Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 44


    అదే వాళ్ళు చేసిన పొరపాటు.

 

    వాళ్ళకంటే ముందు నడుస్తున్న గణపతిరాజు ఆ శబ్దాలకు ఆగిపోయాడు.

 

    అంత రాత్రిపూట తమ వెనుక ఎవరొస్తున్నారో ఊహించుకోలేకపోయాడు గణపతిరాజు. "ఎవరు వస్తున్నది?" అని అడిగాడు.

 

    అతను అనుచరులిద్దరూ ఒకేసారి "తెలియదన్నా" అన్నారు.

 

    "చాలామంది వున్నట్టున్నారు. అదీ స్త్రీలు. ఎవరై వుంటారు?" ఆలోచనలో పడ్డట్టు మరిక ఏమీ మాట్లాడలేదు గణపతిరాజు. వాళ్ళెవరో తెలిసేవరకు అక్కణ్ణుంచి కదలదలచుకోలేదు.

 

    తమముందు అంత ప్రమాదం వుందని తెలియని తరుణ్ అమ్మాయిలతో అవీ ఇవీ మాట్లాడుతూ వస్తున్నాడు.

 

    సినిమా టెంట్ లోనే గణపతిరాజు అతన్ని గుర్తించేవాడు. కానీ కొద్దిలో మిస్ అయింది. అదెలా జరిగిందో తెలియడానికి మనం గంట వెనక్కి వెళ్ళాలి.

 

    ఇంట్రవెల్ లో బయటకు వెళతానని తరుణ్ లేవబోయాడు. కానీ మౌనిక వారించింది.

 

    "మీరు ఇప్పుడే లేచారంటే అందరిచూపూ యిటు డైవర్ట్ అవుతుంది. అంతా అమ్మాయిలంగదా! ఇక సినిమా ఎవరూ చూడరు. ఇంతమంది ఎవరనే ఆరా తీస్తారు. మేమెవరో తెలియదనుకోకండి. ముఖాలను ఎప్పుడూ చూడకపోయినా మేమెవరో సులభంగానే పోల్చుకోగలరు"

 

    "అలా అయితే వెళ్ళనులే"

 

    విశ్రాంతి అని తెరమీద పడగానే గణపతిరాజు మాత్రం బయటికి వెళ్ళాడు. పాన్ పరాగ్ అయిదు ప్యాకెట్లు తీసుకొచ్చి నములుతూ వుండిపోయాడు.

 

    సినిమా మరో పదినిముషాల్లో ముగుస్తుందనగా హఠాత్తుగా కరెంట్ పోయింది.

 

    "ఏం సినిమారా ఇది?" అంటూ లేచాడు గణపతిరాజు విసుగ్గా ముఖం పెట్టి. అతని యిద్దరి అనుచరులకూ వుండాలని వున్నా యిక తప్పదని లేచారు.

 

    గేటు దగ్గర వున్న వ్యక్తిని గణపతిరాజు అడిగాడు. "కరెంట్ ఎప్పుడొస్తుందో? జనరేటర్ వుందా?"

 

    "లేదు సార్!"

 

    "అయితే ఇక వెయిట్ చేయడం దండుగరా" తన అనుచరులతో అని బయటపడ్డాడు.

 

    అలా తప్పిపోయింది గండం.

 

    "వాళ్ళూ సినిమా నుంచే వస్తున్నట్టున్నారు " అన్నాడు గణపతిరాజు కాసేపు మౌనం తర్వాత.

 

    "అవునన్నా! ఈ పక్క పల్లెలేమైనా వున్నాయా? సినిమా నుంచి ఇంటికిపోతున్నారేమో" తనకు తోచింది చెప్పాడు శ్రీను అనే గణపతిరాజు అసిస్టెంట్.

 

    "కాసేపాగి చూద్దాం"

 

    ముగ్గురూ నిలబడిపోయారు.

 

    మరో అయిదు నిమిషాలకి ఓ ఇద్దరు వస్తున్నట్లు తోచింది. వాళ్ళు మరింత దగ్గరయ్యారు.

 

    గణపతిరాజు ముందుకు కదిలి "ఏ వూరయ్యా!" అని వాళ్ళని అడిగాడు.

 

    వాళ్ళిద్దరూ మగవాళ్ళే. నడివయసు వుంటుంది.

 

    "మాది సెంటర్ బాబూ! విమలాబాయి ఆశ్రమం వెనుక" ఒక వ్యక్తి చెప్పాడు.

 

    గణపతిరాజు అగ్గిపుల్ల గీశాడు.

 

    వాళ్ళ వేషం చూస్తూనే కూలీలనిపించింది.

 

    "మీరేనా వస్తోంది. ఇంకా ఎవరైనా వున్నారా?" మరో వ్యక్తి ఈ ప్రశ్నకు భయపడ్డాడు. కొంపదీసి వీళ్ళు దొంగలు కాదు కదా అనిపించింది.

 

    "వెనుక ఆడోళ్ళు వస్తున్నారు బాబూ!"

 

    "ఆడోళ్ళా! మీవాళ్ళా?"

 

    "కాదు బాబూ! ఆశ్రమంలో వుండే అమ్మాయిలనుకుంటా. ఎవర్నో బస్సు ఎక్కించి వస్తున్నట్లున్నారు"

 

    సెంటర్ కు చెందిన వాళ్లిద్దరూ విమలాబాయి ఆశ్రమానికి పనులకు వస్తుంటారు.

 

    విమలాబాయి ఆశ్రమంలో తరచూ పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అలాంటప్పుడు వీళ్ళు కూలికి వచ్చి కట్టెలు కొట్టడంలాంటి పనులు చేస్తుంటారు. అందువల్ల అనాథ మహిళాసదన్ గురించి తెలుసు.

 

    వాళ్ళు అలా చెప్పగానే గణపతిరాజు మెదడులో ఓ చిక్కు ప్రశ్న విడిపోయినట్టనిపించింది.

 

    "ఎంతమంది వుంటారు సుమారుగా?" అని అడిగాడు.

 

    "ఎక్కువగానే వున్నారు బాబూ! సుమారు యిరవై మంది దాకా వుండొచ్చు"    

 

    విమలాబాయి దగ్గర తను వున్నప్పుడు మౌనిక అనే అమ్మాయి రావడం, దారిలో ఆమెను అటకాయించి  అడిగితే చెప్పిన జవాబులు, డాక్టర్ మాటలు, అన్నీ ఒకదానికొకటి పేర్చి చూస్తే తరుణ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. సంతోషంతో కేక పెట్టబోయి ఆగిపోయాడు.

 

    "మేం వస్తాం బాబూ!" కొత్తవాళ్ళు వెళ్ళిపోయారు.

 

    మరిప్పుడు వాళ్ళల్లో తరుణ్ వున్నాడని వూహించలేకపోయాడు.

 

    తరుణ్ అంత ధైర్యంగా రాత్రిపూట సంచరిస్తాడని అనుకోలేకపోయాడు.

 

    అనాథ మహిళాసదన్ లో తరుణ్ వుంటే అతన్ని బయటికి రప్పించి, తన పని తాను చేయడం పెద్ద కష్టమైన పనేం కాదని తెలుసు. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేసి చెక్ చేస్తే ఈ విషయం తెలిసిపోయి అతను పారిపోయే అవకాశం కూడా వుంది. అంతా సడెన్ గా జరిగిపోవాలి. ఇక యిక్కడ వుండటం అనవసరం.

 

    "మరి రండిరా" తమ బాస్ బయలుదేరగానే అసిస్టెంట్లు కూడా బయలుదేరారు.

 

    పదడుగులు వేశాక చెప్పాడు గణపతిరాజు - "తరుణ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది."

 

    పక్కనే నడుస్తున్న ఇద్దరూ ఒక్క క్షణం ఆగిపోయారు. "ఎక్కడన్నా?"

 

    "ఇక్కడే" వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు.

 

    ఆ విషయం పసికట్టే అన్నాడు గణపతిరాజు.

 

    "ఇక్కడే అంటే... అనాథ మహిళా సదన్ లో"

 

    వాళ్ళు ఆశ్చర్యపోయారు.

 

    "అది అమ్మాయిలుండే ప్లేస్ కదన్నా" తన సందేహాన్ని వెలిబుచ్చాడు రాజు.

 

    "అవును! అందులోనే వుండాలి. మనం తరుముకొచ్చినప్పుడు పొరబాటున అక్కడికి వెళ్లుండాలి. తన దీనావస్థను చెప్పుకుని సెటిలై పోయాడు."

 

    అంతా కరెక్టుగానే వూహించాడు గణపతిరాజు.

 

    అప్పుడు గుర్తొచ్చింది రాజుకి. "నిజమే అన్నా! నిన్న అచ్చం తరుణ్ లగే వున్నవాడు మతగురువులాగా వెళ్లడం చూశాం. సందేహం వచ్చి అడిగాము కూడా. ఏదో తలతిక్కగా సమాధానం చెబితే తరుణ్ కాదని వదిలేశాం. ఇప్పుడు ఆలోచిస్తే అతను తరుణ్ అయి వుంటాడనిపిస్తోంది."

 

    అతను చెప్పడం అపాడో లేదో అతని చెంప చెళ్ళుమంది. అంత చీకట్లోనూ గురి తప్పకుండా కొట్టాడు గణపతిరాజు.         


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS