పిల్లలంతా చేతులూపుతూ "టా...టా" చెప్పారు.
గాలికి పున్నాగ పరిమళం నన్ను చుట్టుముట్టింది. అది నా రూం కొచ్చాక కూడా ఇంకా నన్ను పట్టుకునే ఉంది! ఎంత చిత్రమైనవాడు చంద్ర?
తనకి నిర్దేశించిన కర్తవ్యాన్ని దీక్షగా ఈ వయసులో కూడా అలుపెరగని చిరునగవుతో చేసుకుపోతున్న ఆ ముసలావిడ ఎంతటి ఉన్నతురాలు?
జీవితం అంతా ముక్కు, కాళ్ళూ మూసుకుని తపస్సులు చేసిన రుషులు సమాజానికి ఏం ఉపయోగపడ్డారు? ఓ ఏడేళ్ళ పసివాడి బుగ్గమీద నుండి జారే కన్నీటి చారని ఆపగలిగే శక్తి ఉన్న మనిషే మానవత్వానికి అర్థం చెప్పగలవాడు. నిజమైన పురుషుడు!
"ఒక దానవుడ్ని కళ్ళు మూసుకుని భరించడం కాదు రుషత్వం... సంస్కరించడం! ఈ మానవారణ్యంలో నేను ఈ రోజు ఒక రుషిని చూశాను"
డైరీ చదువుతున్న నా కళ్ళు చెమర్చాయి!
అక్కవి ఎంత సున్నితమైన భావాలు!
ఆమె పువ్వులాంటి హృదయం చూరగొన్న ఆ చంద్ర ఎంత అదృష్టవంతుడూ!
చంద్ర గురించి చదవడానికి నా కళ్ళు వేగిరపడ్డాయి.
"చంద్ర ఎక్కువగా మాట్లాడే స్వభావం కలవాడుకాదు. మాటలకన్నా చేతల్లోనే బాగా నమ్మకం ఉన్నవాడు.
'ప్రపంచం 2000 సంవత్సరంలో ప్రళయంలో మునిగిపోతుంది. కేవలం నా భక్తులు మాత్రమే రక్షింపబడి మిగిలి ఉంటారు' అన్న ప్రకటన దినపత్రికలో ఇచ్చిన ఒక మోడ్రన్ దేవుడి ఎడ్రెస్ వెతుక్కుంటూ వెళ్ళి 'ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వాళ్ళ అమాయకత్వాన్ని మూర్ఖత్వంగా మారుస్తావా?" అంటూ దేహశుద్ధి చేసి వచ్చాడుట. మళ్లీ కేస్ అయింది.
నాకు నానమ్మగారి ద్వారా చంద్ర స్నేహితుడు రషీద్ పరిచయం అయ్యాడు.
"ఏదీ సహించలేని, భరించలేనివాడ్ని ఎట్లా భరించడం అండీ! చస్తున్నాను" అంటూ రషీద్ ఫ్రెండ్ గురించి మురిపెంగా చెప్పాడు.
చంద్ర నేను డబ్బు తిరిగి ఇవ్వగానే "తొందరేం?" అని కానీ... ఒద్దు... ఉంచండి..." అని కానీ అనకుండా తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.
అక్కడ నేను ఉన్న గంటసేపటిలో నేనే ఎక్కువగా మాట్లాడానేమో! అతను రాత్రి వంటకోసం క్యాబేజీ సన్నగా తరుగుతూ కూర్చున్నాడు.
నానమ్మ అందరికీ రాగిజావ తెచ్చి ఇచ్చింది. అది ఎంత రుచిగా ఉందో వర్ణించలేను.
రషీద్ చంద్రని ఆటపట్టిస్తూ -
"రేపు ఎవరినైనా ఉతుకుడు కార్యక్రమం ఉందా నాయనా? ఒకవేళ వుంటే గనక రెండురోజులు పోస్టుపోన్ చేసుకో...విజయవాడ వెళ్ళొచ్చే పని తగిలింది నాకు..." అన్నాడు.
చంద్ర అటూ ఇటూ చూసి, తలుపు వెనక నుండి చీపురు తెచ్చి "చెత్త కనిపిస్తే నాకు ఊడ్చిపారెయ్య బుద్ధేస్తుంది" అన్నాడు. ఆ శ్లేషకి మేము నవ్వేశాము. అతను నవ్వలేదు!
అసలు నవ్వితే ఎలా ఉంటుందోనని ఊహిస్తూ కూర్చున్నాను. చంద్రలో అందంకంటే ఆకర్షణ ఎక్కువ.
రషీద్, చంద్రా కూడా సిటీలో ఏదో అర్జంటు పని ఉండడంతో నాతో బాటు బయల్దేరారు.
రషీద్ మోటార్ బైక్ సర్వీసింగ్ కి ఇచ్చాను అని చెప్పి, ఆటో పిలిచాడు.
మా హాస్టల్ దగ్గర నన్ను దింపి, వాళ్ళు కూడా అక్కడే దిగిపోయారు.
నేను పర్సులోంచి డబ్బులు తీసి ఆటోకి ఇస్తుంటే రషీద్ అడ్డుపడబోయాడు.
చంద్ర కలగజేసుకుని "మనం ఇద్దరం అయితే బస్ లో వచ్చేవాళ్ళం"
అతను ఆ మాట జోక్ గా కాదు సీరియస్ గా అనడం నాకు నవ్వు తెప్పించింది.
రషీద్ మిత్రుడ్ని చిరాగ్గా చూసి తలకొట్టుకున్నాడు. వాళ్ళు అక్కడ్నించి వెళ్ళిపోయేదాకా హాస్టల్ గేట్ దగ్గరే నిలబడి చూశాను.
అందరం మనసుల్లో అనుకునే మాటలే అతను బైటికి అనేస్తాడు. అతని గురించి ఎవరేమనుకుంటే తనకేం అన్నట్లుగా ఉంటాడు. అనవసరమైన విషయాలు పట్టించుకోడు. అతనికి అవసరం అనిపించేవి ప్రపంచానికి అనవసరం అనిపిస్తాయి.
"మ మార్నింగ్ షోనూ, మేట్నీనూ బ్యాన్ చెయ్యాలి. దేశంలో ప్రొడక్టీవ్ టైం అంతా వేస్ట్ అయిపోతోంది. ఆ రేట్లు కూడా ఈవెనింగ్, నైట్ షోస్ కి వేసి కాంపన్ సేట్ చేస్తే సరీ!" అన్నాడు.
ఎవరికీ రాని ఐడియాలు వస్తాయి.
ఆదివారం అవగానే నాకు తెలియకుండానే నా మనసు ఆశ్రమానికేసి లాగింది.
మామిడి చెట్టుకింద నవారు మంచం వాల్చుకుని బనీన్, పంచెతో పిల్లల్ని పెట్టుకుని ఉన్నాడు.
అతని కళ్ళల్లో మేజర్ సర్జరీ చేస్తున్న డాక్టర్ కళ్ళలో కనిపించే ఏకాగ్రత కనిపిస్తోంది!
అతని ఒళ్ళో ఉన్న తెల్ల కుందేలు పిల్లకి కట్టుకడ్తున్నాడు. ఎక్కడో దెబ్బ తగిలించుకుని ఉంటుంది.
ఆ మనోహర దృశ్యం చూస్తూ ఓ నిమిషం అలాగే నిలబడిపోయాను.
పిల్లలు గమనించి, పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టుకున్నారు. అతడు జరిగి మంచంమీద నాకు చోటిచ్చాడు. పిల్లలు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు. నేనూ వాళ్ళకి తీసుకెళ్ళిన బిళ్ళలూ, బిస్కెట్లూ పంచాను.
నానమ్మ బయటకు వచ్చి పలకరించింది. నేను బి.పి. ఆపరేటర్ తీసుకెళ్ళడం వలన ఆవిడకి బి.పి. చెక్ చేసి మందులు ఇచ్చాను.
చంద్ర ఆ సమయంలో కిచెన్ లో వంట చేశాడు. నేనూ అక్కడే భోజనం చేశాను. రసం, ఆకుకూర పప్పుతో అందరం కలిసి తింటూ ఉంటే థ్రిల్ గా అనిపించింది. ముఖ్యంగా ఆ వంట అతను చెయ్యడం వల్లనేమో!
