Previous Page Next Page 
ప్రతీకారం పేజి 44


    ఇందిర అదోలా విరక్తిగా, నిరసనగా నవ్వింది.
    "ఏమిటమ్మా అలా చూస్తావ్? నా మాంగల్యాన్నేనా?" వ్యంగ్యంగా అన్నది ఇందిర.
    రాధాదేవి పిచ్చిదానిలా ఇందిర మీదకు వచ్చింది. ఆమె మెళ్ళోని మాంగల్యాన్ని రెండు చేతుల్తో పట్టుకొని తెంచడానికి ప్రయత్నించసాగింది.
    ఇందిర తల్లి చేతుల్ని బలంగా తోసేసింది.
    "అమ్మా! నా మాంగల్యాన్ని రక్షించు!" దీనంగా అన్నది ఇందిర.
    రాధాదేవి కూతురి ముఖంలోకి వెర్రిదానిలా చూసింది. అంతలోనే ఇరవై సంవత్సరాల నాటి దృశ్యం కళ్ళముందు కదిలింది.
    ఇందిర స్థానంలో జగన్నాథం నిల్చుని వున్నాడు. తను మాంగల్యం కాపాడమని దీనంగా అర్దిస్తూంది. ఏడుస్తూంది. గుండెలు తరిగిపోయేలా ప్రార్ధిస్తూంది. జగన్నాథం వికటంగా నవ్వుతున్నాడు, కసిగా చూస్తున్నాడు. అతని పెదవులు విషం కక్కుతున్నాయి, వెనక నుంచి ఆర్తనాదం...
    "అమ్మా ! అమ్మా ! నా పసుపు కుంకుమ కాపాడమ్మా!" ఇందిర రెండు చేతులూ మెళ్ళోని మాంగల్యాన్ని చూపిస్తూ దీనంగా అర్ధిస్తూంది.
    రాధాదేవి కన్నార్పకుండా చూసింది. ఆమె గుండెల్లో కసి లావాలా పొంగి కళ్ళలోకి వచ్చింది.
    "హుఁ! నీ మాంగల్యం కాపాడాలా? నా మాంగల్యం తెంచిన వాడి కొడుకు కట్టిన ఈ మాంగల్యం...నేను కాపాడాలా? వాడు అల్లుడిగా నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా మాంగల్యం తెంచిన వాడిమీద కసి తీర్చుకుంటాను. స్త్రీకి జీవితంలో ఏదైనా తన మాంగల్యం తర్వాతేనని గుర్తుంచుకో!" రాధాదేవి బుసలు కొట్టింది.
    "అవును! నువ్వన్నది నిజమే! నేను ఈ మాంగల్యం కొరకు కన్నతల్లిని కూడా వదులుకుంటాను. ఒకటి మాత్రం గుర్తుంచుకో. నీ మాంగల్యం ప్రేమించిన వాడికి ద్రోహం చేసింది. మనసిచ్చిన వాడికి శాపంగా పరిణమించింది. ప్రేమను ద్వేషంగా మార్చింది. ప్రతీకారం కోరుతూంది. నీ మాంగల్యానికి ద్వేషించడం మాత్రమే తెలుసు. ప్రేమకోసం త్యాగం చెయ్యడం తెలుసు. నా మాంగల్యం పవిత్రప్రేమకు చిహ్నం! దానికి ద్వేషించడం తెలియదు. వస్తానమ్మా. సెలవు!" రెండు చేతులు జోడించి నమస్కరించింది.
    రాధాదేవి వెర్రిదానిలా చూస్తూ నిల్చుంది.
    ఇందిర గిర్రున వెనక్కు తిరిగి సుడిగాలిలా బయటికి వెళ్ళిపోయింది.
    అప్పటికే వర్షం ప్రారంభం అయింది. రాధాదేవి చేష్టలుడిగి నిల్చుని వుంది.
    "నీ మాంగల్యం ప్రేమించిన వాడికి శాపంగా పరిణమించింది. నీ మాంగల్యానికి ద్వేషించడమే తెలుసు, నా మాంగల్యానికి ప్రేమించడం తెలుసు. నా మాంగల్యం పవిత్రప్రేమకు చిహ్నం!" ఇందిర కంఠం గదిలో మారుమోగుతూంది.
    ఒక్కసారిగా కిటికీ రెక్కలు ధన ధన కొట్టుకున్నాయి. విసురు గాలితోపాటు వాన జల్లు గదిలోకి దూసుకువచ్చింది. రాధాదేవి పూర్తిగా తడిసిపోయింది. అయినా ఆమె చైతన్యం కోల్పోయినట్టు కూర్చుండిపోయింది. ఇందిర మాటలు మాత్రం చెవుల్లో గింగురుమంటున్నాయి.
    గోడకు తగిలించి వున్న ఫోటో గాలికి వూగి వూగి దారం తెగి కిందపడి భళ్ళున పగిలింది. రాధాదేవి ఉలిక్కిపడి లేచి ముందుకు పరుగు తీసింది. కాళ్ళకు గాజుపెంకులు గుచ్చుకుని రక్తం కారుతోంది. ఆమె ఫోటోను చేతిలోకి తీసుకుని తడిమి చూసింది. గాజు పెంకులు గీసుకుని చేతినుండి రక్తం బొటబొటా కారింది. అయినా ఆమెకు నొప్పి తెలియడం లేదు.
    భర్త ఫోటోలోకి చూసింది. భర్త ముఖం సజీవంగా కన్పించింది.
    ఆ కళ్ళలో ఏవగింపూ, తిరస్కారం కన్పించి రాధాదేవి చలించిపోయింది.
    నువ్వు తల్లివేనా? ఆడదానివేనా? కన్నబిడ్డ తన మాంగల్యం కాపాడమంటే అంత క్రూరంగా తిరస్కరిస్తావా? ఛీ! నువ్వు మనిషివి కావు!
    భర్త కళ్ళతోనే అసహ్యించుకుంటూ అన్నట్టు తోచింది రాధాదేవికి.
    "నన్ను...క్షమించండి!" అంటూ రాధాదేవి స్పృహతప్పి పడిపోయింది.

                                             34

    కోర్టు జనంతో కిట కిట లాడుతోంది. రవి బోనులో నిల్చుని వున్నాడు.
    ఇందిర వాదిస్తోంది.
    మధ్యలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచాడు. "మిలాడ్! నేను ముందే చెప్పినట్టు ఆ బాల్ - బేబీ కథ అంతా ఆఫ్టర్ థాట్, కల్పిత కథ. ఎంత హాస్యాస్పదంగా వుందో తెలుస్తూనే వుంది. సాక్ష్యులు కన్పించారట. మళ్ళీ అంతలోనే విమాన ప్రమాదంలో చనిపోయారట. కథలల్లడంలో ముద్దాయి బాగా నేర్పరిగా కన్పిస్తున్నాడు. డిఫెన్స్ లాయర్ ఎలాగయినా ముద్దాయిని రక్షించుకోవాలనే తాపత్రయంలో లాజిక్ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు."
    "మిలాడ్! నేను చెప్పింది అబద్ధం కాదు. నేను స్వయంగా సాక్షుల్ని చూశాను. వారిని వెంబడించాను. కాని దురదృష్టవశాత్తూ అందుకోలేకపోయాను" అన్నది ఇందిర.
    "మూడో సాక్షి విషయం ఏమిటి?" జడ్జి ప్రశ్నించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS