ఎవరబ్బా ఆమె? నాకు తెలియని స్నేహితులెవరూ వాడికి లేరే? బహుశా కాలేజీలో క్లాస్ మేటు అయివుంటుందేమో? ఫూల్ కు కామన్ సెన్సు లేదు. భార్య వస్తుందని తెలిసికూడా ఏమిటీ వేషం!
అనుకుంటూ బెడ్ దగ్గరగా వెళ్లి బూటు కాలు చప్పుడు చేశాను.
వెంటనే ఆమెలేచి తల దగ్గరగా నిల్చుని దిండు సర్దసాగింది. నాకు వాళ్ళిద్దరిమీదా పట్టరాని కోపం వచ్చింది.
"వెళ్ళనివాడివి ముందే చెప్పలేక పోయావా! ఇంకెవర్నయినా పంపేవాణ్నిగా స్టేషన్ కు!" మా ఇద్దరికేసి చిరాగ్గా చూస్తూ అన్నాడు సుబ్బారావు.
టైఫాయిడ్ ఎఫెక్టయి వుండాలి. లేకపోతే ఏమిటి? వీడి ముఖం! వీడి మాటలూ వీడూను!
చెప్పొద్దూ నాకు చిర్రెత్తుకొచ్చింది.
"వారున్న దెక్కడండీ?" ఆ గదిలో బెడ్ లన్నీ కళ్ళతో గాలిస్తూ ఆదుర్దాగా అడిగింది. రెండడుగులు ముందుకువేసి నేను స్టేషన్ నుంచి వెంటబెట్టుకొచ్చిన యువతీ.
నాకు క్లోరోఫారం ఇచ్చినట్టయింది. చెవుల్లో "గుయ్" అంటూ ధ్వని, కత్తులు, పటకార్లు - ఆపరేషన్ సామాన్లు విన్పిస్తున్నాయ్ కళ్ళకు. నోటికి మాట పెగలక చేతితో సుబ్బారావును చూపించాను.
ఆమె ముఖం రోషంతో ఎర్రబడింది. అవమానంతో కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. కనుబొమ్మలు ఒకదానిచుట్టూ వొకటి మెలి తిరగ ప్రయత్నిస్తున్నాయ్. తల పక్కకు తిప్పుకుంది.
"పొద్దుటినుంచీ కాఫీకూడా తాగలేదు. స్టేషన్ లోనే రెండు గంటలదాకా వుండి, విసుగుపుట్టి హాస్పిటల్ కు వచ్చి నాలుగయిందాకా గేటులో పడిగావులు పడింది. నానా అవస్థా పడి ఇంతకుముందే ఇక్కడకు చేరుకుంది." అన్నాడు గుక్కతిప్పుకోకుండా సుబ్బారావు.
"వీరినే నీకోసం స్టేషన్ కు పంపించాను. నా ఫ్రెండ్! రామారావు." అంటూ తన మంచం పక్కనవున్న ఆమెకు పరిచయం చేశాడు సుబ్బారావు.
"కాఫీ లేక తలనొప్పి కూడా వచ్చిందట. రూంకు తీసుకెళ్ళు. రేపు వుదయం రండి. మర్చేపోయాను అడగటం. వారెవరూ?" నేను తీసుకొచ్చిన యువతి గురించి ప్రశ్నించాడు.
అంతవరకూ గోడకేసి చూస్తూ నిల్చున్న ఆమె గిర్రున తిరిగి "ఏం పెద్దమనుషులండీ మీరు? ఇదేనా మర్యాద? ఆడది వంటరిగా కన్పిస్తే మోసం చేయ్యడమేనా?" తీవ్రంగా అన్నది.
"ఏమిటండీ! ఏం జరిగిందీ!" సుబ్బారావు పొడారిన కంఠంతో తడబడుతూ అన్నాడు.
"ఇంకేం జరగాలి? జరగాల్సిందంతా జరిగింది. ఏదో మెత్తగా, మర్యాదగా ప్రవర్తిస్తే నిజమే అనుకున్నా మొదట్లో. చదువుకున్న మీలాంటివాళ్ళు చెయ్యాల్సిన పనేనా ఇది? మద్రాసులోవున్న తెలుగువాళ్ళు తెలుగు స్త్రీలకు చూపాల్సిన మర్యాద ఇదేనా?" ఆమె చివాట్లు వేస్తుంటే నేనూ, మా సుబ్బారావూ తెల్లముఖాలు వేశాం.
"ఏమిట్రా ఈ కర్మ!" లోపల ఎవరో అడుగుతున్నట్టు అన్పించింది నాకు.
"ఏమిటిరా ఈ బుద్ధి! మొదల్లే నిల్చుని మాట్లాడవేం?" కొంచెం పైకి లేచి దుడుగ్గా అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు భార్య మా ఇద్దర్నీ తెల్లబోయి చూస్తూ నిల్చుంది.
బుర్ర పనిచెయ్యడం లేదు. కంఠం పెగల్డం లేదు. కళ్ళకు తెల్లదుస్తులలో వున్న డాక్టర్లూ, నర్సులూ అందరూ ఒకటిగానే కన్పిస్తున్నారు.
"మా వారు మద్రాసులో ఒక ఫిలిం కంపెనీలో పనిచేస్తున్నారు. మెయిల్ లో రావల్సిందని ఉత్తరం రాశారు. మెయిల్ మిస్ అయ్యాను. ఎటూ స్టేషన్ కు వస్తారు గనక ప్యాసింజరు చూడకుండా వెళ్తారా అనే భావంతో ప్యాసింజరులో వచ్చానండీ..." దుఃఖం అవమానం ఆమె కంఠంలో ఒకదాన్నొకటి ఒరుసుకున్నాయ్.
"అయితే మీవారు రాలేదాండీ స్టేషనుకు!" మధ్యలోనే అందుకొని అడిగాడు సుబ్బారావు.
"ఏమో మరి! దిగీదిగక ముందే వారికి జబ్బుగా వుందనీ తన్ను నా కోసం పంపించారనీ, నమ్మించి ఈ పెద్ద మనిషి నన్నిక్కడకు తీసుకొచ్చాడు." అన్నది తీవ్రంగా ఆమె.
"క్షమించండి! ఎంతపని జరిగిందీ!" అన్నాడు సుబ్బారావు నాలాంటి స్నేహితులుండటం శిక్షగా భావిస్తున్నట్టు.
"మా సుశీల వస్తుందని స్టేషన్కు పంపేను. పొరపాటున మీరేనని తీసుకువచ్చి వుంటాడు. అన్యధా భావించకండి!" అంటూ తన భార్యను పరిచయం చేశాడు.
"మరేం ఫరవాలేదు. మా ఆవిడా, వాడూ వచ్చి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతారు. మీ వారి పేరు!"
"సుబ్బారావు! అందుకే పొరపాటు పడ్డాను. ఆంధ్రదేశంలో ప్రతి పదిమందిలో ఒకడు సుబ్బారావేనాయే!" నా తప్పేం లేదన్నట్టూ, తప్పంతా పేరులోనే వున్నట్టూ అన్నాను.
సుబ్బారావు నవ్వాడు. సుశీల పైటకొంగు నోటికి అడ్డం పెట్టుకొని కిసుక్కున నవ్వింది.
"అడ్రసు ఏమిటమ్మా!" అడిగాడు సుబ్బారావు.
"త్యాగరాజనగర్. ఆ ఫిలిం కంపెనీ పేరు తెలియదండీ! కొత్తగా పెట్టారట." దాదాపు ఏడుపు గొంతుతోనే అన్నది.
"చచ్చాం పో! ఫిలిం కంపెనీలకు ఫోన్ చేసినా ప్రతి కంపెనీలో ఒక సుబ్బారావైనా తేల్తాడే?" అన్నాను మైకం వదిలి మామూలు స్థితికి వచ్చిన నేను.
"ఏడ్చావులే? ఫర్వాలేదమ్మా! దిగులు పడకు. అతని దగ్గరకు మిమ్మల్ని చేర్చే బాధ్యత మాది." అన్నాడు సుబ్బారావు.
"మీ పేరేమిటండీ?" ఆమె చెయ్యి పట్టుకొని చొరవగా అడిగింది సుశీల.
"సావిత్రి" ప్రాణం కుదుటపడింది. వికసించిన ముఖంతో అన్నది.
"సాయంత్రం టీ నగర్ వెళ్ళి ఆ సుబ్బారావుగారు ఏ కంపెనీలో వున్నారో తెలుసుకో!" అన్నాడు మా సుబ్బారావు.
"క్షమించండీ!" ఇద్దర్నీ ఉద్దేశించి అన్నాను.
"పొరపాటుకు ఎవరేం చేస్తారులెండి." ఇద్దరూ ఒకేసారి అన్నారు.
"క్షమించండి ఆరయింది. ఇక వెళ్ళాలి." అంది నర్స్.
... ... ...
"క్షమించండి పదయింది." నిద్ర ముంచుకొస్తూ వుంటే కళ్ళు మూసుకొని అన్నది సుధ రామారావుతో.
"అందుకే! ముందుగానే చెప్పాను. చివరివరకూ వినాలని?" అన్నాడు రామారావు.
"మా గొప్ప పరిచయం లేండి? ఇహ పడుకోండి. నాకు నిద్దరొస్తుంది." అంటూ పక్కకు ఒత్తిగిలి పడుకుంది సుధ.
"ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే?" గొణుక్కుంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు రామారావు.
