తండ్రి పేరు చెబితే పిల్ల దగ్గరవుతుందని అతని ఆశ!
"ఎర్రగా, బుర్రగా వుండేవాడు మా నాయన! బుర్రనిండా ఎర్ర ఆలోచనలే! లెఫ్టిస్టుగా ఉండడమే రైటని నమ్మిన మనిషి. తన ఆదర్శాలకు తగినట్లుగా ఎర్ర సినిమా ఒకటి తీయబోయి రోడ్డున పడ్డాడు. మళ్ళీ ఇంటిదారి పట్టి మొహం చూపించడానికి సిగ్గుపడి ముంబై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంక పత్తాలేడు! నీ ఫాదర్ నీకు దూరమైపోయినా, ఈ గాడ్ ఫాదర్ నిన్ను వెదుక్కుంటూ వచ్చాడమ్మా! అంటే నేనే!" అన్నాడు దాస్.
కోపాన్ని ఆపుకుంటూ చూసింది అరుణ.
"నేను సినిమా తీస్తున్నానమ్మా! హిందీ సినిమా! యాభై కోట్ల భారీ బడ్జెట్టుతో! పెద్ద హీరో డేట్లు దొరికాయి! నువ్వే హీరోయిన్ వి!" అన్నాడు దాస్.
అతని మనసులో ఉన్న ఆలోచన వేరు. సినిమా పేరుతో ఈ పిల్ల ఇల్లు దాటితే చాలు - షిప్పులోకి ఎక్కించేస్తాడు తను - అభిరాం షిప్పులోకి!
అప్పుడు అభిరాం అగ్రహీరో డేట్లు తనకి ఇప్పిస్తాడు -అగ్రహీరోని కిడ్నాప్ చేసి షిప్పులోకి ఎక్కించేసి - నయానో - భయానో!
"మీ నాయన జీన్సు నీలో ఉన్నాయమ్మా! జీన్సు వేశావంటే తక్కిన హీరోయిన్లందరూ నీ ముందు బలాదూరు!" అన్నాడు.
"నాకు ఇష్టం లేదు" అంది అరుణ - 'ఇంక వెళ్ళు' అన్నట్లు చూస్తూ.
"మీ అమ్మగారికి అభ్యంతరం అయితే నేను నచ్చ చెబుతా!"
"అభ్యంతరం నాకే!"
"ఎందుకు?"
"నాకు ఇష్టం లేదు గనక!" అన్నది అరుణ.
ఆమెకు అనిపించింది - సినిమాల్లో కేస్టింగ్ కౌచ్ అని ఒకటి వుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! 'రేపు నీకోసం సెట్స్ లో ఆర్క్ లైట్లు వెలుగుతాయి' అని నమ్మబలికి, ఇవాళ బెడ్ రూంలో లైట్లు ఆర్పేయడం!
ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఆర్క్ లైట్ల ఆకర్షణలోపడి శలభాలలాగా మాడి మసి అయిపోలేదూ?
అందగత్తెలకే అందని సినిమా అవకాశాన్ని ఇతడు ఇంటికే వచ్చి తనకి అందిస్తానని ఆశ పెడుతున్నాడంటే -
నమ్మేయడానికి తనేమన్నా అంతటి అమాయకురాలా?
ఇంతలో జాహ్నవి అటువైపే వచ్చింది.
"ఏమిటి?" అన్నట్లుగా అరుణ వైపు చూసింది.
"నన్ను సినిమా హీరోయిన్ని చేస్తారుట! వద్దనేశాను" అంది అరుణ - వ్యంగ్యంగా.
"నన్ను సినిమా హీరోయిన్ని చేస్తారుట! వద్దనేశాను" అంది అరుణ - వ్యంగ్యంగా.
"సినిమానా? సినిమాల అనుభవం ఇంక ఈ జన్మకి చాలు. మాకు ఇష్టంలేదు" అంది జాహ్నవి తిరస్కారంగా.
"నమస్కారం అమ్మా!" అన్నాడు దాస్.
ముభావంగా తల పంకించి, వెళ్ళిపోయింది జాహ్నవి.
ఆ తల్లీ కూతుళ్ళకి పెద్దగా పోలికలు లేకపోవడం గమనించాడు దాస్. అరుణకి ఆమె తండ్రి ఆనంద్ పోలిక వచ్చింది. కనుముక్కుతీరు అచ్చం అతనిలాగే! కనుముక్కు తీరు అదే అయినా ఆనంద్ అందం మాత్రం ఎందుకోగానీ ఈ అమ్మాయికి రాలేదు.
అయితే - అందం చందం కాదు కదా ఆ అభిరాంకి కావలసింది.
అతను ఈ అమ్మాయిని చెడగొట్టదలుచుకున్నాడు.
థ్రిల్ కోసం! అంతే!
అలా అనుకుంటూనే, అక్కడ నుంచి వెళ్ళిపోతున్న జాహ్నవి వైపు పరీక్షగా చూశాడు దాస్.
జాహ్నవి నడకలో ఏదో తెలియని అందం గోచరించింది దాస్ కి.
'పిల్లకంటే తల్లి తక్కువేం కాదు. పిటపిటలాడుతూ ఉంది! మొగుడొదిలేసి వెళ్ళిపోయాడు గానీ...తల్లి వేషాలకు బాగా సూటయ్యేటట్లుంది. నలభై వుంటాయా? అగ్రహీరోకి అరవై! అయితేనేమి? గ్లామరస్ తల్లులు ఉంటేనే కదా జనాలు చూసేది! అట్నుంచి నరుక్కురావాలి' అనుకున్నాడు దాస్.
పైకి మాత్రం "సరేనమ్మా! నేను వెళ్ళివస్తా! బాగా ఆలోచించుకో! అద్భుతమైన అవకాశం! అగ్రిమెంటు కూడా అఖ్ఖర్లేదు! అడ్వాన్సుగా ఓ లక్షకి చెక్కు ఇచ్చేస్తా! లక్షణంగా తీసుకో!" అన్నాడు.
చెక్కులన్నీ చెల్లుతాయా?
ఆఫర్లు అన్నీ అవకాశాలుగా మారతాయా?
మరీ ముఖ్యంగా సినీ ఫీల్డులో!
నవ్వుకుంది అరుణ.
వెళ్ళిపోయాడు దాస్ -
మళ్ళీ రావడం కోసం!
* * * *
డబ్బు నీళ్ళలా ఖర్చుపెట్టేస్తుంటే, అరుణ పట్ల తన ప్రేమజ్వాల ఆరిపోతుందనుకున్నాడు సూరజ్. అది కేవలం భ్రమే అని తేలిపోయాక, ఇంక ఖర్చు పిచ్చిలో నుండి బయటపడి, కొన్నకార్లని వదిలించుకుని, కాలినడకన వెళ్తున్నాడు సూరజ్. అతని వంటిమీద ఖరీదైన సూటులేదు. మామూలు టీ షర్టు - బ్లూ డెనిమ్ జీన్స్ - అంతే!
ఓ రోజు పొద్దున్నే అతను అలా అన్యమనస్కంగా నడిచి వెళ్తూ ఉంటే అక్కడ కనబడింది ఒక దృశ్యం!
'సెగ్వే' అనే చిత్రమైన వాహనం మీద వెళ్తూంది ఒక అమ్మాయి.
మానవ సృష్టిలో 'సెగ్వే' అనే వెహికిలు ఒక మహాద్భుతం అన్న ప్రచారం జరుగుతున్న సంగతి అతనికి తెలుసు.
సెగ్వే అంటే అది ఒక చిన్న సైకిలు లాగా కనబడే స్కూటరు అని చెప్పవచ్చును. అరడుగు వ్యాసం కల రెండు చిన్న చక్రాలు వుంటాయి. వాటిమీద మనిషి నిలబడడానికి సన్నటి ప్లాట్ ఫారం లాగా వుంటుంది. నడుము ఎత్తుకి వచ్చే హాండిల్ బార్ వుంటుంది. మోటార్ పవర్ తో నడుస్తుంది. రీ ఛార్జబుల్ బాటరీ.
అయితే మరి విశేషం ఏమిటీ?
విశేషం ఏమిటంటే, సెగ్వే వెహికిలుకి ఉండే అద్భుతమైన బాలన్సింగ్ పవరు!
దాన్ని అటు తిప్పినా, ఇటు తిప్పినా, అడ్డదిడ్డంగా పోనిచ్చినా, అది డొంక పల్లాలలోకి వెళ్లినా, నడిపేవాడు అటు ఒరిగినా, ఇటు ఒరిగినా - ఏది ఏమైనా సరే - సెగ్వే మాత్రం బాలన్స్ తప్పదు!
పోను పోనూ ప్రపంచవ్యాప్తంగా ఇంక పాతరకం వాహనాలు మరుగున పడిపోతాయనీ, ముందు ముందు సెగ్వేలాంటి వెహికిల్సే రోడ్లన్నిటినీ ఆక్రమించుకుంటాయనీ గొప్ప ప్రచారం జరిగిపోతోంది కదా!
కళ్ళప్పగించి చూస్తున్నాడు సూరజ్.
అతని ఎదురుగా ఒక సెగ్వే వెహికిలు -
దానిమీద -
ఓహ్ గాడ్!
అరుణ!
అదే! అచ్చం అరుణలాగానే వుండే ఆ అమ్మాయి - ఆ రోజున లాస్ వేగాస్ లో కనబడిందే - తను!
పేరేమిటి చెప్పింది?
తన సెగ్వేని అతని పక్కనే ఆపింది ఆ అమ్మాయి.
"వెహికల్ నే తప్ప రైడర్ ని చూసే మాటే లేదన్నమాట! నేను సునయనని. గుర్తుపట్టలేదా మిస్టర్ సూరజ్? తప్పేముందిలెండి. నేను కూడా ఆ రోజు మిమ్మల్ని వెనువెంటనే గుర్తుపట్టలేకపోయాను కదా! మీరు చాలా మారిపోయారు! గెడ్డం పెంచారు. జుట్టు పొడుగయింది. చాలా చిక్కిపోయారు కూడా!" అంది అభిమానంగా.
"అవును అవును!" అన్నాడు సూరజ్ కాస్త అయోమయంగా.
"దగ్గర్లోనే ఉంది మా ఇల్లు. రండి వెళ్దాం!" అంది సునయన.
సూరజ్ కి అనిపించింది.
అసలు అరుణకీ, ఈ అమ్మాయికీ ఇంత పోలిక ఎలా వచ్చిందో అడిగి తెలుసుకోవాలి.
అయితే -
చాలా పోలికలతో బాటు కొన్ని కొన్ని తేడాలు కూడా వున్నాయి. తీరిగ్గా చూస్తే ఇప్పుడు తెలుస్తోంది.
అదే క్షణంలో - సునయన కూడా అనుకుంటోంది.
అరుణ - తనకి ఆగర్భ శత్రువు.
అరుణ అతనికెలా తెలుసూ?
అది తను తెలుసుకోవాలి.
"రండి!" అంది మళ్ళీ.
"ఈ బుల్లి వాహనం మీద మనం డబుల్స్ వెళ్ళలేం గానీ, ఇద్దరం నడిచేద్దాం" అంది నవ్వుతూ.
బోస్టన్ మహానగరానికి దగ్గరలోనే ఉన్న ఊరు అది.
పేరు వెస్ట్ బరో.
కొంతదూరం నడవగానే కనబడింది ఒక ఇల్లు. అక్కడ వున్న అన్ని ఇళ్ళలాగా అదీ పూర్తిగా చెక్కతో చేసినదే! అన్ని ఇళ్ళకీ ఉన్నట్టుగానే దాని కప్పు కూడా గుడిసె ఆకారంలో ఏటవాలుగా ఉంది-శీతాకాలంలో కురిసే మంచు కప్పు మీద నిలవకుండా ఎప్పటికప్పుడు జారిపోయేటందుకు వీలుగా.
అయినా సరే -
శీతాకాలంలో ఇళ్ళ కప్పులన్నీ కూడా ఐస్ క్రీం కేకుల్లాగా అయిపోతూనే వుంటాయి - గడ్డకట్టిన మంచుతో.
