Previous Page
కాలానికి నిలిచిన కథ పేజి 45


    "బాబూ ప్రశాంతత అనేది మనసులో ఉదయించేదే కాని బయట నుండి దొరికేది కాదు" నేను జీవితంలో సుదీర్ఘమైన ప్రయాణం చేశాను. చాలా భారమైన అనుభవాలను సంపాదించాను. ఈ అనుభవాల బరువును నేను మరెంతోకాలం మోయలేను. ఫాతీమాను చూచిన క్షణాన్నే రాజకీయాలలో విలువగల శక్తిని కోల్పోయాను. నేనెక్కడికి వెళ్ళాలో నిర్ణయించవలసింది నేను కాదు భగవంతుడే? నువ్వు రవ్వంత అనుభవశాలిలా ఉన్నావు. వీడికి ధైర్యం చెప్పు! కొడుకుని చూపారాయన యువకుడు అప్పటికే వెర్రిచూపుతో తండ్రిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది అసాధ్యమే!
    "మిత్రమా! నీవు ఉన్నతుడైన ఒక తండ్రి కడుపునా పుట్టావు. ఇక జీవితమంతా ధైర్యమే తోడుగా పయనించాలి" అన్నాను. అతనికి తండ్రి ఇక తనవాడు కాదనే సంగతి స్పష్టంగా అర్థమైంది.
    "నాన్నగారిని తీసుకుని ఈరోజే ఢిల్లీ వెళ్ళిపోతాను" అన్నాడు అయోమయంగా పిరికి చూపులు చూస్తూ.
    "బాబూ! అన్ని బంధాలను త్రెంచుకున్నాను నేను. ఢిల్లీ వచ్చ్జే ప్రశ్నలేదు. అక్కడ నేను చూడవలసిన పనులేమీ లేవు. లాయరు దగ్గరి బిల్లు వ్రాసి ఉంచాను. తీసుకో!" అన్నారు.   
    ఆ యువకుడు వెక్కి వెక్కి ఏడ్వడం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూచినా ఆయన హృదయం కరగలేదు. అతీతుడయ్యాడు. నేను ఓ ప్రక్క ఆ యువకుడిని ఓదార్చుతూ, ఓ ప్రక్క కొండవీటిలోని నా అనుభవాలను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. మరో రెండురోజులు గడిచిపోయాయి.
    బాధాకరమైన సాగర మదనం వల్ల అమృతం దొరికినట్లు అయింది. ఒకప్రక్క వేమాంబ సోమదేవులు అద్భుత కథ నన్ను వెన్నాడుతూనే వుంది, చరిత్ర కధా సాగరం! జీవితమూ అంతే! ఈ రెండు కొండవీటి యాత్రలో నాకు కన్నుల కట్టినట్లు రుజువయ్యాయి. నా సమయం వృధా కాలేదు. బాబుగారు పిలిచినా పలుకట్లేదు. విచిత్రంగా ఆయన దగ్గు మాయమైంది. షాక్ ట్రీట్ మెంటు జరిగి వుంటుంది.
    ఆయన రెండు రోజులూ కేవలం ఏకాంతంలో ఆలోచనలతో గడిపేశారు. కొంతసేపు అవ్వ కూర్చునే చెట్టుక్రింద కూర్చుని తపస్సమాధిలో మునిగినట్లు కన్పించేవారు. మరోసారి ఆమె అంత్యక్రియలు జరిగినచోట ముఖంలో ఆనందం తాలూకు ఉజ్వల కాంతిని వెదజల్లుతూ కన్పించేవారు. ఇప్పుడాయన చలిగాలికి భయపడటల్లేదు. ఎంతో ప్రొద్దుపోయి ధైర్యంగా బంగ్లా చేరేవారు. ఎక్కడ తిరిగేవారో! మాలో ఎవరైనా తోడుగా వెళ్ళాలని ప్రయత్నిస్తే వద్దని వారించేవారు. ఆయన ఏమౌతారోనన్న భయం నన్నావహించసాగింది. ఎలాగైనా ఈచోటు దాటించాలి.
    "బాబుగారూ! ఇక ఈ చోటు విడిచి పెట్టటం మంచిదనుకుంటాను. ఇక్కడ ఎంతకాలం వున్నప్పటికీ వెళ్ళక తప్పదు కదా! అబ్బాయి కూడా ఈ కొత్త చోటులో ఎడ్జెస్ట్ కాలేదు. ఇబ్బంది పడుతున్నాడు అంటూ హెచ్చరించాను." ఆయన క్షణం ఆలోచించారు.
    "అవును బాబూ! ఇక్కడ ఎంతకాలం వున్నప్పటికీ వెళ్ళిపోక తప్పుతుందా! నేను ప్రయాణానికి సిద్ధంగానే ఉన్నాను" విరక్తితో కూడి అర్థవంతమైన సమాధానం చెబుతున్నారాయన.
    ఎలాగూ వెళ్ళిపోక తప్పనప్పుడు త్వరగా వెళ్ళిపోవటం మరీ మంచిది అన్నారాయన మళ్ళీ. ఇక ఆయనను పలకరించకూడదు అనుకున్నాను. తీరా ప్రయాణం దగ్గరయ్యాక మనసు వూరుకోలేదు, అయితే బాబుగారూ అబ్బాయిని ఢిల్లీ పంపించారు. ఎక్కడకు వెళ్ళాలని సంకల్పించారు. నా ప్రశ్న ఆ యువకుడు కూడా విన్నాడు. అప్పటికి రైలు స్టేషన్ దగ్గర్లో వున్నాం. తండ్రి ఏమి చెప్తాడోనన్న ఆవేదన అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కన్పించింది. గుంటూరు వెళ్ళే రైలు వచ్చాక ముందుగా బాబుగారే ఎక్కారు. కిటికీ వెంబడి వుండే సింగిల్ సీట్లో కూర్చున్నారు. ముఖంలో ఏ భావాలూ లేవు. "బాబుగారూ! అవతల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇద్దరూ ఒకేచోట కూర్చోవచ్చు కూడాను. సూచన చేశాను. విన్నారు. ఊరుకున్నారు. ఊ అని కూడా అన్నారో లేదో బాగా గుర్తులేదు. ఎదురు సీట్లో యువకుడు గుండె చెరువై కూర్చుని ఉన్నాడు.
    "బాబుగారూ! మీ ఆరోగ్యం జాగ్రత్త" అన్నాను.
    "ఊ" అన్నారు.
    "మీరు ఎటు వెళ్ళాలో ఇంకా నిర్ణయించలేదా?" మళ్ళీ హెచ్చరించాను. "బాబూ! ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం అవసరమైతే తప్పక చెప్తాను. నేను షిర్డీ వెళ్తున్నాను."
    "కుర్రవాడిని వ్యాపారంలో దింపి వెళ్ళకూడదూ!"
    "ఊ"
    "మీ ఆరోగ్యం జాగ్రత్త" మళ్ళీ సమాధానం కోసం ఆశించాను.
    "ఊఁ"
    "మబ్బు పట్టింది. తలకు మప్లర్ చుట్టుకోండి. మళ్ళీ దగ్గు సాగిందంటే కష్టం. చేసేది దూర ప్రయాణం కదా?" అన్నాను.
    "ఔనౌను! ఎంత దూరమో తెలియదు కాని చాలా దూరమే!"
    "మరి నాకు శలవిప్పిస్తారా!"
    "ఊ!"
    పది విషయాలు చెప్పినా, పది ప్రశ్నలు వేసినా ఆయన ప్రక్కనుండి అదొక్కటే సమాధానం. మీరు సమాధానం చెప్పకపోతే కొండంత బరువుతో నేను ఇల్లు చేరుకోవాలి" అన్నాను ఎలాగైనా కదిలించాలని.
    "బాబూ? సమాధానం చెప్పవలసిన బాధ్యత నామీద ఉన్నదంటున్నావు కనుక చెపుతున్నా విను. ఆసక్తిగా చూచాను. ఆ యువకుడు ఉబికి వచ్చే కన్నీటిని ఆపి కన్నార్పక చూస్తున్నాడు.
    ఆయన రెండు కళ్ళు మూశారు, నోరు రవ్వంత విప్పారు.
    "సస్యస్తంమయా!" అన్నారు.
    ఆ యువకుడు ఆపేసిన కన్నీరు వెల్లువలా పొంగింది. గుప్పున పొగ వదిలి రైలు ముందుకు సాగింది.
    కన్నీటి పొరల మధ్య అది ఎప్పుడు కనుమరుగైందో గమనించలేదు.

                                         * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS