"వయసులో ఉత్పన్నమయ్యే ప్రేమ కంటే బాల్యంలో ఏర్పడే ప్రేమ ఇంకా గాడమైంది లలితా! నేను చిన్నప్పటి నుండి మనూ రూపాన్ని ఆరాధించాను. ప్రేమించాను. కాని ఎన్నడూ అతడితో సినిమాలకూ, షికార్లకూ వెళ్ళలేదు. ఏకాంతంగా ప్రేమ గురించి మాట్లాడుకోలేదు. వీళ్ళు మా అనుబంధాన్ని ఇంత నీచంగా చిత్రిస్తున్నారంటే ఏ మనుకోవాలి?"
"లోకంలో ఎందరో కళాకారులు. కొందరు స్కెచ్ మాత్రమే గీచి వదిలితే కొందరు అందంగా రంగులు పూస్తారు. నువ్వు త్వరలో ఓ ఇంటిదానివైతే తప్ప లోకం నీకు పులిమిన ఈ మచ్చ మాసే అవకాశం లేదు!"
ఆ రోజే పారిజాత తన అంగీకారాన్ని తెలిపింది కోమలమ్మకు. రంగనాధాన్ని పిలిచి తన పెళ్ళి గురించి మాట్లాడడానికి.
ఇరవై సంవత్సరాలుగా ఈ కాంపౌండ్ లో అద్దెకు ఉంటూన్నా ముఖాముఖి కోమలమ్మతో మాట్లాడే అవసరం కలుగని రంగనాధం ఆవిడ తనను రమ్మని కబురు చేసేసరికి పరిపరి విధాలుగా పోయింది ఆయన ఆలోచన. ఎందుకై ఉంటుంది? అద్దె ఎక్కువ చేయడానికా?"
రంగనాధం కోమలమ్మ సమక్షంలో నిలబడ్డాడు.
"కూర్చోండి రంగనాధంగారూ"
కుర్చీలో యిబ్బందిగా కూర్చొన్నాడు రంగనాధం.
"మీ గిరిధర్ కు ఎక్కడైనా పెళ్ళి సంబంధం కుదిరిందా?"
"కుదరలేదు. మొన్న ఒక సంబంధం చూచి వచ్చాడు మావాడు. పిల్ల బాగానే ఉంది గాని, కట్నం వెయ్యి నూట పదహార్లు కంటే ఎక్కువ తూగమన్నారు. కనీసం మూడు వేలు అయినా లేనిదే పెళ్ళి కుదరదన్నాను. అవి నాకు మిగులుతాయని కాదు. మగ పిల్లవాడి పెళ్లి ఖర్చు మీద పడకుండా కావాలా వద్దా?"
"ఆఁ! పెద్ద అట్టహాసంగా ఖర్చుపెట్టి ఆకాశమంత పందిరీ, భూదేవి అంత అరుగు వేసి చేస్తేనే పెళ్ళి అవుతుందా ఏమిటి రంగనాధంగారూ? ముక్తసరిగా చేసినా పెళ్ళే, అట్టహాసంగా చేసిన పెళ్ళే. తప్పెట మ్రోగినా పెళ్ళే, భజంత్రీ మ్రోగినా పెళ్ళే"
ఆవిడ ఉపన్యాసానికి ఒళ్ళు మండి పోయింది రంగనాధానికి. 'మొన్న ప్రదానానికే పెళ్ళికి చేసినంత అట్టహాసం ఎందుకు చేశారండీ' అని అడగాలనిపించింది. పేదవాళ్ళ కొకమాట, ఉన్నవాళ్ళ కొక మాటా?
"ఒకనాడు మీరు కావాలనుకొని కోరుకొన్న సంబంధం మీ గిరిధర్ కు నేను కుదురుస్తాను. ఏమంటారు?" ఆవిడ తన లౌక్యాన్నంతా ప్రదర్శించసాగింది.
"ఏ సంబంధం?" ఆయన దృష్టి అంత చప్పున పారిజాత మీదికి పోలేదు.
"పారిజాత సంగతే నేను చెప్పేది? కృష్ణారావు మేస్టారికి మీకూ ఎంతస్నేహమో నాకు తెలుసు! మీరేకదా ఆయన్ని ఊరు విడిపించి తీసుకువచ్చింది ఇక్కడికి? మీకు కృష్ణారావు అంటే ఎంత అభిమానమో, పారిజాత అంటే ఎం మమకారమో ఈ కాంపౌండులో అందరికీ తెలుసు. మీరు కోరి కావాలనుకొని పారిజాతను మీ కొడుక్కి చేసుకోవాలనుకొంటే అప్పుడా పిల్ల ఏదో అజ్ఞానంచేత వద్దన్నది. ఇపుడు తన తప్పు తెల్సుకుని గిరిధర్ ను చేసుకోడానికి యిష్టపడింది. ఏదో తల్లీ తండ్రీ లేని పేదపిల్ల, తలా ఓ చెయ్యి వేసి ఓ ఇంటిదాన్ని చేస్తే..........
"చేస్తే పుణ్యమే. మా సంబంధం కాక మరేదైనా సంబంధం చూడండి, ఏదో........ చచ్చిపోయిన నా స్నేహితుడిమీద అభిమానంచేతో, పేదపిల్ల పెళ్ళన్న జాలిచేతో పదో పాతికో చందావేస్తాను!" రంగనాధం చురుగ్గా జవాబిచ్చాడు.
"మరో సంబంధమైతే మిమ్మల్ని పిలిచి ఈ చర్చించడమంతా ఎందుకు? ఏం? మీ గిరిధర్ కు పారిజాతను చేసుకోడానికి అభ్యంతరమేమిటి?"
"అభ్యంతరం ఏముంటుందో ఈ లోగిలిలో ఎవరిని అడిగినా చెబుతారు. కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం నాకు చాతకాదు. ఆ పిల్లను చేసుకోడానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకుంటుందో మీకు మాత్రం తెలీదా ఏమిటి?"
"దాచడం ఎందుకు? స్పష్టంగా చెప్పండి రంగనాధం గారూ?"
"పారిజాత పురాణం ఎవరికి తెలియదని? మీ మనోహర్ ఆమె ప్రేమించుకోలేదూ? కృష్ణారావు చనిపోయేప్పుడు 'మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను మాస్టారూ' అని మీ మనోహర్ మాటివ్వలేదూ? అతడు మాట ఇచ్చి ఎందుకు తప్పాడని నేను అడగొచ్చా? నా స్నేహితుడు చచ్చి స్వర్గాన వున్నాడు. అతడి తరపున నేను సంజాయిషీ అడుగుతున్నాను."
"అడగండి. తప్పేమీ లేదు." శాంత గంభీర స్వరంతో అంది కోమలమ్మ. "పిల్లలు. వాళ్ళు ఏదో అనుకొనివుంటారు తెలిసీ తెలియని వయసుచేత. పెద్దవాళ్ళం మనం సరిదిద్దాలి. మా మనూ పారిజాతను ప్రేమించి పెళ్ళాడతానని మాటివ్వలేదు. ఆ ముసలాడు కూతురు పెళ్ళి పెళ్ళి అని కలువరించి ప్రాణంపోలేక కొట్టుకొంటూంటే పారిజాత మావాడి కాళ్ళు పట్టుకొని తీసుకుపోయి మావాడిచేత ఆ అబద్దం ఆడించింది. ఆపద్ధర్మంగా మావాడు అన్న మాటకు కట్టుబడాల్సిన అవసరమేముంది?"
