అమాయకురాలనా?
లేక భారతిలో కొట్టొచ్చినట్లు కనబడే తనలోని కొన్ని పోలికలని చూసి కాదు కదా! అనుకొంది.
ఆమెను చూస్తుంటే ఏదో అనుబంధం ఇద్దరిమధ్య వున్నట్టుగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతోంది అవంతికి.
అవంతి లేచి భారతి దగ్గరగా వచ్చి ఆమె భుజాలపై చేతుల్ని వేసి లాలనగా అంది.
"ప్లీజ్ నువ్వు కాస్త శాంతంగా మాట్లాడు. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? నీలాంటి చెల్లెలు వుంటే ఎంత బాగుండేదోకదా అనుకొంటున్నాను. నీ అక్కలాంటి దాన్ని నేను. దయచేసి నీకేం కావాలో చెప్పు. నాకు తెలిస్తే చెపుతాను చేయగలిగితే సాయం చేస్తాను" అంది.
"నీ సహాయం నాకేం అవసరంలేదు. నేను అడిగిం దానికి సమాధానం చెప్పు."
"ఓ.కె. అడుగు"
భారతి రెండు క్షణాలు తటపటాయించింది.
"ఫర్వాలేదు. నీకు ముందే చెప్పాను. నీ అక్కలాంటిదాన్ని. నా నుంచి నువ్వు తెలుసుకోగోరే ఏ విషయమైనా సరే నీకు పనికొస్తే నాకదే సంతోషం" అంది అవంతి.
"మనోహర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది భారతి.
అవంతి లోలోపలే నవ్వుకుంది. భారతి అదే ప్రశ్నవేస్తుందని ముందుగానే ఊహించింది.
"పెళ్ళిచూపులా?" అంది నవ్వుతూ.
భారతి ఈసడింపుగా అంది.
"ఆ మొహానికి పెళ్ళిచూపులు కూడానా?"
"రోగ్" కటువుగా అంది.
"అతను 'రోగ్' అని చెప్పడానికి ఇంతదూరం కష్టపడి వచ్చావా!"
భారతి అవంతికేసి తీక్షణంగా చూసింది.
"అవును అతను వ్యభిచారి, తాగుబోతు, జూదగాడు. అందుకే రోగ్ అన్నాను."
"అన్నీ తెలిసిన దానివి మరి నా అభిప్రాయాన్ని అడగడందేనికి?"
"అతన్ని హెచ్చరించమని చెప్పటానికొచ్చాను"
"నువ్వు చాలా అమాయకురాలివి భారతీ! ఒక మనిషిగా అతనివల్ల ఇతరులకి హాని జరిగినప్పుడు అతన్ని దుర్మార్గుడు, రోగ్ అనుకోవచ్చు. కానీ వ్యక్తిగతమైన అలవాట్లని బట్టి మనిషిపైన ఓ ముద్రవేయడం తప్పు. వ్యభిచారం అతని వయసుకి సంబంధించిన విషయం తాగుడు అతని వ్యక్తిగతమైన అలవాటు. పోతే హంతకుడు అని అన్నావు చూడు ఆ మాటని ఉపసంహరించుకో. ఏ ఆధారంలేకుండా ఓ మనిషిని హంతకుడిగా ఎలా నిర్ధారిస్తావు! నిజంగా అతను నేరస్తుడైతే చట్టం ఎలా విడిచిపెడుతుందనుకొన్నావు?"
"శిక్షపడనంతమాత్రాన చట్టంనించి తప్పించుకొన్నంత మాత్రాన అతను మంచివాడవుతాడా?"
మనోహర్ అంటే ఆమెకి చాలా ఆగ్రహంగా వుందని అవంతి గ్రహించింది.
"సరే మనమధ్య ఆర్గుమెంట్ ఎందుకుగానీ అసలు విషయం చెప్పు. మనోహర్ నిన్నేమన్నా అన్నాడా"
"నా జోలికి రావద్దని హెచ్చరించాలి."
"నువ్వే చెప్పకపోయావ్?"
"అతనెవరో నాకు తెలీదు. నువ్వే నా ఖర్మకొద్దీ అతన్ని నాకు పరిచయం చేశావు. అంచేత నువ్వే చెప్పడం కరెక్ట్ అనుకొంటాను" అంది భారతి.
"ఓ.కె. అలాగే చెబుతాను. కానీ వినకపోతే!"
భారతి అవంతికేసి అదోలా చూసింది.
"నువ్వు చెబితే వింటాడన్న నమ్మకం నాకుంది" అంది భారతి.
"నీకు నమ్మకం వుంటే అలాగే చెబుతాను. కానీ నేనో మాట చెప్పనా!"
"ఏమిటి?"
"అతను నువ్వనుకొనేంత రోగ్ కాదు. మనిషిగా చాలా మంచివాడు" అంది అవంతి.
భారతి అదోలా చూసింది.
"అంత రూఢీగా చెబుతున్నావంటే అతనితో నీ స్నేహం ఎంతవరకూ వున్నదో తెలుసుకోవచ్చా" అని అడిగింది.
"ఓ ఆడ మగా మధ్యవుండే చనువు మా మధ్యన వుంది" అవంతి గంభీరంగా అంది.
"సిగ్గనిపించడం లేదా ఇలా చెప్పుకోడానికి, పైగా అతను మంచి వాడని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నావు!" భారతి అసహ్యంగా అంది.
"నా మనస్సాక్షికి చెందినంతవరకూ అది సిగ్గని నేననుకోను. అది నా సొంత విషయం."
"ఇట్స్ ఆల్ రైట్. ఎవరే గంగలో దిగినా నాకు అనవసరం. నీకు చెప్పింది గుర్తుంచుకొని అతనికి చెప్పు, బై" అంది లేచి నిలుచుంటూ భారతి.
అవంతి భారతితో బాటుగా గేటుదాకా వచ్చింది.
"నే వెళతాను" అంది భారతి.
"భారతి, చిన్నమాట. గతంలో మనిషి చెడ్డవాడయినంతమాత్రాన చెడ్డవాడిగానే మిగిలిపోడు. అతనిలో పశ్చాత్తాపం కలిగి మంచివాడు కాకూడదన్న రూలెక్కడా లేదు. మనోహర్ నిన్ను ప్రేమిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు" అంది అవంతి.
భారతి చెక్కిళ్ళు ఎర్రబడినాయి.
"అతని ప్రేమని సమర్థిస్తున్నావా. నన్ను కూడా అతన్ని ప్రేమించమని సలహా ఇస్తున్నావా?" తీక్షణంగా అడిగింది భారతి.
"అది నీ వ్యక్తి గతమైన విషయం. నేనిలాంటి విషయాల్లో సలహాలివ్వను."
"అతనితో సంబంధం వుందని సిగ్గులేకుండా చెప్పినదానివి. నువ్వే అతన్ని కట్టుకోవచ్చుగా?"
భారతి మాటలకి అవంతికి ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ వచ్చిన ఆవేశాన్ని సంభాళించుకుంది అవంతి.
"దిసీజ్ అవంతి, అవంతంటే ఏమిటో నీకు తెలీదు. నేను పెళ్ళికి వ్యతిరేకిని. నే నీజీవితంలో పెళ్ళి చేసుకోను"
ఆమె మాటలకి భారతి విస్తుపోయింది. అవంతి అక్కడ నించి విసురుగా లోపలికి నడిచింది.
భారతికి ఉక్రోషం వచ్చింది. అక్కడినించి వడివడిగా అడుగులు వేసింది.
అవంతి చాలా రియాక్టు అయింది భారతి మాటలకు.
