Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 44


    ఈ తతంగమంతా చూస్తూ స్థాణువులా నిలచిపోయిన ఆ యువకుడూ, రమణా, కవీ మాకు దగ్గరగా వచ్చారు. అందరి కన్నులూ ఆర్ద్రంగా తడిసివున్నాయి.
    "నాన్నగారూ! ఇన్ని దశాబ్దాలుగా యీ బాధను హృదయంలో దాచుకుని యెంత కృంగిపోయారు? మీరు కొండవీడు చూచి తీరాలని అనారోగ్యంతో వుండి కూడా పట్టుపట్టారు. మాకు అసలు విషయమేమిటో పెద్దమ్మను చూచేవరకూ తెలియలేదు. అద్భుతమయిన యీ ప్రేమకథ అన్ని కాలాలకూ నిలచివుంటుంది. ఔను కదూ పెద్దమ్మా?" అంటూ వంగి అవ్వ పాదాలు తాకి లేచాడు.
    అవ్వ కుమారుణ్ని అక్కున చేర్చుకుని ముద్దాడింది.
    ఆమె స్త్రీ సహజమయిన అసూయకు అతీతురాలయిన దేవతలా అనిపించింది. నా మిత్రులిద్దరూ "సినిమా క్లయిమాక్స్ సీను" చూస్తున్నంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ లోకంలో లేరు. "అయితే అవ్వా! నీ జీవిత సహచరుడిని తిరిగి పొందగలుగుతాననే నమ్మకమే నీ చీకటి జీవితంలో చేదివ్వె. ఆ గుడ్డి వెలుగులో నీవు జీవితాన్ని శోధించావు" అన్నాడు కవి హృదయాన్ని వెల్లడిస్తూ. "నీ చొప్పదంటు కవిత్వంతో అవ్వను చికాకుపర్చబోక. అసలు మనుషులున్నప్పుడు కవిత్వం అఘోరించవద్దని చెప్పటం నీకిది యెన్నోసారి?" విసుక్కున్నాడు రమణ. అది వాళ్ళకి అలవాటే! చుట్టూ యీ గందరగోళం సాగుతున్నా వాళ్ళు కించిత్తు గమనించటంల్లేదు. అవ్వను చూస్తూ కవివర్మ, అక్కున చేర్చుకున్న రవివర్మ కొడుకు తల నిమురుతూ అవ్వా చిత్రాల్లా వుండిపోయారు. యువకుడు అవ్వ చూపే ప్రేమకు, ఆ స్పర్శకు కరిగిపోయి పసిపిల్లాడిలా ఒదిగిపోయాడు.
    రవివర్మగారి మనసులో యే తుఫానులు రేగాయో తెలియదు.
    'The drops fell very as they fall from an icicle after the sun....' హెమింగ్వే.  
    రవి అస్తమించాక తుహినం నుండి తుషార బిందువుల్లా ఆయన వెంట అశ్రువులు రాల్తున్నాయి.
    "బాబుగారూ! ఏమిటిది?" అన్నాను ఓదార్పుగా.
    "బాబూ! పరిణామం కోసం పరిశ్రమిస్తూ పురుగు ఆకాశపు అంచుల వెంట పరిగెడుతుంది. ఒక జీవిత కాలంలో ఆ పని సాధ్యపడదు. కాకపోయినా సంతోషదాయకమే! కాని, నేనా ప్రయత్నం కూడా చేయలేకపోయాను" కన్నీరొత్తుకున్నారు. ఆయన కన్నీరు చూచి అవ్వ తల్లడిల్లిపోయింది.
    "జీవిత ఫలాన్ని కళ్ళముందుంచుకుని వెర్రినాగన్న ఎవరు కన్నీరు పెట్టుకుంటారు నాయనా! అవి ఆనందభాష్పాలు!" సమర్థించింది. ఇన్నాళ్ళుగా ఈ ప్రేమంతా ఏమైనట్టు? ఏమిటో సృష్టి విచిత్రాలు! "ఫాతిమా! నిన్ను నాతో ఢిల్లీ తీసుకువెళతాను. వస్తావు కదూ! ఈ వయోభారంతో నీకు తోడంటూ వుండాలి" అడిగారు రవివర్మ. "అందాకా ఈ కట్టెలో చిలక ఎగిరిపోకుండా వుంటుందగా! ఎంత పేరాశ బాబూ మీది. నామీద దయకలిగితే అల్లా దర్బారులో చోటు దొరకాలని ఆశీర్వదించండి. అదే నాకు అన్నీ" అంటూ అవ్వ ఆయన పాదాల మీద తలవాల్చింది. చివ్వున ఉబికి వచ్చిన కన్నీళ్లు అవ్వ తలమీద రాలాయి. అదే ఆశీర్వచనం కాబోలు.
    ఆయన ఏదో గొణుగుతున్నారు. కాని అవ్వ అవన్నీ వినే స్థితిని దాటిపోయింది. శరీరం తాకితే చల్లగా వుంది. సరిగా కూర్చోపెట్టాను. ప్రయోజనం శూన్యమే! హంస లేచిపోయింది.
    "సృష్టిలో ఋజుత్వం కన్పించదు నాయనా! యావత్తూ బ్రహ్మండమూ దానిలోని ఆకారాలూ వర్తులాకారాలే! విమర్శన్ చెప్పలేదూ! 'Wise in Nature is not sound, unit and universe are round' కన్నీరు పెట్టుకుంటున్న కొడుకుతో అన్నారాయన. కాలం కూడా వర్తులా కృతిలోనే నడుస్తుందని ఆయన ఉద్దేశ్యం కాబోలు. కాని దానికంటూ సాక్ష్యమేమిటుంది.
    ఆయన రాజకీయ నాయకుడు. అంతేకాదు ఒకనాటి హృదయ స్పందనలు నేటికీ నిలుపుకోగలిగినవాడు. ఆ మీద వేదాంతి.
    అందువల్ల సహజంగానే గొప్ప ఆశావాది ఈ జన్మకే. ఆయన ఆశావాదం పరిమితమై ఉండలేదు. జన్మ జన్మలుకూ తీగలు సాగిన ఆశావాదం ఆయన మాటల్లో ధ్వనించింది. అది నాలో గొప్ప సంచలనాన్ని రేకెత్తించింది. ఇంతటి ఆశాపూర్ణమైన జీవితాన్ని ఈనాటి తరంలో ఎందరు పొందగలుగుతున్నారు. చిన్న చిన్న తాకిడులకు, ఒత్తిడులకూ అల్లకల్లోలమై పోతున్న వీరిలో ఆ స్థయిర్యమూ ఆ పవిత్రతా వున్నాయా?
    అవ్వ అన్ని భవబంధాలకూ అతీతురాలై వెళ్ళిపోయింది. కావలసిన కర్మకాండ ఆయన ఎంతో ధైర్యంతో పూర్తికానిచ్చారు. మర్నాడు సెలవు లేదంటూ రవీ, రమణ వెళ్ళిపోయారు. ఆ ఫారెస్టు బంగ్లాలో ముగ్గురమే మిగిలాం.
    "బాబుగారూ! మీ ఆరోగ్యం కుదుటపడేవరకూ ఈ ప్రశాంత వాతావరణంలోనే ఉండిపోండి" అన్నాను. ఆయన మనసులోని కదలికల్ని గమనించాలనే ఆసక్తితో. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS