ఓ పెద్ద హాల్లో మూడు నుండి పన్నెండేళ్ళలోపు పిల్లలు కూర్చుని చదువుకుంటున్నారు. ఓ పదిమందికాదా ఉంటారు.
ఇంతమంది పిల్లలున్న చోట ఇంత నిశ్శబ్దమా? నాకు ఆశ్చర్యం వేసింది.
నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళు నావైపు తలలు తిప్పి చూశారు.
పుస్తకం పట్టుకున్న ఆవిడ టీచర్ కాబోలు నన్ను ఎగాదిగా చూసింది.
నేను గొంతు సవరించుకుని "చంద్రగారు ఉన్నారా?" అన్నాను.
అరవై ఏళ్ళు పైబడినట్లున్న ఆవిడ కళ్ళద్దాల్లోంచి నా వైపు చూస్తూ "చంద్ర మీకు తెలుసా?" అంది.
పిల్లలంతా సైగలతో ఆవిడ్ని ఏదో అడుగుతున్నారు. నుదుటిమీద బొటనవేలితో చూపిస్తున్నారు.
ఆవిడ ఏవో సైగలు చేసింది.
అప్పుడు తెలిసింది నాకు అంతమంది పిల్లలున్నా ఆ నిశ్శబ్దం ఎందుకో? వాళ్ళంతా పలుకురాని మూగపిల్లలు. వెన్నెల బంతుల్లాంటి కుందేలు పిల్లల్లా తెల్లని యూనిఫారంలో కూర్చుని ఉన్నారు.
"ఆయన నాకు ట్రైన్ లో సహాయం చేశారు. నిన్ననే పరిచయం అయ్యారు" నెమ్మదిగా అన్నాను.
"కూర్చోండి" అని కుర్చీ జరిపింది.
"ఆయన ఇక్కడే ఉంటారా" అడిగాను.
"ఆ...ఉంటాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు...మీరేం తీసుకుంటారూ? రాగి జావకానీ మజ్జిగగానీ ఇవ్వగలను" అంది ఆవిడ.
"చంద్ర...చంద్రగారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారూ?" కంగారుగా అడిగాను.
"వాడికి ఇవన్నీ మామూలే. మీరేం తీసుకుంటారూ?" అడిగిందామె.
"ఏమీ ఒద్దు. ఆయన గురించి చెప్పండి"
"నిన్న వీడు హోటల్ లో కాఫీ తాగుతూండగా, ఓ ఏడేళ్ళ కుర్రాడు బల్లలు తుడుస్తూ గాజుగ్లాసు పగులకొట్టాడుట. ఆ కుర్రాడ్ని ఓనర్ గూబ అదిరేటట్లు కొడ్తే ఆ కుర్రాడికి స్పృహ తప్పిందిట. వెంటనే వీడు ఆ ఓనర్ ని లాక్కుంటూ తీసుకెళ్ళి పిల్లాడితో సహా ఆటోలో కుదేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళాడుట.
"అక్కడ కుర్రాడి ట్రీట్ మెంట్ కి ఓనర్ చేత డబ్బు ఇప్పించి, ఆ తర్వాత ఆ ఓనర్ ని గూబ అదిరేటట్లు కొట్టాడుట! అతడు కంప్లెయింట్ ఇచ్చాడు. వీడ్ని పోలీసులు పట్టుకెళ్ళారు" అని ముగించింది ఆవిడ. ఆ తర్వాత పిల్లలవైపు తిరిగి సైగలు చేసింది.
వాళ్ళు పలకలమీద "వాట్ ఈజ్ యువర్ నేమ్?" అని ఇంగ్లీషులో రాసి నాకు చూపించారు.
నేను ఆశ్చర్యంగా ఆవిడ్నీ పిల్లల్నీ చూశాను.
"చంద్రగారు మీకేమౌతారూ?" అన్నాను.
"మనవడు. వాడు నా కొడుకు కొడుకు" అంది.
"ఈ స్కూలు ఎవరిదీ?"
"ఇది స్కూలు కాదు. ఆశ్రమం. మాదే. ఈ పిల్లలంతా అనాధలు" అంది.
"చంద్రగారు ఏం చేస్తుంటారూ?" అడిగాను.
"ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. ప్రస్తుతం స్వంతంగా కాంపోనెంట్స్ కొనితెచ్చి పెద్ద పెద్ద కంపెనీలకి అమ్మే కాంట్రాక్ట్ చేస్తున్నాడు." అని, ఇవన్నీ నీకెందుకూ అన్నట్లు నావైపు చూసిందావిడ.
"ఎంత దయ! మూగపిల్లలకే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారూ?" అడిగాను.
ఆవిడ ఓసారి కళ్ళజోడు సవరించుకుని అక్కడవున్న బోర్డుమీద ఓ కూడిక లెక్క రాసి, పిల్లల్ని అది చెయ్యమన్నట్లు సైగ చేసింది.
ఆ తర్వాత నావైపు తిరిగి "ఏం అన్నారూ? మూగ పిల్లలకే ఎందుకా? అది మాకు బాగా అలవాటైన పని కాబట్టి. మా చంద్ర తల్లీ, తండ్రీ ఇద్దరూ చెవిటీ మూగవాళ్ళు. మాకు వాళ్ళతో ఈ సైగలూ అవీ బాగా అలవాటుగా ఉండేవి. చంద్ర టెన్త్ క్లాస్ లో ఉండగా ట్రైన్ యాక్సిడెంట్ లో ఇద్దరూ ఒకేసారిపోయారు" అంది.
పిల్లలంతా లెక్కచేసేసి ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ ఆవిడ దగ్గరికి పరిగెత్తుకొచ్చేశారు.
ఆవిడ ఒక్కొక్కళ్ళ పలకా తీసుకుని దిద్దుతోంది.
గాలి వీచినప్పుడల్లా కదిలే గుమ్మాలకి కట్టిన చిరుమువ్వలే అక్కడ శబ్దాన్ని బ్రతికిస్తున్నాయి!
ఆవిడ నవ్వుతూ పిల్లల తలమీద మొట్టికాయలు వేస్తోంది. ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతోంది!
"మరి చంద్రగారు ఎప్పుడొస్తారూ?" అడిగాను.
"రషీద్ వెళ్ళాడు. వాడు లాయర్. వీడికి చిన్నప్పటినుండీ ఫ్రెండ్ అయినందువల్ల ఇలాంటి పనులు వాడికి తప్పవు!" అని నిట్టూర్చింది.
నాకు అక్కడ వాతావరణం చాలా కొత్తగా, వింతగా, ఎంతో హాయిగా అనిపించింది.
అప్పటివరకూ చంద్ర అంటే ఉన్న గౌరవం ఆ నిముషానే అభిమానంగా మారింది.
నేను సెలవు తీసుకుని "మళ్ళీ వస్తాను" అని వచ్చేస్తుంటే పిల్లలు మళ్ళీ నుదిటిమీద బొటనవేలు బొట్టులా పెట్టుకుని సైగచేశారు.
"నీ పేరు అడుగుతున్నారు" అందావిడ.
"కాళింది" అని చాక్ పీస్ తీసుకుని బోర్డ్ మీద రాసి వారికి చూపించాను.
"ఏం చేస్తూవుంటావ్?" అడిగింది.
"మెడిసిన్, హౌస్ సర్జెన్సీ చేస్తున్నాను" చెప్పాను.
"ఫోన్ చేసి రా ఈసారి, వాడు దొరకొచ్చు!" అంది.
నేను నెంబర్ తీసుకుని, నా హాస్టల్ నెంబర్, నా పేరూ రాసి ఆవిడకి ఇచ్చి "నే వచ్చి వెళ్ళాను అని చెప్పండి" అని అక్కడ్నించి బయలుదేరాను.
