"తోకలో ప్రాణం తలలో కొస్తుంది" అంటూ రాంసింగు మాటలను పూర్తి చేశాను.
ఇరువురం పక పక నవ్వుకున్నాము.
నేను ఇలా రోజూ పోలీస్ స్టేషను చుట్టూ తిరిగితే నాకు లాభం లేకపోగా నష్టం. పైగా బాస్ గాడు వెధవ తెలివితేటలు ఉపయోగించి మమ్మల్ని ఏదయినా కేసులో ఇరికించినా ఇరికించవచ్చు. లేకపోతే హతమార్చే ప్రయత్నం అయినా చేయవచ్చు. ఈ రెండు ఆపదలు తప్పించుకోవాలంటే బెస్ట్ పని మేము మాయంకావటం. మాయం కావటానికి ప్రత్యక్షం కావటానికి మంత్రశక్తులు లాంటివి మా దగ్గర లేవు కాబట్టి మారువేషాలలోకి మారిపోయాం.
సర్దార్జీల వేషం అయితే మీసాలు గడ్డాలతో ముఖం సగం కప్పేసుకోవచ్చు. తలకి పాగా వుంటుంది. నల్ల కళ్ళద్దాలు ధరించామంటే చాలు నర మానవువు పట్టలేడు.
నేను ఎప్పుడూ వుండే రూమ్ ని అలాగే వుంచాను. కొద్దిగా సామాను బట్టలు ఒక సూట్ కేస్ లోను బ్యాగ్ లోను సర్దాను. దాచిన కాస్త డబ్బు దగ్గర పెట్టుకున్నాను. రూమ్ కి తాళం వేసి మారుమూల ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాను.
"నేను నా మిత్రుడు బిజినెస్ నిమిత్తం ఈ వూరు వచ్చామని... హోటల్ రూమ్ లో నెలరోజులు వుంటామని..." చెప్పి రూమ్ లో దిగాను.
ఇంక ఇప్పుడు నేను చేయవలసినది బాస్ గాడిని వెతకటం ఒకటి, ఇన్ స్పెక్టర్ వర్ధనరావుని తప్పుదోవ పట్టించటం మరొకటి.
కాఫీ తిఫెన్ పూర్తయింది. నా ఆలోచనలు రాంసింగ్ కి చెప్పాను.
"ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి హెడ్ లేదనుకోకు యార్! ఒక్కోసారి ఆశ్చర్యపోయేలా అతి తెలివితేటలు చూపిస్తుంటాడు. ఎలాగూ ఇన్ స్పెక్టర్ ని తప్పించుకుని మారువేషాలలోకి మారిపోయాం. ఆయనగారిని అలా వదిలేసి బాస్ ని వెతకటంలో పడితే సరిపోతుంది కదా?" రాంసింగ్ తనకొచ్చిన ఆలోచన చెప్పాడు.
"నీకు తెలియదు మిత్రమా! ఇన్ స్పెక్టర్ వర్ధనరావు దిగ్రేట్ ని మనం చేతిలో వుంచుకోవటం మంచిది. పిచ్చి మానవుడు మనకంటూ ఆపదవస్తే కాస్త మాటలతో ఉబ్బిస్తెచాలు వదిలిస్తాడు. ఫోన్ చేస్తాను తమాషాగ."
"అంతేనంటావా?"
"అంతే."
"సరే నీయిష్టం. నీవు నా బాస్ వి గురువ్వి మిత్రుడిని ఇంకా ఇంకా..."
"ఇంకచాలు" నవ్వుతూ రాంసింగు నోరుమూశాను.
"అయితేసరే నీమాట నాకు వేదవాక్కు హోటల్ నుంచి ఫోన్ చేద్దామా?"
"వద్దు బైటికి వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేద్దాము. ప్రతిది ప్తానుగా చేయాలి."
"నీయిష్టమేనా యిష్టం. పద." రాంసింగు వేస్తూ అన్నాడు.
రూమ్ బాయ్ ని పిలిచి ఖాళీచేసిన పేట్లని కప్పు సాసర్లని తీయించాను. రూమ్ తలుపుకి తాళం వేసి హోటల్ నుంచి బైటకి వచ్చాము.
పబ్లిక్ టెలిఫోన్ బూత్ రెండు వీథుల అవతల వుంది. అక్కడికి బైలుదేరాము.
21
సాయంత్రం
అయిదు అయిదు నిమిషాల సమయంలో
డ్యూటీలోవున్న ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి చేతిలో నిండా పనిలేక పోవటంతో కుర్చీలో జారగిలబడి ఎదుటి టేబుల్ మీద కాళ్ళుపారేసి అర్థ నీలిమి నేత్రాలతో పైకప్పుకేసి చూస్తూ తీవ్రాలోచన చేస్తూ వుండిపోయాడు.
హెడ్ కానిస్టేబుల్ అహోబిలం కర్ చీఫ్ ని తిర్రి (మెలిపెట్టి) లాగ తయారుచేసి చెవిలోకి పోనిచ్చి కర్ చీఫ్ ని కదిలిస్తూ దురదగ వుంటే ఉపశమన వైద్యం చేస్తున్నాడు.
సరీగ అప్పుడు మోగింది టేబుల్ మీద వున్న ఫోను.
ఒక్కసారిగా అటు వర్ధనరావులో ఇటు అహోబిలంలో కదలిక ఏర్పడింది.
అహోబిలం రెండేరెండు అంగల్లో టేబుల్ దగ్గరకు వచ్చి రిసీవర్ తీసి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చేతికి యిచ్చాడు.
"హలో" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గాంభీర్యంగా అన్నాడు.
"నేను బాస్ లకే బాస్ ని. నా కంఠస్వరం గుర్తుపట్టావా?" అవతల నుంచి వినవచ్చింది.
"గుర్తుపట్టావా?" అని వాడు ఏకవచనంతో తనంత వాడిని సంభోధించటం వర్ధనరావుకి మండింది. "ఆ... ఇంతోటి స్వరాన్ని గుర్తుపటనా ఏంటి? గార్థభస్వరమా నీవూను. ఏం చెప్పదలచుకున్నావో చెప్పి తగలడు." చాలా కఠినంగా అన్నాడు.
