Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 43


    "ఓబులూ! ఏమిటిలా వచ్చావు? మళ్ళీ ఏ పూనకమో పాడో రాలేదుకదా ఖర్మకాలి__అన్నాను. జోగులు సిగ్గుపడ్డాడు. ఏంటో సామీ! ఆ సయ్యాన (సమయాన) నాకు వళ్ళు తెలీదు" "నాకు మేలే చేశావు. ఫరవాలేదులే" ప్రశ్నింసించాను.
    "ఓ సోస్ బాబూలయ్యా! మీకు నేనేమి మేలు చేశాను. ఆపాటి పెగ్గకలోణ్ని కానులే బాబూ!" అన్నాడు వినయంగా అంటే పెద్దియజ్వ సంగతి నాతో తనే చెప్పిన సంగతి తెలీదు. ఆ వీరావేశంలో ఏమి చెప్తాడో మరుపు కలుగుతుంది. ఇక ఆ విషయం మీద ఎంత మాట్లాడినా ప్రయోజనం శూన్యమే! "సర్లే! ఈ అవ్వకు కొంచెం విభూతి పెట్టు అన్నాను. అవ్వ వొద్దు వొద్దు. అంటూనే ఉన్నా కొండిన కట్టిన మూట నుండి రెండు చిటికలు విభూది తీశాడు. దాని గుప్పెట్లో ఉంచి కళ్ళు అరమోడ్చాడు. వెంటనే అది అవ్వ తలమీద ఒంటిమీద చల్లాడు. రవ్వంత నోట్లో కూడ వేశాడు. అవ్వ అయిష్టంగా విచిత్రంగా చూస్తోంది.
    "ఈ దెబ్బతో అవ్వ బువ్వలేకపోయిన ఏడాది బతుకుద్ది. ఇది వాక్కు అన్నాడు ఓబులు. అవ్వ విరక్తిగా నవ్వింది.
    "ఇలాంటి ఘట్టాలు చూచినప్పుడు వాటిలో యదార్ధమెంత ఉన్నదనే విషయంలో నాకు కొన్ని సంశయాలున్నాయి. కాని ఇటువంటి సాంప్రదాయాలూ, ఆచారాలూ విశ్వాసాలూ ఎలా వస్తాయనే అంశం మీద నా ఆలోచనలు సాగుతాయి. నా తత్త్వం అది.
    "ఓబులూ ఎక్కడికి వెళ్తున్నావు?" ప్రశ్నించాను! ఓబులు చిన్నగా దగ్గాడు. అదోరకంగా తల ఎగరేశాడు!
    "ఫారెస్టు బంగళాలో ఎవరో పెద్దయ్యగోరు దిగి నోరంట ఆరికి దగ్గుస్తావుంటే చూడాలని ఎలా ఉండా బాబయ్యా! విబూది కావాలేమో కబురంపాడు." అన్నాడు.
    "ఆ విభూతిలో సగం అవ్వకు అయాచితంగా లభించటం దైవకృప, ఆ విభూతివల్లనో తనకు కలిగిన సంతోషం వల్లనో కాని అవ్వాలో చురుకుతనం కన్పించింది. నాతోపాటు నడుస్తోంది.
    వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్నారు రవివర్మ. ఎదురుగా సుదూర తీరాల వరకు విస్తరించి అగమ్యంగా కనిపించే అడవిలోకి చూస్తున్నారు. అవ్వను తీసుకుని దగ్గరగా వెళ్ళాను.
    అవ్వ అనుమానిస్తూనే దూరంగా నిలిచింది. నేను ఆయనకు నమస్కరించి మరో కుర్చీలో కూర్చున్నాను.
    "బాబుగారూ ఎవరొచ్చారో చూడండి" పలకరించాను. ఆయన నన్ను తేరిపార చూచారు. అనుమానంగా అవ్వకేసి చూచారు. ఓ క్షణం వారి చూపులు కలుసుకున్నాయి, మనుషులు మాట్లాడుకోలేని అనేక విషయాలు కళ్ళు మాట్లాడగలవు. మనసుకు కళ్ళేకదా వాకిళ్ళు.
    అవ్వ రవివర్మను గుర్తించిందేమో! ఆమె ముఖంలో ఒక ఉద్విగ్నత, జీవిత ఫలాన్ని చేపట్టిన ఉజ్వలత కన్పిస్తున్నాయి. ఆయన ఇంకా అనుమానిస్తూనే చూస్తున్నారు.
    "బాబుగారు అయిదు దశాబ్దాలనాడు యీ కొండవీడులో మీరు గడిపిన జీవితం గుర్తుంది కదా! అప్పటి మీ జీవిత సహచారిణిని మీరు గుర్తించలేరా!" అన్నాను.
    "ఈ అవ్వ ఎవరో కొంచెం చెప్తావా బాబూ!" ప్రశ్నించారాయన. అవ్వను గురించి మీకు నేను చెప్పగలిగిన తాహతు లేదు. ఆమెను మీకు ఏమని పరిచయం చేయాలో నేను వూహించలేను.
    "ఫాతిమా!" హఠాత్తుగా ఆయన నోటినుండి వెలువడ్డ ఈ మాట ఆమెను సంతోష సాగరంలో ముంచెత్తింది.
    తూలుతూ వచ్చి ఆయన పాదాలమీద వ్రాలిపోయింది. చిరకాల విరహం తరువాత జీవితపు అంచుల మీద నిలచి వొకరినొకరు పలకరించుకునే ఆ జంటను చూచి నా కన్నులు చెమరించాయి. ఏం మాట్లాడాలో తెలియలేదు.
    "ఫాతిమా!" అన్నారాయన రుద్ధమైపోయిన కంఠముతో. ఆమె ఆయన పాదాల మీదనుండి తలెత్తలేదు. ఆమె కన్నీటి ధారలు ఆయన పాదాలను అభిషేకిస్తున్నాయి.
    "ఫాతిమా! నీవు నన్నింకా జ్ఞాపకం పెట్టుకున్నావా? ఈ కృతఘ్నుడు, నీకు చేసిన ద్రోహాన్ని నీవు మరచిపోయావా? నీవు నన్ను క్షమించావా ఫాతిమా!" ఆయన కంఠం వొణికింది.
    "స్వార్థం ప్రేమను కోరితే, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. క్షమా హృదయం లేనివాళ్ళు ప్రేమించటానికి అనర్హులు" అన్నది అవ్వ.
    ప్రేమ మీద ఆమె చెప్పిన అభిప్రాయాలు యీనాటి వ్యవస్థలోని నాగరికులమనుకుని విర్రవీగే వాళ్ళకు శిరోధార్యాలనిపించింది. ఆమె యేమి చదువుకుంది? ఔను, అనుభవాల పాఠశాలలో జీవితాన్ని చదువుకుంది. ఇప్పుడామె మహోపాధ్యాయిని.
    "చాలు ఫాతిమా! చాలు నేను ఏమాట వినాలని ఎండిపోయిన ఈ కట్టెలో ప్రాణాలు నిలుపుకున్నానో ఆ మాట నీనోట విన్నాను. ఇహనిప్పుడు నేను జీవిత ఫలాన్ని అందుకున్నవాడినయ్యాను. కాని, ఫాతిమా! నీవు నావల్ల వంచితురాలివై వొక జీవితకాలం వేచిఉన్నావు. ఆ నిమగ్నతా, తదాత్మ్యమూ నిన్ను మహోన్నతురాలిని చేశాయి. ఇప్పుడు నీ వ్యక్తిత్వం ముందు మేము తేలిపోతున్నాము" అంటూ కన్నీరు పెట్టుకున్నారాయన. అవ్వ నవ్వుతోంది. ఆమె యెదురు చూచింది పొగడ్తల కోసం కాదుగా. ఈ ముసలాయన తన్మయత్వంతో పొగుడుతున్నాడే కాని ఆ పొగడ్తల కోసమా అవ్వ యింత మూల్యాన్ని చెల్లించింది. నా కన్నులు చెమర్చాయి. హృదయం ద్రవీభూతమయి పోయింది.
    "బాబుగారూ! మీరు వయసులోనూ, బుద్ధిలోనూ, జీవిత సాఫల్యాన్ని అందుకోవటంలోనూ మాకంటే యెంతో ముందున్నారు. మీకు నేను చెప్పవలసిన వాడిని కాను. కాని, అవ్వ జీవితమంతా అడవికాచిన వెన్నెల అయింది. ఇప్పుడీ జీవితపు అంచున నిలిచి మీకోసం చెయ్యి జాపుతోంది. అందుకుని ఆదరిస్తారా? మీ పిల్లల కోసం, మీ కుటుంబ భవితవ్యం కోసం తిరస్కరిస్తారా?" ప్రశ్నించాను. రవివర్మ ఆలోచనలో పడిపోయారు. చూపులు అవ్వమీదనే వున్నాయి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS