Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 43


    ఆనంద్ ఆశ్చర్యంలోంచి తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది.
    "సారీ శ్రీపతిగారూ! మీ కూతురు అనూష మీరు చేష్టున్న పెళ్ళి కాదనుకుని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నా మీద ఆమె ఏ అభిప్రాయం ఏర్పరచుకుందో! నేను అత్యాశలకు పోయేవాడిని కాను. నేను మీ అనూషను పెళ్ళి చేసుకోవాలని కలలో కూడా ఊహించుకోలేదు. నాకు ఆ అర్హత లేదని నాకు తెలుసు. నా అంతస్తును నేనెన్నడూ మరిచిపోలేదు. అనూష నా దగ్గరకు వచ్చిన మాట నిజమే. కానీ నేనామెను మందలించి పంపాను." కవరును తిరిగి అతని చేతిలో పెడుతూ అన్నాడు ఆనంద్.
    శ్రీపతికి ఆనంద్ వ్యక్తితం అర్ధమయింది. అతను అంతస్తులు మరచిపోయి ఎగిరి గంతులు వేసే వ్యక్తి కాదనిపించింది. ఇందులో అనూష ప్రమేయమే కనబడుతున్నది. తను అనవసరంగా తొందరపడి ఆనంద్ ను అపార్థం చేసుకున్నాడు.
    "సారీ మిష్టర్ ఆనంద్! నా అంచనా తప్పింది. తప్పు మా అనూషలోనే ఉంది. పోనీ మీరు నాకొక సహాయం చేయగలరా?"
    శ్రీపతి తననుంచి ఏం సహాయం ఆశిస్తాడో ఆనంద్ ఊహించుకో గలిగాడు.
    అనూష తన కాళ్ళమీద తను నిలబడింది. జర్నలిజంలో విశేషమైన కృషి జరిపి పేరు తెచ్చుకుంది. స్త్రీల సమస్యల పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధకు పాఠకుల నుంచి, ప్రజల నుంచి విశేషమైన ప్రశంసలను అందుకుంటున్నది. చాలామంది అభాగ్యులకు స్వచ్చందంగా సేవ చేస్తున్నది.
    ఇటువంటి పరిస్థితులలో అవి అన్నీ వద్దని, కేవలం తండ్రి పరువు ప్రతిష్టలను నిలపడానికి తిరిగి ఆమెను వెళ్ళమనడం ఎంతవరకు ధర్మంగా ఉంటుంది?
    అన్నీ మానుకుని మామూలు జీవితంలోకి వెళ్ళిపొమ్మని అసలు తను మాత్రం సలహా ఇవ్వగలడా? ఇచ్చినా ఆమె పాటిస్తుందనే నమ్మకం ఏమిటి?
    అయినా, అతని నోటి నుంచి అసలు విషయం తెలుసుకోకుండా, తను ముందుగా అన్నీ ఊహించుకుంటున్నాడు. ఏ విషయమైనా తెలుసుకోవడం వలన నష్టం లేదనిపించింది.
    "చెప్పండి శ్రీపతిగారూ! మీకు నేనేవిధంగా సహాపడగలను?"
    "మిష్టర్ ఆనంద్! అనూషకు ఏది కావాలన్నా ఇస్తాను. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయను. ఇకనైనా ఇంటికి వచ్చేయమని చెప్పండి!" శ్రీపతి గొంతు వణికింది.
    "సారీ సార్! మీ తండ్రీ కూతుళ్ళ మధ్య నా రాయభారం ఎంతవరకు బాగుంటుందో మీరొకసారి ఆలోచించండి."
    "అలా ఎందుకనుకోవాలి ఆనంద్! అనూష, మీరు క్లాస్ మేట్స్. ఆ స్వాతంత్ర్యంతో అయినా మీరామెకు నచ్చచెప్పవచ్చుగా!" ఆశగా అన్నాడు శ్రీపతి.
    "మీ బాధను అర్థం చేసుకోగలను. మీరు ఆశించినట్టుగానే అనూషకు నచ్చచెప్పటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను" మాట ఇచ్చాడు ఆనంద్.
    "థాంక్స్ ఆనంద్! మీ మేలు మరచిపోను!" శ్రీపతి కృతజ్ఞతలను తెలియజేశాడు.
    అతని హృదయంలో భారం తగ్గినట్టయింది. సంతోషంగా అక్కడి నుండి కదిలాడు.
    అనూషకు ఎలా నచ్చచెప్పాలో, ఆమె మనసును ఎలా మార్చాలా అనే ఆలోచనలతో తలమునక లయ్యాడు ఆనంద్.


                             *    *    *    *


    "ప్రాణం తీసిన మరో లాకప్! పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్!"
    ఇవి ఆ రోజు పేపరు హెడ్ లైన్స్.
    'రవికుమార్ అనే కాలేజీ విద్యార్థిని పోలీసులు అక్రమంగా నిర్భంధించి, ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. అతను పోలీసు లాకప్ లో శవమైపోయాడు. ఆగ్రహోదగ్రులైన ప్రజలు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఇన్ స్పెక్టర్ వీరేష్ పై రాళ్ళు రువ్వారు. వీరేష్ స్పృహ తప్పాడు. ఉన్నతాధికారులు అదనపు బలగాలతో వచ్చి లాఠీఛార్జి చేసి అల్లరి మూకను చెదరగొట్టారు. పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. రవికుమార్ మరణానికి కారణమైన ఇన్ స్పెక్టర్ వీరేషును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇదీ ఆ వార్త సారాంశం.
    జరుగుతున్న అరాచకాలకు తల్లిదండ్రులు, పెద్దలు, రాజకీయ నాయకులు స్పందించడం లేదు.
    యువతకు అనుకోని స్వేచ్చ లభించడం వల్లనే ఈ దారుణాలు జరుగుతున్నాయా?  
    పుట్టుకతోనే ఎవరూ నేరస్థులు కారు. వారిని సమాజం తయారు చేస్తున్నది.
    'కేవలం పోలీసు ఆఫీసరును సస్పెండ్ చేయడం వలన తాత్కాలికంగా విద్యార్థినీ విద్యార్థుల ఆవేశాన్ని చల్లార్చగలిగినా, అసలు సమస్య పరిష్కారం అయ్యేదెప్పుడు? యువశక్తి నిర్వీర్యమైపోతున్నది. యువత పతనానికి ఎవరు కారకులు? ఎవరు బాధ్యత వహించాలి? పెదవులు దాటని మాటలు వీరేషుని వేధిస్తున్నాయి.
    అతని ముఖంలో నిస్పృహ, నిరుత్సాహం స్పష్టంగా కనిపించాయి డాక్టర్ లతకు.
    పోలీసు ఆఫీసర్లు శ్రమకు, ఒత్తిడికి అప్పుడప్పుడూ లోనవ్వడం సహజమే!
    "ఇవి చూస్తూ రిలాక్స్ అవ్వండి వీరేష్" అంటూ ఫోటో ఆల్బమ్ అతని చేతిలోపెట్టి తను లోపలకు వెళ్ళింది డాక్టర్ లత.
    అతను ఆల్బమ్ ను తిరగేస్తున్నా, అతని దృష్టి ఫోటోల మీద లేదు. అతని ఆలోచనంతా తను తన వృత్తిలో విఫలమవ్వడానికి గల కారణాలను వెదకడం వెంటే ఉంది.
    డాక్టర్ లత ద్రాక్షరసం తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. అతని దృష్టి ఫోటోల మీద లేకపోవడం గమనించింది.
    "అబ్బబ్బ! మనస్తత్వ శాస్త్రానికి కూడా అందని పోలీసు ఆఫీసరును చూస్తున్నాను. రిలాక్సవుతారని బృందావన్ గార్డెన్స్ ఫోటోలున్న ఆల్బమ్ ఇస్తే కనీసం అవి చూడాలన్న కోరిక కూడా మీలో కలిగినట్టు లేదే! ఔరంగజేబులా కళలంటే అయిష్టతా, లేక మీ డిపార్టుమెంట్ కళలకు దూరంగా ఉండమని ఆంక్షలు ఏమన్నా విధించిందా?" అంది నవ్వుతూ డాక్టరు లత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS