Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 42


    "క్షమించండి. నా అభిప్రాయం అది కాదు. డాక్టరు దగ్గరకు ఆ విషయమై రావాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది. ఈ సమస్య మీ దగ్గర పరిష్కారం కుదిరితే చెకప్ చేయించుకోకుండా తప్పించుకోవటానికి వీలు అవుతుందని మిమ్మల్ని అర్ధిస్తున్నాను. ప్లీజ్! ఈ సాయం చేయండి!" అతన్ని బ్రతిమాలుకుంది గాయత్రి.

    "చాల తెలివయిన దానివి. తప్పకుండా కన్ సల్ట్ చేస్తాను. కన్పించవు కాని నీ దగ్గర చాలా ఊహలున్నాయి" అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

    అనారోగ్యం తాలూకు సూచనలు ఏవీ లేకుండా ఆమె పూర్తిగా స్థిమితపడింది అనుకున్న తరువాత వాల్మీకి పట్నం వెళ్ళిపోయాడు.

    తన గదిలోకి వెళ్ళి దిండులో తలదూర్చి చాలాసేపు కన్నీరు కార్చింది సుమిత్ర. భగవంతుడు ఇంకా పరీక్షలకి గురి చేస్తున్నాడు.

    ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తోంది.

    ఒక యువతికి తల్లి అయే సూచనలు కన్పించలేదు అంటే పెద్ద వాళ్ళకి వచ్చే మొదటి అనుమానం అది! దంపతులు ఒకరినొకరు అర్ధం చేసుకుని సక్రమంగా ఉంటున్నారా? లేదా?

    ఆ అనుమానం తీరిపోయింది.

    గాయత్రి వాల్మీకి ఒకరికోసం ఒకరు అన్నట్లు సరిగ్గా అతికిపోయారు ఈ విషయం ఆమెను మరింత కృంగదీసింది.

    ఇంకా వేరే కారణాలు ఉంటే అవి అనాటమికి సంబంధించినవి!

    అంటే పెద్ద కారణాలు ఉన్నాయి అన్నమాట!

    అవి పరిష్కరించుకోగలిగినవో పరిష్కారం లేనివో ఎన్నో పరీక్షలు చేసి డాక్టర్లు చెప్పాలిందే! ఎవరూ ఊహించలేరు.

    తాను బామ్మ అయే అవకాశం సులభంగా దొరుకుతుందని భావించింది. గాయత్రి పెళ్ళి చేయటమే పరిష్కారం అనుకుంది. కాని ఆ అవకాశం ఎంతో దూరాన ఉన్నదో లేదో తెలియని స్థితిగా కన్పిస్తోంది.

    ఈ విషయం తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది సుమిత్ర.

    ఆ జగదీశ్వరస్వామికి ఎన్నో మ్రొక్కులు మ్రొక్కాను. ఎన్నో పూజలు చేశాను. ఆ స్వామికి నామీద ఎందుకు దయకలగలేదు? కులదైవం కరుణ తప్పిన కారణం ఏమిటో? అని విలపించిందామె!

    సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

    అలాంటివి తనకే ఎదురు అవుతున్న క్షణం! బాగా కృంగిపోయింది.

    వాల్మీకి వెళ్ళిపోయాక గాయత్రి మళ్ళీ ఫాంహౌస్ లో పనులు చేయించేందుకు వెళ్ళిందని వార్త తెచ్చింది వర్ధని!

    "గ్రామంలో ఒక కార్యక్రమం ఉంది. డానికి వెళ్ళాలి! రమ్మని కబురు పంపు"

    "అలాగే" అంది వర్ధని తానే స్వయంగా వెళ్ళి పిలుచుకు వచ్చింది.

    ఒకప్పుడు సుమిత్ర సుమంగళిగా ఉన్న రోజుల్లో ఆ ఇంటి ఆచారం ఒకటి ఉంది.

    గ్రామంలో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ముందుగా ఈ ఇంటివారు వెళ్ళి వారిమీద అక్షితలు వేయాలి.

    ఆ తరువాత సుమిత్ర భర్త చనిపోవటంతో ఈ ఆచారానికి తెరపడింది.

    ఇప్పుడు గాయత్రి పుణ్యవతి, ఆ సాంప్రదాయం తిరిగి నిలబెట్టేందుకు అనర్హులు! ఇలాంటి వాటిలో చాల ఆసక్తి కలిగిన మనిషి!

    అందువల్ల ఎవరో సీమంతానికి పిలిచివెళ్లారు.

    వర్ధని చెప్పిన వార్తవిని పనులు వదిలేసి వెంటనే బయలుదేరి వచ్చింది గాయత్రి!

    ఎవరో అదృష్టవంతురాలు. పెళ్ళి అయి ఆరు నెలలుకూడా దాటలేదట!

    అప్పుడే అయిదోనెల అర్ధం! సీమంతం చేస్తున్నారు.

    పిల్లల తరపు పిల్లవాడి తరపున వియ్యపువారు అందరూ ముఖం చిట్లించుకున్నారట! అయినా ఇలా వెంటపడతాయేమిటి? అని బుగ్గలు నొక్కుకున్నారు. కాస్తంత జాగ్రత్తలు తీసుకోకూడదా! సంవత్సరం తిరగకుండానే కాన్పుకూడ జరిగి పిల్ల ఒడిలోకి వస్తే పెళ్ళి సుఖం ఏముంటుంది?

    రెండు మూడేళ్ళు దంపతులు ఆనందంగా స్వేచ్ఛగా ఉండవద్దా అని పెళ్ళి కూతురుని చివాట్లు పెట్టారు రహస్యంగా!

    బయట పడిపోయింది కాబట్టి అయిదోనెల సగం గడిచిపోగానే స్కానింగ్ చేయించారు. మగపిల్లవాడు అని వచ్చిందట!

    రెండు పక్షాలవారు హుషారెక్కిపోయి సీమంతం చేస్తున్నారు.

    త్వరగా తెమిలి వర్ధని తోడురాగా బయలుదేరింది గాయత్రి!

    "అమ్మా ఒకప్పుడు అనివార్యంగా దాపురించిన దుర్గతివల్ల ఇలా వెళ్ళే సాంప్రదాయం నేను విడిచి పుచ్చాల్సివచ్చింది. నీ తరంలో నిండుగా ఈ సాంప్రదాయాన్ని నువ్వు కొనసాగించు! ప్రతి శుభకార్యంలోనూ మొదటి తాంబూలం మనది. మొదటిసారి అక్షితలువేసే గౌరవం మనది. దాన్ని కాపాడు.

    మనం ఆశీర్వదించడానికి వస్తున్నామంటే ఏదయినా మంచి కానుక తెచ్చి యిస్తారని ఆశపెట్టుకుంటారు. పసుపు కుంకుమ గాజులు పట్టుచీర తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి యిచ్చి ఆశీర్వదించు! నీవు కూడా త్వరగా తల్లివి కావాలని వారు మనసారా కోరుకుంటారు. అవే మనకు పదివేలు" అంది సుమిత్ర.

    "అలాగే అమ్మగారూ!" అని వర్ధనిని వెంటపెట్టుకుని వెళ్ళింది.

    కళకళలాడుతున్న యింటిలో గ్రామంలోని స్త్రీలందరూ ఉన్నారు. గాయత్రి రాకకోసమే ఎదురు చూస్తున్నారు. వెళ్ళగానే చేతికి పసుపు కుంకుమలు ఇచ్చి గాజులు తొడిగింది గాయత్రి! పట్టుచీర యిచ్చి అక్షితలు వేసి ఆశీర్వదించింది. "పండంటి మగబిడ్డ కలగాలి" అంది.

    సీమంతం చేయించుకుంటున్న అమ్మాయి అపురూపంగా పట్టుచీర అందుకుని గాయత్రి పాదాలను తాకి నమస్కరించింది.

    "పిల్లవాడి బారసాలకు మరో మంచి బహుమతి తెచ్చి యిస్తాను" అంది గాయత్రి. తల్లి ఎంత పెద్ద మనసుకలదో గాయత్రి కూడా అలాంటిదే అన్నారు.

    ఇంటికి తిరిగి వెళ్ళేందుకు సమాయత్తం అయారు!

    ఏమిటి ఈవిడగారి వైభోగం? అన్నింటికి ముందు వీళ్ళేనా? అని అసూయతో ఆలోచించిన ఒక వనితామణి వారు వెళ్ళే దారి కాచింది. మరొకామెను తోడుకూడా తెచ్చుకుంది.

    కుట్టదలుచుకున్న తేలు కొండీ ఎత్తి పట్టుకుని గూట్లో చేయిపెట్టే వారికోసం సిద్ధంగా ఉన్నట్లుగా ఉందావిడ!

    ఇదేమి తెలియని గాయత్రి వారి ముందునించి వెడుతోంది.

    "అమ్మగారు కులాసాగా ఉన్నారా?" అని పలకరించింది తేలుకొండి.

    "బావున్నారండీ మామ్మగారూ! మీరెలా ఉన్నారు?"

    "ఏదో ఇలా అఘోరిస్తున్నాంలెండి అమ్మగారూ! ఎక్కడనించి వస్తున్నారు"

    "మన వాళ్ళింట్లో సీమంతం అని పేరంటానికి పిలిచారు.వాళ్ళు సంతోషంగా శుభకార్యం చేసుకుంటున్నారు"

    "అవునవునమ్మా! అలాంటప్పుడు తప్పకుండా వెళ్ళాల్సిందే!"

    "వెళ్ళాను మామ్మగారూ! పాపం బీదవాళ్ళు కదా! ఆశపెట్టుకుని ఎదురు చూస్తుంటారు. అందుకోసమే పట్టుచీర ఇచ్చాను."

    "మీ యింటి మనుషుల సుగుణాలు తెలియని వాళ్ళు ఈ చుట్టుప్రక్కల ఎవరున్నారు తల్లీ! మీ చేతులకు ఎముకలెక్కడ ఉన్నాయి.

    చాలా మంచి పని చేశావమ్మా! మీ గౌరవానికి తగిన పని చేశావు"

    "ఏదో లెండి మామ్మగారూ! శక్తికి మించిన పనికాదు కదా!" అంది గాయత్రి.

    "అవునమ్మా! నీకు పెళ్ళి అయి రెండు సంవత్సరాలు అయిందా?"

    "కావస్తోంది మామ్మగారూ?"

    "నీళ్ళోసుకున్నావా? సుమిత్రమ్మగారికి మనవడు పుడతాడా?"

    గాయత్రి మాటాడలేదు.

    "అలాంటిదింకా లేదులే!" అంటూ ఇలాంటి వారి సంగతి బాగా తెలిసిన వర్ధని సమాధానం యిచ్చింది రాగస్వర సమ్మేళనంతోనే!

    "అయ్యో! వద్దనుకుని జాగ్రత్తలు పడుతున్నారా" బుగ్గలు నొక్కుకుందావిడ!

    అదేదో కొంపలంటుకుపోయే వ్యవహారం అయినట్టు!

    "అలాంటిది కూడ లేదులెండి" అంది వర్ధని ముందుకు సాగుతూ! ఇలాంటి వాళ్ళ దగ్గర మరింతసేపు నిలబడితే ప్రమాదం!

    ఎంతకయినా సమర్ధులు ఈ రాగాలు తీసేరకం ఆడవాళ్లు!

    వారు ముందుకు సాగినా ఆవిడ మాత్రం విడిచి పెట్టలేదు.

    "కడుపుపండని దానివి అలా ముందుకువెళ్ళి అక్షతలు వేశావుటమ్మా! రేపు ప్రొద్దున వేడి కావచ్చు! వెచ్చన కావచ్చు! ఏ చిన్న తిరకాసు వచ్చినా నిన్నే కదా ఆడిపోసుకుంటారు.

    ఇంతోటి చిన్న విషయం అంత తెలివి కలిగిన సుమిత్రమ్మగారికి తోచలేదా? అయ్యో అయ్యో రామ!

    ఏదయినా జరిగితే మీ కుటుంబానికి వాదు రావటం ఇష్టంలేకనే ఇలా చెప్తున్నాను తల్లీ!" అందావిడ!

    ఆ మాటలు విని గాయత్రీ మనోలోకాలు కుప్పకూలినాయి! అంతసేపూ తలచిన ఉత్సాహం అంతా ఆవిరి అయిపోయింది.



                                 14


    సగమే ఉదయించిన సూర్యబింబం అర్ధాంతరంగా మాతృకోశం నించి రాలిపడిన నెత్తురు గుడ్డులా ఎర్రగా ఉన్నాడు!

    ఇంకా మొగ్గతొడగని ఓ గులాబి మొక్క దగ్గర నిలబడి సుమిత్ర గాయత్రి చర్చించుకుంటున్నారు, అది మొగ్గ తొడిగేందుకు చేయవలసిన దోహద క్రియలేమిటి? అని వారు తర్కించుకున్నారు.

    తోటమాలి ఓ ఒదిగి ఓ ప్రక్కన నిలబడివున్నాడు.

    మరో వారం రోజులు చూచి మొక్కని మార్చేయాలంటోంది సుమిత్ర!

    సరిగా ఆ సమయంలో గ్రామంలోకి వెళ్ళిన వర్ధని పరుగులాంటి నడకతో వగర్చుకుంటూ తిరిగి వచ్చి దారి ఎదుట నిలబడింది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS