Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 43

"మామయ్య కులాసాగా వున్నాడు. మనం బస్సులో వెనుక సీటులో వుండటం వల్ల పెద్దగా దెబ్బలేమీ తగలకుండా క్షేమంగా బయటపడ్డాము, నా చేతికి దెబ్బ తగిలింది. మామూలుగా బెణికిందేమో అనుకున్నాను. ఉత్త బెణుకు కాదని లైట్ గా బొమిక ఫ్రాక్చర్ అయిందని, ఈ చేతిని ఇలా మెడకు వేసి కట్టారు. మరేం ఫరవాలేదు. అవసరానికి చేతిని బయటకి తీసుకోవచ్చు. ఈ పొజిషన్ లో ఇలా చెయ్యి ఉంచితే మాత్రం నెప్పిలేదు. అత్తయ్యా నీకు బాగా జ్వరం ఎక్కువ కావటంతో బస్సు ప్రమాదానికి లోను అయింది కూడా నీకు తెలియలేదు. వచ్చి డాక్టరు చేతిలో పడ్డాము కదా! ఇంక నీ జ్వరం కూడా తగ్గిపోతుంది... ..."
మోహనరావు చెప్పుకు పోతూంటే మధ్యలో అడ్డు తగిలి, 'మీ మామయ్య ఏరి?' అంది పార్వతి.
"మామయ్యని వెంటనే చంద్రం దగ్గరకి పంపించాను. నా చెయ్యికి దెబ్బ తగలకుండా వుంటే నేనే వెళ్ళి వుండేవాడిని." మోహనరావు పార్వతి నమ్మే విధంగా అబద్ధం ఆడాడు.
పార్వతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "బాబాయ్ చంద్రం దగ్గరకి వెళ్ళివుంటాడు" దగ్గుత్తితో అంది పార్వతి.
"పుండరీకాక్షయ్య బాబాయ్ సంగతి ఎవరికీ తెలియదు. ఆయన అన్నిచోట్లా ఆగుతూ తీరుబడిగా వెళతాడు. మామయ్యని ఏమాత్రం ఆలశ్యం చెయ్యకుండా ఏదేనా టాక్సీ చేసుకుని తొందరగా వెళ్ళమని చెప్పాను. టాక్సీ అంటే ఎక్కడా ఆగకుండా వెడుతుంది. మన చంద్రానికి ఏమీ పరవాలేదు. మామయ్య, చంద్రం ఇద్దరూ కలిసి వస్తారు చూడు." పార్వతికి వుత్సాహమూ, ధైర్యమూ కల్పిస్తూ అన్నాడు మోహనరావు.
"అలా జరుగుతుందంటావా?" ఆశగా అడిగింది పార్వతి.
"తప్పకుండా, నువ్వే చూస్తావుగా అత్తయ్యా!"
అవతల ఏం జరిగిందో తెలియని పార్వతి మోహనరావు మాటలకి కాస్త తృప్తిపడి బాగా నీరసంగా వుండటంతో నిసత్తువుగా కళ్ళు మూసుకుంది.
"ఆడవాళ్ళ వార్డులో మగవాళ్ళు వుండకూడదు. నేను ఇక్కడే తిరుగుతూ వుంటాను అత్తయ్యా! మళ్ళీ కాసేపట్లో వస్తాను. అని పార్వతితో చెప్పి మోహనరావు ఇవతలకి వచ్చేశాడు.
అటు వార్డులోకి వెళ్ళి మామయ్యని చూసి, వచ్చి ఆస్పత్రి వరండాలో బెంచీమీద కూర్చున్నాడు.
మోహనరావు ఆలోచనలు పరి పరివిధాల పోతున్నాయి.
"అత్తయ్యతో తను చాలా పెద్ద అబద్ధం ఆడాడు. ఒకేసారి భర్తా, కొడుకూ, ప్రాణాపాయ స్థితిలో వున్నారని తెలిస్తే ముందు అత్తయ్య బ్రతకదు. పోనీ, వీళ్ళిద్దరినీ విడిచి, ఉరుకుల పరుగుల మీద చంద్రం దగ్గరకి వెళదామంటే ఇప్పటికే ఆలశ్యం అయింది. అయినా కూడా టాక్సీ చేసుకుని ఆఘమేఘాల మీద వెళ్ళవచ్చు. ఇక్కడ ఆస్పత్రిలో వున్న మామయ్యనీ, అత్తయ్యనీ చూసేదెవరు? ఉన్న విషయం అత్తయ్యకి చెప్పి చంద్రం దగ్గరకి తాను వెళ్ళవచ్చు. కానీ, అత్తయ్య ధైర్యం తెచ్చుకోవలసినది పోయి, అధైర్యంతో పూర్తిగా దిగజారి పోతుంది. ఈ వార్త షాక్ లాగా తగిలి స్పృహ కోల్పోయినా కోల్పోవచ్చు. మళ్ళీ జ్వరం ముంచుకు రావచ్చు. భగవంతుడా! నన్నెంత ఇరకాట పరిస్థితిలో పడవేశా వయ్యా! ఇక్కడ ఉండలేను, అక్కడకి వెళ్ళలేను. చూస్తూ చూస్తూ పెద్ద అబద్ధం కూడా ఆడేశాను__ __"
ఏ దిక్కూ తోచక మోహనరావు తనలో తాను బాధపడుతూ ఆలోచిస్తూ వుంటే,
"ఏమయ్యా! మోహనరావూ!" అన్న పిలుపు వినబడింది.
ముందు మోహనరావు వినిపించుకోలేదు. మరోసారి తన పేరు దగ్గరగా వినరావడంతో మోహనరావు తలెత్తి చూశాడు.
ఎదురుకుండా రామానుజాచారి ప్రత్యక్షమయ్యాడు.
రామానుజాచారి ఎవరో కాదు, వాళ్ళ వూళ్ళో గుళ్ళో పూజారి, బాగా తెలిసిన వాడు. మోహనరావు గుడికి వెళ్ళినప్పుడల్లా రామానుజాచారితో గంటసేపు కబుర్లు వేసుకుని గాని ఇవతలకి రాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS