తన కొడుక్కి లేని మచ్చని తెచ్చిపెట్టిందని విలవిల లాడసాగింది. అదిచూసి శంకరంకూడా ఎంతో బాధపడసాగాడు.
"ఎలా జరగాలని వుంటే అలా జరుగుతుంది. అట్టే ఆలోచించి మనసు పాడుచేసుకోకు అమ్మా!" అన్నాడు శంకరం తల్లి దగ్గిర కోర్చుని ఓదార్చుతూ!
"ఇంతకంటే అవమానం మనకీ ఏమున్నది?....వినాయకానికి పెళ్ళిచేసి తీరాలన్న నా పట్టుదల వాడిమీద గిట్టని వాళ్ళెవరో మగతనం లేదన్న పుకారు పుట్టించి వాడి భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు!" అంటూ అంతవరకూ నిలువరించుకుని మూగగా తనలో తానే బాధ పడుతున్న కామాక్షమ్మ యింక ఆపుకోలేక కన్నీరుంచింది.
"మన ప్రయత్నలోపం లేకుండా మనం చేశాం. ఏదీ ఫలించలేదు. ఈ లగ్నానికి కాకపోతే మరేం బాధలేదులేమ్మా! వాడికేం వయస్సు మించిపోవటంలేదు! మంచి సంబంధం వచ్చినప్పుడు చూసి చేద్దాం!...యిప్పుడిహ ఆ విషయాలేవీ మనసులో వుంచుకోకు!"
"అన్ని ఏర్పాతులూ చేసుకున్నాం ఎంతో ఖర్చుచేసి! వినాయకం ఎంత బాధ పడతాడు? లోకం దృష్టిలో మనం ఎంత తేలికయిపోతాం?"
'కాదని అనంటంలేదు! యిప్పటికిప్పుడు మన వినాయకానికి యిచ్చి వివాహం చేసేందుకు ఏ కన్యాదాత సిద్దంగా వున్నాడు? అక్కడికీ మన ప్రయత్నం మనం చేశాం! ప్రయోజనం లేకపోయింది!" అన్నాడు శంకరం తల్లిని ఓదార్చాలన్న ప్రయత్నంతో!
"నాకు ఒక ఆలోచన కలుగుతోంది శంకరం!" కళ్ళు తుడుచుకుంటూ అంది కామాక్షమ్మ.
"ఏమిటో చెప్పమ్మా! బాగుంటే ఆచరించుదాం!"
"వెంకయ్య ఒకనాడు తన కూతురు సుబ్బులుని మనవినాయకానికి చేసుకోమని అడిగాడు. కావేరీని దృష్టిలో వుంచుకుని నేను అంగీకరించలేదు. యిప్పుడు నేనయి అడిగితే కాదనడు!"
"ఎవరూ? ఆ బండి వెంకయ్య కూతురా? మన వినాయకనైకి ఏం బాగుంటుందమ్మా! గడకర్రగా నల్లగా వుంటుంది. అదీగాక మన సంబంధం అందుకోగల స్థోమతకూడా లేదు!ఛీ!ఛీ!" అన్నాడు.
"ఈ లగ్నానికే వినాయకానికి పెళ్ళి చేయాలంటే అంతకిమించిన మరోమార్గం లేదు శంకరం!"
"నాకేం నచ్చలేదమ్మా!...."
"నన్ను అర్ధం చేసుకో శంకరం! కావేరీ తప్ప యింకే ఆడపిల్ల లేదా? లోకం గొడ్డుపోయిందా? అని అనుకుంటారు! అదీగాక వినాయకనైకి యింకా ఎవరూ పిల్లని యివ్వకుండా ఘోరమయిన నిందవేశారు. ఈ లగ్నంలో తప్ప యింక వాడికి పెళ్ళి అవగల అవకాశం లేదు. నా కొడుకు సంసారానికి పనికి రాదన్న ముద్రవేసిన ఈ లోకులకు, 'కాదు' అని చాటి చెప్పటానికే వివాహం చేయాలంటున్నాను....నన్ను గేలీ చేయటం, ఈ విషయంలో నేను ఓడిపోయానని మాత్రం అనిపించుకొను అందుకే ఈ ప్రయత్నం...సుబ్బలక్ష్మి బాగోకపోయినా మనసుమంచిదియి ఈ అవమానం నుంచి వినాయకనని సేదతీర్చగలదయితే చాలు! నేను యింకేమీ ఆలోచించటంలేదు. నాకు కావలసింది యిదే లగ్నానికి వినాయకానికి పెళ్ళి అవటమే కావలసింది. నేను రమ్మన్నానని బండి వెంకయ్యకి మన సోములుతో కబురుచెయ్యి. నేను మాట్లాడుతాను!"
కామాక్షమ్మ స్థిర నిశ్చయంతో అనేసరికి శంకరం కాదనలేకపోయాడు. తనూ ఆలోచనలో పడిపోయాడు.
"ఇది ఎంతవరకు సమంజసం?" అని!
వ్యవహారికంగాను, లౌకికంగానూ ఆలోచించితే తల్లి చెప్పింది సబబుగానే అనిపించింది. ఏ విషయమయినా సూక్ష్మ దృష్టితో పరిశీలించి మరీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంకూడా అందుకే ఎక్కువగా వాదించలేకపోయాడు.
"వెంకయ్య మామయ్యని అమ్మ పిలుచుకు రమ్మంది సోములూ! నువ్వు వెళ్ళి వెంట పెట్టుకుని రావాలి! అర్జంటు అని చెప్పు."
"వెంకయ్యగారంటే కాచేరీ చావిడిదగ్గిరవున్నమండువాలోగిలి!"
"ఉహుఁ- కాదు! బండి వెంకయ్యని!" అన్నాడు శంకరం?
సోములు తల వూపుకుంటూ వెళ్ళిపోయాడు బైటికి!
పల్లెటూరిలోని రైతులు ఏ పని చేపడితే ఆ పని పేరు చెప్పి ఇంటి పేరు మరుగుపర్చి పిలుస్తారు. కిరాయికి బండి తోలుతాడు కాబట్టి బండి వెంకయ్యగా పేరు స్థిరమయిపోయింది. ఆ గ్రామంలో రెండే రెండు మండువా లోగిళ్ళు వున్నాయి. ఒకటి కామాక్షమ్మది అయితే మరొకటి రావూరి వెంకయ్యది. "రావూరు" అన్న ఇంటిపేరు వదిలి కచేరీ చావిడి దగ్గిర వున్న వెంకయ్యగారా? అని అడగటం సర్వసాధారణం అయిపోయింది.
ఈ వివరణలు అన్నీ తెలియని శంకరం యధాలాపంగానే అనేశాడు.
వీధి గుమ్మందాటి లోపలికి వస్తున్న సోములుని చూడగానే మంచం మీద పడుకుని వున్న వెంకయ్యకి ఎంతో సంతోషం కలిగింది. తనకి పిలుపు వస్తుందని ఏ క్షణానికి ఆ క్షణం ఎదురుచూస్తూనే వున్నాడు. కావాలనే గట్టిగా కళ్ళు మూసుకుని మరీ పడుకున్నాడు.
"వెంకయ్యగారూ! మిమ్ములను అమ్మగారు పిలుచుకుని రమ్మన్నారు!" అన్నాడు సోములు అరుగు దగ్గిరకువచ్చి నిలబడి.
పలుకలేదు! సన్నగా గురక తీయసాగాడు.
తను గాఢ నిద్రలోవున్నానని అనుకోవాలని!
సోములు పిలవటం విన్న సీతమ్మ గబగబా అక్కడికి వచ్చింది.
"నువ్వా సోములూ! ఎవరో అనుకున్నాను....వారిని లేపకు! వంట్లో బాగోలేదు. ఏమిటి యిలా వచ్చావు?"
"వెంకయ్యగారిని మా అమ్మగారు పిలుచుకుని రమ్మన్నారు!"
"లేచిన తరువాత చెప్పుతానులే!"
"అర్జంటుగా వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నారు!"
సోములు నాలుగైదుసార్లు పిలిచిన తరువాత లేవవచ్చునులే! అని అనుకున్నాడు వెంకయ్య కాని భార్య సమయస్పూర్తికి ముందు ఆశ్చర్యం పోయి ఆ తరువాత ఎంతో సంతోషించాడు.
