Previous Page
ప్రతీకారం పేజి 45


    "మిలాడ్ ఆ మూడో సాక్షి సజీవంగానే వుంది. ఈ వూళ్ళోనే వుంది."
    "ఎక్కడ వుంది?" జడ్జి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
    "ఎక్కడో కాదు-ఆమె మా ఇంట్లోనే వుంది. ఆమె నన్ను కన్నతల్లి."
    ఇందిర మాటలకు జడ్జితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.
    "ఇది మరో కల్పితం..." ఏదో అనబోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ని జడ్జి మాట్లాడవద్దని చేత్తోనే వారించాడు.
    "అయితే ఆమె కోర్టుకు ఎందుకు రాలేదు. ఎందుకు సాక్ష్యం ఇవ్వడం లేదు? ఇంతకాలం ఆ విషయం కోర్టు వారి దృష్టికి ఎందుకు తీసుకురాలేదు?" జడ్జి ప్రశ్నించాడు.
    "మిలాడ్! ఆ విషయం నాక్కూడా మొన్న రాత్రే తెలిసింది. ఆ ఇద్దరు సాక్షుల్నీ ఆమె కావాలని పరారి చెయ్యడానికి ప్రయత్నించింది"
    "కారణం?"
    "ఆ ముద్దాయి కుటుంబం మీద చాలా ద్వేషంగా వుంది, కసిగా వుంది. వారి కుటుంబం నాశనం అయితే చూడాలని పట్టుదలగా వుంది. పగ ఆమెను రాక్షసిగా మార్చింది. కన్నకూతురి జీవితాన్ని కూడా నాశనం చెయ్యటానికి సిద్ధంగా వుంది. ఇంతకంటే నేనేమీ చెప్పలేను." అంటూ కళ్ళు తిరుగుతూ వుంటే కుర్చీలో కూలబడిపోయింది. ఆమె చైతన్యం కోల్పోయింది. కోర్టులో కలకలం బయలుదేరింది.
    జనం మధ్యనుంచి ఓ స్త్రీ లేచి బోను దగ్గరకు రావడం చూసి అందరికీ కుతూహలం కలిగింది.
    రాధాదేవి వచ్చి జడ్జి ముందు నిలబడింది. జడ్జి ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చెయ్యవలసిందిగా డిఫెన్స్ లాయర్ కు చెప్పాడు.
    రాధాదేవి తను చూసిందంతా చెప్పింది. కళ్ళు తెరచేప్పటికి ఇందిరకు తల్లి బోనులో నిల్చుని కనిపించింది. సంతోషం, ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి. ఆమె ముఖంలో జగన్నాథం కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి.
    "మిలాడ్! ఈమె కధనం నమ్మడానికి వీలులేదు. ఆమె డిఫెన్స్ లాయర్ కు తల్లి. డిఫెన్స్ లాయర్ కు రవికి వున్న సన్నిహిత సంబంధం ఏదో అర్ధం అవుతూనే వుంది. కూతురి సంతోషం కోసం ఆమె ఇలాంటి సాక్షాన్ని ఇవ్వడానికి సిద్ధం అయింది." అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    ఇందిర లేచి వాదించింది.
    "ఆ బేబీ ఎక్కడ?" ప్రశ్నించాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    "ఇదిగో బేబీ !" మూర్తి బేబీని తీసుకుని ముందుకు వచ్చాడు.
    జడ్జి బేబీని ప్రశ్నించాడు. బేబీ తను నీళ్ళలో ఎలా ఉండగలిగింది చెప్పింది.
    అంతలో హిప్పీరావూ, హేమ పరిగెత్తుకుంటూ వచ్చారు.
    వాళ్ళను చూసి అంతా ఆశ్చర్యపోయారు. బేబీ "అమ్మా" అంటూ తల్లి కాళ్ళకు చుట్టుకుంది.
    హిప్పీరావు బోను ఎక్కి సాక్ష్యం చెప్పాడు. తాము ప్లేన్ మిస్ అయి తిరిగి వస్తూండగా ప్రకాశ్ మనుష్యులు బంధించి టాక్సీలో తీసుకెళ్ళి నిర్బంధించారనీ, అంజిబాబూ, రమా పోలీసుల సహాయంతో తమను విడిపించారనీ చెప్పాడు.
    ప్రకాశ్ ను పోలీసు ఇన్ స్పెక్టరు కోర్టులో హాజరు పరిచాడు.
    "ముద్దాయి నిర్ధోషి" అంటూ జడ్జి తీర్పు చెప్పాడు.
    రవి ముందుకు వచ్చి మూర్తికి నమస్కరించాడు. మూర్తి రవిని దీవించాడు.
    జగన్నాథం మూర్తిని కౌగిలించుకున్నాడు.

                                          * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS