ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాత్రి భోజనం కూడా చేయలేదు. ఒక పక్క నీరసం, మరోపక్క వేదన - ఈ రెంటితో కంటిమీద రెప్ప పడడం లేదు.
ఎప్పుడో తెల్లవారుజామున మగత నిద్రలోకి జారుకుంది. ఎంతసేపు పడుకుందో తెలియదు - ఎవరో డప్పు వాయిస్తుంటే మెలకువ వచ్చింది ఆమెకి.
"అందరికీ తెలియజేయడమేమనగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మన వూరి తాటితోపులో నాగభైరవ అనే భూతవైద్యుడు మోడీ పెడుతున్నాడు. టికెట్టు అయిదురూపాయలే. అందరూ రావలసిందహో" అని ఊరి తలారి దండోరా వేస్తున్నాడు.
అంటే భూతవైద్యుడు ఈరోజు మోడీ పెడుతున్నాడన్న మాట. అని మనసులోనే మననం చేసుకుంది సత్యవతి. నిజానికి మోడీ అంటే మంత్రాలు కావు. చిన్న చిన్న ట్రిక్కులు. అయితే చేసేవాడు అతి లాఘవంతో యిదంతా మంత్రశక్తితో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తాడు. సంవత్సరం క్రితం మోడీ చూసింది ఆమె. అందులో ఏమేం ఐటంలు వుంటాయో కూడా తెలుసు. ఇవన్నీ మ్యాజిక్ లాంటివి. గ్రామాల్లో చేసే మ్యాజిక్ నే మోడీ అంటారు.
భూతవైద్యుడ్ని దెబ్బతీసి తన సీతారాములు ఎక్కడున్నాడో కనిపెట్టడానికి యిది మంచి సమయమనుకుంది. ఓ ప్లాన్ వేసుకుని, దాన్ని అమలు చేయడానికి మంచం మీద నుంచి కిందకు దిగింది సత్యవతి.
మధ్యాహ్నం రెండు గంటలకల్లా జనం తాటితోపులో మూగిపోయారు. ఇసుకవేస్తే రాలనంత జనం. మోడీ జరిగే ప్రదేశమంతా రకరకాల సామానులతో నిండిపోయి వుంది. దానిచుట్టూ డేరా కట్టారు.
జనం అంతా నిండిపోయాక నాగభైరవ రంగం మీద కొచ్చాడు. ముగ్గుల మధ్యలో వున్న గుడ్డతో తయారుచేసిన బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు.
"గ్రామప్రజలారా! మీకు నమస్కారాలు. నా స్నేహితుడు చెంచురామయ్య కోరిక మేరకు నాకొచ్చిన విద్యలను ప్రదర్శిస్తాను. అంతా మంత్రాల మహిమ. దేవతలనంతా కొలిచే నేను ఈ విద్యలన్నిటిలో విజయం సాధిస్తాను. మరి నా విద్యలను ప్రదర్శిస్తాను" అని ధమరకం లాంటిదాన్ని మోగించాడు. జనం అంతా కళ్ళు ఆర్పడం కూడా మరిచిపోయారు.
మొదటి ఐటమ్ గా కోడిగుడ్డును ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నాడు భూతవైద్యుడు.
కోడిగుడ్డును ముగ్గు మధ్యలో పెట్టాడు.
"ఇదిగో ఈ మంత్రించిన కోడిగుడ్డుకు మా జుట్టు పోలిగాడ్ని కాపలా పెడుతున్నాను. ఎవరైనా సరే ధైర్యం వున్నవాళ్ళు వచ్చి ఈ కోడిగుడ్డు తీసుకోవచ్చు" అన్నాడు జనం వైపు చూస్తూ.
ఎవరూ ముందుకు రాలేదు.
"నువ్వు రా చెంచురామయ్యా!" అన్నాడు.
చెంచురామయ్య ముందుకొచ్చాడు. ముగ్గు మధ్యలోకి పోవాలని కాళ్ళు కదిపాడో లేదో ఒళ్ళంతా ఒకటే మంటలు. చెంచురామయ్య మీదకి భూతవైద్యుడు తన చేతిలోనున్న అక్షింతలు చల్లాడు. అవి పడ్డచోటల్లా బొబ్బలు లేచినట్లు పెద్దగా హాహాకారాలు మొదలుపెట్టాడు అతను.
జనం భయంతో ఒకడుగు వెనక్కి వేశారు.
చెంచురామయ్య పట్టు వదలనట్లు ముందుకి ఉరుకుతున్నాడు. మంటలు యింకా ఎక్కువైనట్లు అష్టవంకర్లు తిరిగి పోతున్నాడు.
ఆయన దగ్గరౌతున్నాడని అనిపించగానే భూతవైద్యుడు కోడిగుడ్డు చెవిలో మంత్రం చెప్పినట్లు గుసగుసలాడాడు. ఆయన పెదవులను కదల్చడం మానివేయగానే కోడిగుడ్డు కాస్త కోడిపిల్లయి పోయి తుర్రుమంది. చప్పట్లతో అక్కడంతా మార్మ్రోగిపోయింది.
నాగభైరవ మామిడిచెట్టు దగ్గరికి వెళ్ళాడు. జనం అంతా ఆక్కడికి పరిగెత్తారు. ఆయన తొర్రలో చేయి పెట్టి కోడిగుడ్డు బయటికి తీశాడు.
మళ్ళీ చప్పట్లు.
రెండో ఐటమ్ తుపాకీతో కాల్చడం.
ఓవైపు భూతవైద్యుడు నిలుచున్నాడు. రెండో చివర చెంచురామయ్య వున్నాడు. ఆయన చేతికి ఓ తుపాకీ యిచ్చాడు భూతవైద్యుడు.
"ఇదిగో యిక్కడి నుంచి నువ్వు తుపాకీని గుడిపెట్టి నా నోట్లోకి కాల్చాలి. నువ్వు కాల్చిన గుండును నా నోట్లోంచి తీస్తాను. అది నా మంత్రబలం" అన్నాడు.
చెంచురామయ్య గురి చూసుకుంటున్నాడు.
"మరి కాల్చు" అని భూతవైద్యుడు కళ్ళు మూసుకుని నోరు తెరిచాడు. చేతిలో గుడ్డబొమ్మ వుంది. తుపాకీ గుండు తనని ఏమీ చేయకుండా ఆ బొమ్మ అడ్డుకుంటుందని చెప్పాడు.
చెంచురామయ్య కాల్చాడు. పెద్ద శబ్దంతో ఠప్ మని పేలింది. విచిత్రం భూతవైద్యుడు నవ్వుతూ నోట్లోంచి ఇనుపగుండును బయటికి తీసి చూపించాడు.
జనం కేరింతలు కొట్టారు.
మరోమారు పేల్చాడు చెంచురామయ్య.
పెద్ద శబ్దం రావడం - పెనుకేక పెట్టి భూతవైద్యుడు కిందపడిపోవడం క్షణంలో జరిగిపోయాయి.
జనానికి ఏమైందో తెలియదు. చెంచురామయ్య వణికిపోతున్నాడు. భూతవైద్యుడి నోరు పగిలిపోయింది. కింద వూస్తుంటే రక్తంతో పాటు ఏడెనిమిది పళ్ళు వూడిపడ్డాయి.
అప్పటికి గ్రహించారు జనం - నిజంగానే తుపాకీ గుండు తగిలి నోరు పెరుక్కుపోయిందని.
అయితే ఈ విపరీతం ఎలా జరిగిందో, మంత్రం ఎందుకు పని చేయలేదో తెలియని జనం ఒకరినొకరు తోసుకుంటూ భూతవైద్యుడ్ని చుట్టేశారు.
తుపాకీలో రబ్బరుగుళ్ళు కొన్నిటిని తీసేసి అలాంటి ఇనుపగుళ్ళను ఎవరికీ తెలియకుండా పెట్టిన సత్యవతి మాత్రం ఊర్లోకి పరిగెత్తుతోంది. ఇదే మంచి సమయమని తెలుసు. తన పథకం పారినందుకు ఆమె సంతోషించడం లేదు. సీతారామయ్య జాడ తెలుసుకోవాలన్న తొందర తప్ప మరేం లేవు.
చెంచురామయ్య ఇల్లంతా వెదికింది. ఆ తరువాత ఆ ఇంటి వెనకాలే వున్న గుడిసెకున్న తాళాన్ని బద్దలు కొట్టి చూసింది. లోపల సీతారామయ్య డస్సి పోయి మాట్లాడలేని స్థితిలో నోట్లోంచి చొంగ కార్చుకుంటూ అతి దీనావస్థలో వున్నాడు. అలాంటి పరిస్థితిలో అతన్ని చూసి ఆమె మనస్సు కలుక్కుమంది.
ఎవరి సలహా కోసం ఆమె ఆగలేదు. ఎవరి సహాయమూ అర్థించలేదు. అతన్ని భుజాన వేసుకుని బయల్దేరింది. భారీమనిషి కాబట్టి అతన్ని మోస్తోంది గానీ మరొకరికైతే సాధ్యపడేది కాదు.
రెండు కిలోమీటర్లు నడిచి బస్టాండ్ చేరుకుంది. ఆటే టౌన్ కెళ్ళి డాక్టర్ దగ్గర అతన్ని చేర్చింది.
వారం రోజులకి సీతారామయ్య తిరిగి కోలుకున్నాడు. వెంటనే పెళ్ళి చేసుకుని ఇద్దరూ సీతారామయ్య స్వగ్రామానికి బయల్దేరారు" అని ముగించాడు తరుణ్.
అంతా విన్నాక అమ్మాయిలంతా చప్పట్లు చరిచారు సత్యవతిని మెచ్చుకుంటున్నట్లు.
