Previous Page Next Page 
ఆలింగనం పేజి 43


    చైతన్య చాలాసేపు మాట్లాడలేదు. కాసేపయ్యాక-

 

    "అమ్మకి అమలాపురం సంబంధం బాగా నచ్చిందిట. పెళ్ళిచూపులకి రమ్మని పోరు పెడుతోంది" అన్నాడు.

 

    "చూసుకో బావా! అత్తయ్య నాన్నకంటే పెద్దది. ఎన్నాళ్ళని అన్నీ చేసుకోగలదూ?" అన్నాను.

 

    "నిన్నోసారి అడిగి వెళ్దామనుకున్నాను. అడిగాను. జవాబు విన్నాక వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను" స్థిరంగా అన్నాడు.

 

    అతని మనసులోని భావం అర్థమైంది. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. నా మొహాన అసలు ఆ కళ్యాణం రాత లేదేమో! నా కాళ్ళ దగ్గరికి వచ్చింది నేను వద్దనుకున్నాను. నాకు కావల్సింది నాకు దక్కలేదు!

 

    అత్తయ్యా, చైతన్య ప్రయాణం అయ్యారు.

 

    చైతన్య బ్యాగ్ లో అతను చూడకుండా అటుకుల గొలుసు వేసేశాను.

 

    నాలుగు రోజులు పోయాక పెద్దక్కనీ, పిల్లల్నీ బావ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇల్లు బావురుమని మిగిలిపోయింది. కాలేజీ మానేశాను. నాన్నకి తెలీకుండా ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టాను.

 

    మాధవ్ క్రమం తప్పకుండా వచ్చి అమ్మనీ, నాన్ననీ పరామర్శించి వెళ్తున్నాడు.

 

    ఓ రోజు నన్ను "కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదమ్మా?" అని అడిగాడు.

 

    "ఇప్పుడు నాకు చదవాలనిలేదు. ఏదైనా ఉద్యోగం చూసి పెట్టండి" అన్నాను.

 

    "డిగ్రీ కంప్లీట్ చెయ్యి...అలాగే చూద్దాం" అన్నాడు.

 

    "కష్టం!" అన్నాను.

 

    "నా మాట విని కాలేజీకి వెళ్ళు. సాయంత్రాలు పార్ట్ టైమ్ జాబ్స్ ఏమైనా చేద్దువుగానిలే" అన్నాడు.

 

    ఆ మాట నాకు నచ్చింది.

 

    "నిజంగా చూస్తారా?" అన్నాను.

 

    "మా ఫ్రెండ్ కి వాచ్ షోరూమ్ వుంది. అందులో చేస్తావా?" అడిగాడు.

 

    "ఎంతిస్తారు?" అడిగాను.

 

    అతను నవ్వి "ఎంత కావాలి?" అన్నాడు.

 

    "ఎనిమిది వందలు" అన్నాను.

 

    "సరే...మాట్లాడి రేపు చెప్తాను" అని వెళ్ళిపోయాడు.

 

    అమ్మా, నాన్న నిద్ర మాత్రలు వేసుకుని పెందరాళే పడుకుంటున్నారు. ఇల్లంతా సాయంత్రం ఏడు అయ్యేసరికి నిశ్శబ్దం! నా మంచంమీద కూర్చుని ఆత్రంగా అక్క డైరీ తీశాను. ఇంకోళ్ళ డైరీ చదవకూడదని తెలుసు! కానీ...వాళ్ళే లేనప్పుడు తప్పేమిటి? తెరుస్తుంటే చేతులు ఒణికాయి! ముత్యాల్లాంటి అక్క దస్తూరీ ప్రతి పేజీలో డేట్లు వేసి సంఘటనలు రాసింది.

 

    ఆముక్తకి ఈసారి మంచి మార్కులు వచ్చాయి. నేను తిట్టానని పిచ్చి మొద్దుకి కోపం వచ్చిందేమో! అయినా ఫర్లేదు. దాని భవిష్యత్తుని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాది.

 

    నాన్నగారు చాలా వీక్ గా ఉన్నారు. ఇంక రెస్టు తీసుకోవాలి.

 

    రిటైరయ్యాక ఆయనకి మనశ్శాంతిగా ఉండేలా చూస్తాను.

 

    సరయూ కొడుకు పుట్టినరోజుకి సైకిల్ కొనాలి. అమ్మ పుట్టినరోజు పండగలా చెయ్యాలి. ఫోటోలో ఉన్నట్లు ఎర్ర పట్టుచీరలో చూడాలని ఉంది.

 

    హాస్పిటల్ లో నైట్ డ్యూటీలే ఎక్కువగా వేయించుకుంటే పగలు చదువుకోవచ్చు.

 

    బర్న్స్ వార్డ్ లో కట్నం చావుల కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పోయే ముందు కూడా భర్తల్ని రక్షించాలని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే తమ మీద కోపం జీవితాంతం పిల్లలమీద చూపిస్తారని భయం! ఈ రోజు ట్రైన్ పాస్ రెన్యువల్ చేయించుకోవాలి ఆఖరిరోజు.

 

    గబ గబా పేజీలు తిప్పేస్తున్న నాకు ఒకచోట దృష్టి నిలిచిపోయింది.

 

    "చంద్ర పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. ఈ రోజు అతను లేకపోతే నలుగురిలో నవ్వులపాలు కావల్సివచ్చేది. హేండ్ బ్యాగ్ ఎవడో కొట్టేసి ట్రైన్ లోంచి దూకేశాడని చెప్తే ఆ టీ.సీ. నా వంక అదోలా చూస్తూ "రోజుకి వందమంది చెప్తారు ఇలాంటి కథలు!" అన్నాడు.

 

    సిగ్గుతో చచ్చిపోయినంత పనైంది, నేను మెడికోనని చెప్దామనుకున్నా అతను నా మాట వినకుండా అరుస్తున్నాడు.

 

    అప్పటిదాకా పేపర్ చదువుతున్న అతను లేచి, పరిస్థితిని అర్థం చేసుకుని తను టికెట్ కొన్నాడు.

 

    అది కూడా నాకు అవమానంగానే అనిపించింది. అతని డబ్బు అతనికి ఇచ్చేయ్యాలని ఎడ్రెస్ అడిగి తీసుకున్నాను. అతనిదీ కర్నూలే!

 

    అతను చాలా తక్కువగా మాట్లాడ్తాడ్లా ఉంది. నేనేం చెప్పినా తలూపి ఊర్కున్నాడు!

 

    అతని సూట్ కేస్ మీద 'చంద్ర' అనే పొడి అక్షరాలు ఉన్నాయి.

 

    చంద్ర అడ్రెస్ పట్టుకుని అతని డబ్బు ఇవ్వటానికి అతని ఇంటికి వెళ్ళాను. పెద్దగేటు లోపల విశాలమైన ఆవరణ. మధ్యలో చిన్న పెంకుటిల్లు.

 

    హోలీ పండుగరోజు బుక్కాలు చల్లినట్లుగా ఉన్నాయి తోటలు.

 

    రంగు రంగుల పువ్వులు, ఆ ఇంట్లో ఆత్మీయతా, అనుబంధాలు ఎంతగా పెనవేసుకున్నాయో చెప్తున్నట్లుగా కలిసి పైకి పాకుతున్నాయి. సన్నజాజీ, రాధా మనోహరాలు. ఓపక్కగా ఉన్న బావికి పక్కనే అరటి చెట్లూ. కాస్త దూరంలో వింజామరులు వీస్తున్న పరిచారికల్లా కొబ్బరిచెట్లు, మామిడీ, జామా, పనసా కవాతు చేస్తున్న సైనికుల్లా అటూ ఇటూ వరుసగా నిలబడి ఇంటికి దారి చూపిస్తున్నాయి.

 

    రెండు కుందేలు పిల్లలు బంతినారు మధ్య తెల్లబంతుల్లా ఎగురుతున్నాయి.

 

    పావురాలు వాటికి అమర్చిన గూళ్ళల్లోంచి తలలు బైటికి పెట్టి -

 

    "ఎవరూ?" అన్నట్లు ధ్వని చేస్తూ మెడ వయ్యారంగా తిప్పుతున్నాయి.

 

    "చంద్ర" అన్న నేమ్ ప్లేట్ చూస్తూ లోపలికి నడిచాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS