Previous Page Next Page 
ప్రతీకారం పేజి 43


    "కూర్చో తల్లి! నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి." అన్నాడు.
    జగన్నాథం తన తల్లి దగ్గరకు వెళ్ళొచ్చాడు. తల్లి ఏమన్నదో తెలుసుకోవాలని ఉంది. అంతలోనే "మనిద్దరం దుర్మార్గులమేరా? నేను ఇందిర తల్లి జీవితంలో నిప్పులు పోశాను." అన్న మాటలు గుర్తువచ్చాయి. అయితే జగన్నాథం తన తండ్రిని హత్య చేశాడా! ఇందిరకు నమ్మకం కలగడం లేదు.
    'అమ్మా! తెలిసో తెలియకో మేము ఇద్దరం మీ ఇద్దరికీ ద్రోహం చేశాం తల్లీ!" అన్నాడు జగన్నాథం.
    "రవి నాకెలాంటి ద్రోహం చెయ్యలేదు. మీరేం చేశారో నాకు తెలియదు. మీరు కూడా ద్రోహం చేసి వుంటారని నేను అనుకోవడం లేదు. మీలో మంచి మనిషిని, మనసున్న మనిషిని చూస్తున్నాను. మీరు ఎవరికీ ద్రోహం చెయ్యలేదు. అదేదయినా జరిగివుంటే మా కుటుంబం వల్లనే..."
    "కాదు తల్లీ ! నేనే ద్రోహం చేశాను."
    "అమ్మ ఏమన్నది? మీరు కలుసుకున్నారా? సాక్ష్యం ఇవ్వడానికి అంగీకరించలేదా? ఆమెలో ఇంత కాఠిన్యం దాగి వుందని నాకు తెలియదు. ఆమె తల్లి కాదు...మాతృ హృదయం లేని స్త్రీ..."
    "అలా అనకమ్మా! రాధాదేవి గుండెలో దాగివున్న అగ్నిపర్వతం ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. అభిమానం వున్న ఏ స్త్రీ అయినా అలాగే ప్రవర్తిస్తుంది."
    "ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీ కుటుంబం మీద ఆమె ఎందుకంత పగ పట్టింది?" అడిగింది ఇందిర.
    రవి వారిరువురి సంభాషణలో తనకేమీ సంబంధం లేనట్టు నిర్లిప్తంగా కూర్చున్నాడు.
    జగన్నాథం మాట్లాడటం ప్రారంభించాడు. తనకు తానే చెప్పుకుంటున్నట్టు, కలలో కలవరిస్తున్నట్టు చిన్నగా__ వారి మధ్య పెంపొందిన ప్రేమ...ఆ తర్వాత ఆమె వివాహం... తను వేటకు వెళ్ళడం... ఆమె భర్త దొంగల చేత చంపబడటం_ తన ప్రవర్తన... అన్నీ వివరించి చెప్పాడు.
    రవీ, ఇందిరా ఊపిరి బిగపట్టినట్టు కూర్చున్నారు.
    "నువ్వు రాధ కూతురువని నాకు తెలియదు." అంటూ నిట్టూర్పు విడిచాడు జగన్నాథం.
    "అమ్మను చూశారా! ఏమన్నది?"
    "తలుపులు తెరిచి నిలబడి వున్న రాధాదేవిని చూసి నేను శిలా మూర్తిగా మారిపోయాను. నెత్తిమీద ఎవరో సుత్తితో కొట్టినట్టు దిమ్మెరపోయాను. అలా ఎంతసేపు వున్నానో నాకే తెలియదు. ముఖంమీద దభాల్న తలుపులు మూసుకున్న శబ్దానికి ఈ లోకంలోకి వచ్చాను. అప్పటికే తలుపులు మూసి వున్నాయి. కర్తవ్యం స్ఫురించి తలుపు కొట్టాను. కొట్టి కొట్టి విసిగిపోయాను.
    "వెళ్ళిపో! ఎందుకొచ్చావ్? పుత్రభిక్ష పెట్టమని అడగడానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్? నీ ముఖం చూడను. నన్నెవరూ మార్చలేరు. ప్రతీకారం తీర్చుకుంటాను... రక్తానికి రక్తం..." తలుపుల వెనక నుంచి రాధాదేవి మాటలు వినిపించాయి.
    గిర్రున వెనక్కు తిరిగి ఇంటికి వచ్చాను. నా కళ్ళముందు దృశ్యం నన్ను వెర్రివాడ్ని చేసింది. కొన్ని రోజుల్లో ఉరికంబం ఎక్కబోతూ నీ మెళ్ళో మాంగల్యం కడుతున్న రవి దుర్మార్గానికి కదిలిపోయాను."
    అంతవరకూ చెప్పి జగన్నాథం చివుక్కున లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
    రవీ, ఇందిరా, ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. రవి అపరాధిలా తల దించుకున్నాడు.
    "రవీ! సినిమాకి వెళదామా?" రవిని మృదువుగా అడిగింది.
    రవి తల ఊపాడు.
    కార్లో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. కొంతదూరం వెళ్ళాక "రవీ ఒక్కసారి మా యింటికి వెళదామా?" అన్నది ఇందిర.
    రవి ఒక్కసారిగా కారు ఆపాడు.
    "మీ ఇంటికా? వద్దు! మీ అమ్మగారి ముఖం నేను చూడలేను." అన్నాడు రవి బరువుగా.
    "నువ్వు లోపలకు రావద్దు. కారు దూరంగా ఆపు. నేనే ఒకసారి లోపలకు వెళ్ళి వస్తాను." అన్నది ఇందిర.
    రవి అందుకు అంగీకరించాడు.
    ఇందిర లోపలకు వెళ్ళేటప్పటికి తలుపులన్నీ తీసే వున్నాయి.
    తల్లి గది తలుపులు తీసి వున్నాయి. అప్పుడే సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. గది గడపలో ఆగిపోయింది, ఇందిర తల్లి మాటలు వింటూ.
    రాధాదేవి భర్త ఫోటో ముందు నిల్చుని వుంది. పిచ్చిగా మాట్లాడుతూ వుంది.
    "నా మనస్సులో ఏదో బలహీనత ప్రవేశిస్తూంది. దాన్ని తట్టుకొనే శక్తి కావాలి. మరికొన్ని గంటలు నిలబడే శక్తి ఇవ్వు! ఆ తర్వాత మన బిడ్డ ఆ విషవలయం నుంచి బయటపడుతుంది. రవి బ్రతక్కూడదు, ఇందిర ఆ దుర్మార్గుడి కొడుకుని చేసుకోవటానికి వీల్లేదు. నాలోని ఈ ప్రతీకార జ్వాల చల్లారాలి. నీ రక్తానికి రక్తం బలి ఇచ్చి నీ ఆత్మకు శాంతిని కలిగిస్తాను. అంతవరకూ అంతరాత్మ పీకను నొక్కేస్తాను. ఇంకా కొన్ని గంటలు ఈ మానసిక సంఘర్షణను నిలబడగలిగే శక్తిని ఇవ్వు!"
    ఇందిర ఇక వినలేకపోయింది. గదిలో ప్రవేశించి స్విచ్ ఆన్ చేసింది. లైటు వెలిగింది. రాధాదేవి త్రుళ్ళిపడింది. పెళ్ళికూతురి ముస్తాబులో కూతుర్ని చూసింది. ఆమె తల గిర్రున తిరిగిపోయింది. పడబోయి గోడ పట్టుకుని పిచ్చిదానిలా కూతురి మెళ్ళోని పచ్చతాడుకేసి చూడసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS