కీర్తి మాట్లాడలేదు.
"సినిమా యాక్టర్ల బొమ్మని ముద్దు పెట్టుకుంటే ఏమొస్తుంది. నన్ను నీవు ముద్దు పెట్టుకో నిన్ను నేను ముద్దు పెట్టుకుంటాను."
"నేపోతాను" భయంగ అంది కీర్తి.
"ఏకాక్డికిపోతావ్ ఇప్పుడే అటు పెద్దపాముపోయింది. నామాట వినక పోతే ఆ పాము వచ్చి నిన్ను కరుస్తుంది. చెప్పినట్లు విను...." అంటూ ఆనంద్ మూర్తి కీర్తిని కౌగిలించుకొబోయాడు. వెంటనే "ఆగక్కడే" అన్న కేకతోపాటు చెట్టు చాటు నుంచి సతీదేవి వచ్చింది.
ఆనందమూర్తి నిర్ఘాంతపోయి చేతులు వెనక్కు తీసుకుని వెనక్కి జరిగాడు.
"ఊ...మంచి ప్లానే వేశావు, ఇదో వెర్రి బాగులది. అక్కా! ఆనందం తాతయ్య పంపిన బొమ్మని పెరట్లో యిస్తానన్నాడు. అక్కడంతా చీకటి. చీకటి అంటే నాకు భయం తోడురావా! అంది. రాణి చెప్పింది అర్ధం చేసుకోటానికి అయిదు నిమిషాలు పట్టింది. రాణిని కూర్చో పెట్టుకుని తాపీగా మాట్లాడుతూ అడిగాను. పిచ్చిమొద్దు వివరంగా చెప్పింది..."
"నేనేం పిచ్చి మొద్దునుకాను. నువ్వే అన్నీ అడిగిచెప్పించుకున్నావు." అంది కీర్తి కోపంగా.
"సరేలే కాసేపు నోరుమూసుకో" కీర్తిని మందలించి మళ్ళీ ఆనందమూర్తిని చివాట్లు పెట్టింది సతీదేవి.
"తిన్న యింటి వాసాలు లెక్కపెట్టటం అంటే యిదే. నా మీద నమ్మకంతో బాబాయిదీన్ని నాదగ్గర వదలివెళ్లాడు. రేపటిరోజు దీని కేమన్నా అయితే! రాణి చెప్పిందినిజమో అబద్దమో అని వచ్చాను. నిజమే. దీని తెలివి తక్కువ తనం గ్రహించి ఇంతకి తెగించావన్నమాట. ఇది నీ తెలివి కాదు కళ్ళు మూసుకుపోయిన నీలో కామం యీ సారికి వదులు తున్నాను. యింక వెళ్ళు, మరోసారి వెర్రి మొర్రివేషాలు వేశావో వారితో చెప్పి జైలుకి పంపిస్తాను. నీ బోటి వాళ్లకి అదే శిక్ష."
ఆనందమూర్తి క్షమించమని కూడా అనలేదు తల మాత్రం వంచుకుని"ఈ వెర్రిబాగుల ముం...ఎంత పనిచేసిందీ" అనుకుంటూ వెళ్ళాడు.
"ఆనందం బొమ్మ చూపించవూ!" కీర్తి నవ్వుని బిగబట్టుకుని వెళుతున్న ఆనందమూర్తి వుద్దేశించి అమాయకంగా అడిగింది.
"ఆ....చూపిస్తాడు. నాకీ సంగతి తెలియక పోతే నీ జీవితం సర్వనాశనం అయేది. జరిగింది చాల్లే పదపద." కోపంగా అంది సతీదేవి.
"అది కాదు అక్కా!"
"నోరు మూసుకుని పదమన్నాను పద." అంటూకీర్తి చేయి పుచ్చుకుంది సతీదేవి.
ఆ తర్వాత యిరువురు యింట్లోకి వచ్చేశారు.
వీళ్ళిద్దరూ అనుకున్న మాటలు ఆనందమూర్తి వినాలనే అలా మాట్లాడుకున్నారు. ఆనందమూర్తి విన్నాడు. రాణి నిజంగా వెర్రిదే అనుకోవాలికదా! అనుకున్నాడు.
కీర్తి సంగయ్య విషయము ఆనందమూర్తి విషయము సతీదేవితో చెప్పి ఎలా నాటకం ఆడాలి అన్నది కూడా చెప్పింది. ఆ పధకం ప్రకారం రాణి వెర్రిపిల్లగానే మిగిలిపోయింది. ఆనందమూర్తి ప్లాను బెడిసి కొట్టింది. యింక మిగిలింది సంగయ్య.
ఈ రాత్రి లోపల అదీ పూర్తి అవుతుంది.
కీర్తి వేసింది తిరుగులేని పధకం.
సతీదేవి సహకారం వుంది.
సంగయ్య ఖర్మకాలే సమయం దగ్గర పడింది.
13
రాత్రి పదకొండు పది.
కీర్తి పెద్దలైటు ఆర్పకుండా వుషారుగా కాళ్ళుఆడిస్తూ తన మంచం మీద పడుకుంది.
సంగయ్య కిటికీ దగ్గరకు వచ్చి లోపలికి చూశాడు.
"వెర్రి రాణీగారూ యింకా నిద్ర పోవటం లేదే నా రాక కోసం మేలుకుని లేదుకదా! యిది కోరికలు ఎలా తీర్చుకోవాలో తెలియక సినిమా బొమ్మలని ముద్దు పెట్టుకుంటున్నది. బొమ్మలని కాదే ముద్దు పెట్టుకోవాల్సింది. నాలాంటి మగాడిని" అని మాటలు చెపుతూ ఓ అడుగు ముందుకేసి...సంగయ్య కిటికీలోంచి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
సంగయ్య కిటికీ అవతల వున్నట్లు కీర్తి చూసింది. దుప్పటి చేతులోకి తీసుకుని ఆవులిస్తూ నిండా దుప్పటి కప్పుకోబోయింది. అది చూశాడు సంగయ్య. ఇది యింక దుప్పటి ముసుగేస్తున్నది. నిద్రలో పడ్డదంటే లేపినా లేవదు." అనుకున్నాడు.
కిటికీలోంచి చెయ్యి జాపి చిటికలు వేస్తూ "రాణీరాణీ" అని పిలిచాడు సంగయ్య.
కీర్తి కావాలని మాట్లాడలేదు.
"రాణమ్మా ఓయ్ రాణమ్మా" సంగయ్య స్వరం పెంచి పిలిచాడు.
"తాతయ్యా తాతయ్యా" అంటూ లేచి కూర్చుంది. కీర్తి.
"నేను రాణమ్మా" సంగయ్య అన్నాడు.
"ఏయ్ నువ్వా, నువ్వెందుకు అలా పిలిచావ్ మా తాతయ్య వక్కడే పిలవాలి రాణమ్మా! అని అంతే." కోపంగా అంది కీర్తి.
