"ఇంకా పిలవనులే!" సంగయ్య అన్నాడు.
"మరెందుకు పిలిచావ్"
"తెలియక పిలిచాను."
"ఇంకెప్పుడు పిలవకు, రాణి అనే పిలువు."
"సరే. రాణీ!"
"ఏంటీ!"
"నేవచ్చాతలుపు గడియతియ్యి."
"ఇప్పుడు నేను తియ్యను నిద్ర వస్తున్నది."
"చిన్నగ మాట్లాడు."
"ఎందుకేమిటి? నెయిలాగే మాట్లాడుతాను."
"రాణి!"
"ఊ..."
"రాత్రి నీగదికి వచ్చి బొమ్మలు చూపిస్తానని చెప్పలేదూ!"
"చెప్పావు."
"మరి ఆ బొమ్మల్ని చూడవా, రంగురంగులవి భలేవి తెచ్చాను."కాగితాలు చూపిస్తూ సంగయ్య చెప్పాడు.
"నిజంగ చూపిస్తావా!"
"ఇవిగో తలుపు తెరువు చూపిస్తాను."
"సరే అటురా తెరుస్తాను." అంటూ కీర్తి మంచం దిగింది.
కీర్తి తలుపు గడియ తెరవంగానే సంగయ్య గదిలోకి వచ్చి గబుక్కున గడియ పెట్టాడు. వెంటనే లైటు ఆర్పేశాడు.
కీర్తి కెవ్వున అరచి "భయం, చీకటి" అంది.
సంగయ్య లైటు వెంటనే వేస్తూ "అరవకు ఎవరైనా వస్తారు" అన్నాడు కాస్త కంగారుగ.
"ఏం వస్తే" అంది కీర్తి.
"నేతెచ్చిన బొమ్మలు కావాలని అడుగుతారు."
"ఆ తలుపులు ఎందుకు వెయ్యటం."
"చెప్పానుగా ఎవరైనా చూస్తే అడుగుతారు" అని వచ్చి మంచం మీద కూర్చున్నాడు. "ఇలా వచ్చి కూర్చో బొమ్మలు చూపిస్తాను భలే బొమ్మలులే నీవు ఎప్పుడూ ఇలాంటి బొమ్మలు చూసి వుండవు." అంటూ తన పక్కనే కూర్చోమని చోటు చూపించాడు.
కీర్తి వచ్చి కూర్చుంది.
సంగయ్య బొమ్మలు చూపించబోతే కీర్తి నేను చూస్తాలే అని తీసుకుంది.
సంగయ్య "బొమ్మలున్న కాగితాలని మడత బెట్టి తీసుకు వచ్చాడు బహుశా అవి బూతు బొమ్మలు కావచ్చు నని వూహించింది కీర్తి.
సరీగ అప్పుడే "రాణి! రాణి!" అని పిలుస్తూ తలుపు తట్టిన శబ్దం అయింది.
ఆ గొంతు సతీదేవిది.
సంగయ్య కంగారు పడిపోయి చటుక్కున లేచి నుంచున్నాడు.
"అక్క పిలుస్తున్నది." మామూలుగ చెప్పింది కీర్తి.
ఆ గదిలోంచి బైటికి వెళ్ళటానికి మార్గం లేదు. సంగయ్యకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి.
"వెళ్ళి తలుపు తియ్యి." కీర్తి అంది.
"ఇది వెర్రిది కాబట్టే భయపడటం లేదు. తలుపులోపల గడియ వేసుకుని గదిలో ఒక మగా ఆడా వుంటే ఆ సమయంలో బయటి నుంచి తలుపు తట్టి పిలిస్తే ముందు భయపడాల్సింది భయపడేది ఆడది. అలాంటిది పిచ్చి మొద్దుదర్జాగ మంచం మీద కూర్చుని వెళ్ళి తలుపు తియ్యి అని చెపుతున్నది అయ్యో!" అనుకున్నాడు సంగయ్య.
మరోసారి తలుపు కొట్టి "రాణి! రాణీ!" తలుపుతియ్యి అని పిలిచింది సతీదేవి.
సంగయ్య మూతిమీద నుంచి ముక్కుమీద దాకా వేలు ఏసుకుని "ఇష్. మాట్లాడకు." అన్నాడు. వెంటనే కీర్తి అరవకుండా నోటి మీద చేయి వేసి తగ్గు స్వరంతో కీర్తి చెవిలో చెప్పాడు. "మీ అక్క నిన్నూ నన్నూయిక్కడ చూసిందంటే చంపేస్తుంది. మీ అక్క సంగతి నీకు తెలియదు. నీ వేమీ చెప్పకు, నేను ఈ మంచం కింద దూరుతాను. మీ అక్క వెళ్ళి పోయింతరువాత పైకి వస్తాను. తలుపు తీయటానికి ఆలశ్యం చేశావెందుకు అని అడిగితే నిద్ర పోతున్నానని చెప్పు, నా పేరు అసలు చెప్పొద్దు. అసలేమీ చెప్పవద్దు. మీ తాతయ్య మీదఒట్టు పెట్టాను చెప్పవద్దు."
కీర్తి భయంతో కళ్ళు మిటకరించి తలూపింది అలాగే నని. సంగయ్య మంచం కింద దూరాడు.
మరోసారి తలుపు మీద గట్టిగ కొట్టి పిలిచింది సతీదేవి.
కీర్తి మంచం కిందికి వంగి చూసి "తలుపు తీస్తున్నాను." అంది.
"వెళ్ళు" అన్నాడు సంగయ్య. దీని వరస చూస్తుంటే యిదే నన్ను పట్టిచ్చేటట్లు వుంది. దీని పిచ్చికాదు గాని నా ప్రాణం మీదకి వచ్చింది అనుకున్నాడు.
కీర్తి వెళ్ళి తలుపు తీసింది.
సతీదేవి లోపలి వచ్చింది. వస్తూనే అనుమానంగ అటూ ఇటూ చూసింది.
"ఏంటి అక్కా! చూస్తున్నావ్!" కీర్తి అడిగింది.
"ఏం లేదులే. అన్ని సార్లు తలుపు తట్టి పిలిచాను. తలుపు తియ్యలేదేమిటి?" సతీదేవి గట్టిగ అడిగింది.
"నిద్రపోయాను."
"నిద్రపోయావా?"
"పోయాను."
