"నీ శూన్యతత్వం వదిలిపెట్టుకొని వస్తే నీ కిక్కడ మిగిలిందీ శూన్యమే!" కసిగా అనుకొన్నది దేవదాసి. ఉత్తరం ముక్కలు ముక్కలుగా చించి గాలిలోకి ఎగురవేసి క్రిందికి వచ్చేసింది.
18
ఒకనాటి ఉదయం పదిగంటలవేళ సూటుకేసు పట్టుకొని ఫుల్ సూటులో గేటులోంచి ఇంటికేసి వస్తూన్న ఠీవి అయిన ఆ ఆకృతి చూచి, అతడేనా కాదా అని కళ్ళు నులుముకొని చూచినవారూ, కలలో ఉన్నామా అని ఒళ్ళు గిల్లుకొని చూచుకొన్నవారు ఉన్నారు. భార్గవరామ్ ఉత్తరం సంగతి తెలిసిన దేవదాసీ, ఆమె తల్లిదండ్రులూ, ఆశ్చర్యానికి, అపనమ్మకానికి లోనుకావలసిన అవకాశం లేదు.
మగవాళ్ళు పైమీది కొంగునోట్లో పెట్టుకొంటే, ఆడవాళ్ళు కొంగులు మూతికడ్డం పెట్టుకొని దుఃఖాన్ని అభినయించారు.
అయోమయంగా వరండాలో ఆగిపోయి "ఏమిటి, గోవిందస్వామీ? అని అడిగాడు భార్గవరామ్.
"ఎవరికోసం వచ్చావు, బాబూ? నీకోసం ఇంకా ఇక్కడ మిగిలిందేమిటి?"
'నాన్నకు.....' సంశయముతో ఆగాడు.
"అమ్మలేదు నాన్నలేడు, స్వర్గాన ఉన్నారు."
కుప్పలా కూలిపోయాడు భార్గవరామ్. అమ్మా, నా పరివర్తన చూచి సంతోషిస్తావనుకొన్నాను. మీ సేవలో నా జీవితం అంకితం చేద్దామనుకొన్నాను. నా పశ్చాత్తాపాన్నీ, పరివర్తననూ ఎవరు గుర్తించాలి? నన్ను శపిస్తూనే వెళ్ళిపోయి ఉంటావు అమ్మా!' అశృవులు ఆగలేదు. తుడుచుకొనే ప్రయత్నం కూడా అతడు చేయలేదు. స్తబ్థంగా కూర్చుండిపోయాడు.
శ్రీలక్ష్మి గుమ్మంలోకి వచ్చి చెప్పింది "లోపలికి రా, రామా!"
పదకొండో నాటివరకూ బావిగట్టున జరగాల్సిన కర్మ ముగిసింది. పన్నెండొనాటికి కర్మ ఇంట్లో జరుగుతున్నది క్షురకర్మ చేయించుకొన్న రమణ పిండాలు కడుతున్నాడు. చాలాసేపు అక్కడే నిలబడిపోయిన భార్గవరామ్ అతడినే చూస్తున్నాడు, వెనుకటికి ఎపుడో తల్లివ్రాసిన ఉత్తరంలో దత్తోహం మాట గుర్తువచ్చింది. ఊహించగలిగాడు అతడెవరో.
భార్గవరామ్ పైకి వెళ్ళిపోయాడు. దుస్తులు కూడా మార్చుకోకుండా అలాగే కూర్చుండిపోయాడు తన గదిలో. "పదవయ్యా స్నానంచేసిరా పిండాలకు నమస్కారం చేద్దువు." అని చెప్పింది శ్రీలక్ష్మి వచ్చి.
స్నానంచేసి శుభ్రమైన బట్టలు వేసుకొని వచ్చి పిండరూపంలో ఉన్న తల్లిదండ్రులకు భక్తిగా నమస్కరించి తిరిగి పైకి వెళ్ళిపోయాడు భార్గవరామ్. ఆ రోజంతా అతడు క్రిందికి రాలేదు. శ్రీలక్ష్మి వడ. పరమాన్నం తీసుకువచ్చి తినిపించింది.
తండ్రి తనమీదే మనసు పెట్టుకొని మరణించాడనీ తల్లి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొన్నదని అత్త చెప్పగా విని "నిజంగా నేను పాపిని, నన్ను క్షమించండి అమ్మా, నాన్నా!" అనుకొన్నాడు పదే పదే, భార్గవరామ్.
19
రమణారావు తండ్రికి మొదటినుండి శ్రీనివాసరావుగారి ఆస్తిమీద కన్ను ఉంది. అన్నగారి భార్య కాపురానికి వచ్చిన పది పన్నెండు సంవత్సరాలదాకా వారికి సంతానం కలుగకపోవడంతో, అన్నగారి ఆస్తికి వారసుడు తనేనని మురిశాడు. భార్గవరామ్ జననం అతడి ఆశలు తుదముట్టించింది. పుట్టినవాడు పెరిగాడు. వాడు పరమ విరాగైపోయాడని, తమ మంచి చెడ్డలు పట్టించుకొనడం లేదని అన్నగారి భార్య కృష్ణవేణి తన కొడుకును దత్తు చేసుకొంటానని చెప్పగానే అతడి ఆనందం అంతా యింతా కాదు!
బైరాగుల్లో కలిశాడనుకొంటున్న భార్గవరామ్ ఇప్పుడు అనుకోకుండా వచ్చేయడం రమణ తండ్రి గారిని అమితంగా కలవర పెట్టింది. రావుగారి విల్లుప్రకారం ఆస్తి స్వంత పుత్రుడికీ దత్తపుత్రుడికీ చెరిసగం చెందినా, భార్గవరామ్ పేచీపెట్టి ఈ దత్తునే కాదంటాడేమోనని భయపడ్డాడు.
పిల్లవాడి మేనమామను తమవైపు తిప్పుకొంటే అట్టే భయపడక్కర్లేదు. అందుకు ఒకటే ఉపాయం. రమణకూ దేవదాసికి త్వరగా వివాహం జరిగిపోవాలి. కూతురుకోసమైనా అల్లుడికి అండగా నిలబడతాడు సూర్యదేవుడు! ఏకాకి అయిన భార్గవుడు ఏమీ చేయలేడప్పుడు.
