Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 42


    "వాడికిష్టంలేకపోతే ఆమె ఎందుకు ఆడుతుంది?" అన్నాడు హన్మంతరావు.

    "ఇష్టమా పాడా! ఓవైపు నాకు కంపరమెత్తిపోతుంటే. ఎవరి ఇష్టాఇష్టాలను లెక్కచేసే మనిషి కాదామె. అంతా  తనిష్టమే. మగడన్న వాడి లెక్కా గిక్కా ఏం లేదు"

    "అంత మెతకదనమేమిటిరా?ఈడ్చి నాలుగు తన్ని ఈ పని వద్దు అనిచెప్పక" అంది సుబ్బమ్మ.
 
    ఈ సంభాషణ రహస్యంగా ఏం జరగడంలేదు! అంతా హరిత వింటూనే వుంది. చివ్వున తోకత్రొక్కిన పాములా వచ్చింది. "ఈడ్చి నాలుగు తంతే కిక్కురుమనకుండా పడి వుండడానికి మీకాలం ఆడవాళ్ళంకాదు అత్తయ్యా.... మీలాగ చదువూ, సంధ్యాలేని మొద్దులమూ కాదు మొగుడు తన్నినా, తిట్టినా వాడి కాళ్ల దగ్గిరపడి వుండాల్సిన ఖర్మ మాకు పట్టలేదు తప్పున్నా, లేకపోయినా పెళ్లాన్ని తన్నడానికి ఎవడిచ్చాడా అధికారాన్ని? భార్యా భర్తలంటే బానిసా యజమాని సంబంధంకాదు! పరస్పరం నమ్మకం, గౌరవం, సహకారం ప్రేమ - ఇవే భార్యభర్తల సంబంధానికి అర్దం చెప్పేవి! అంతేగాని ఈడ్చి నాల్గు తన్ని ఇంట్లో కూర్చోబెట్టడం కాదు!"

    "అమ్మో! ఈ కాలం కోడళ్లకి ఎంత బరితెగింపో! ఎంత ధైర్యమో. మా కాలంలో  ఇలా అత్తామామల ముందుకు, కనీసం మగడిముందుకైనా వచ్చేవాళ్లమా?  ఇలా ఎదురుపడి నువ్వెంత అని మాట్లాడేవాళ్లమా? అంతా పిదపకాలం, పిదపబుద్దులు."

    "మీ కాలంలో  మిమ్మల్ని ఒకింటికిపంపే కోడళ్లుగా కాదు. ఒకింటికి తోలే కట్టుబానిసలుగా తీర్చిదిద్దేవాళ్లు  మీ తల్లిదండ్రులు - అణకువగా వుండాలి. కన్నెత్తి చూడరాదు. పన్నెత్తి పలుకరాదు.  వగైరా బోదించి, బోధించి, ఈ కాలం పిల్లలు చదువుకొంటున్నారు. ఈ వుచ్చు పాఠాలను నాన్నెస్ అని కొట్టిపారేస్తున్నారు. కాలం చాలా మారింది అత్తయ్యా.  మీ కోడళ్లకి మీ కాలమే రావాలంటే ఎలా?ఎం. ఎ. చదివింది, అక్షర జ్ఞానంలేనిది ఒకటే ఎలా అవుతుంది?"

    ఊహించని అవమానం!  ఏ అత్తా సహించలేని అవమానం. భగ్గున మండిపోయింది అత్తగారు. "నువ్వే చదివావా బోడి ఎం. ఎ. చదువు?  అంతకే ఇంత విరగబాటా? మా అన్నయ్య కూతురు డాక్టరు. రేపో మాపో విదేశాలకు కూడా వెళ్లబోతూంది. వంటమనిషి లేకుండా పిల్లలకూ  భర్తకూ అదే వంటచేసి పెడుతుంది. భర్త  ఎంత చెబితే అంత."

    "భర్తకు, పిల్లలకూ వండిపెట్టుకోవడంలో నామోషీ ఏం లేదండీ? భర్త ఎంచెబితే అంత అన్నా నాకేంతప్పుగా  కనిపించడంలేదు. అతడామె వ్యక్తిత్వాన్ని  గౌరవిస్తున్నాడు. అతడిమాటలు ఆమె వింటే తప్పేమిటి? ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాడనడానికి  గుర్తు ఆమె ఫారిన్ వెళుతూంది పై చదువులకు! భర్త నుండి భార్యకు అంతకంటే ఏం కావాలి?"

    "ఆహాఁ నీ తైతక్కలకు వాడు ప్రోత్సహించడం లేదనా నీ మంట!"

    "నాట్యాన్ని తైతక్కలనకండి మాటిమాటికీ" హరిత అసహనంతో అరిచింది.
 
    "తైతక్కలుకాక ఇంకేమిటి?"

    "పందికి పన్నీరువాసనేం తెలుస్తుంది అన్నట్టు నాట్యం గురించి ఓనమాలు తెలియని మీరు అంతకంటే ఇంకేమనగలరు లెండి."

    హరిత విసురుగా వెనుదిరిగి వెళ్లిపోతుంటే బాణములా దూసుకువచ్చాడు కమలాకర్. క్షణంలో ఆమె లేత బుగ్గలు అతడి చేతులలో కందిపోయాయి. "పెద్దా, చిన్నా గౌరవంలేకుండా ఏమిటా మాటలు? నోటికి ఎంతొస్తే అంతేనా?" నిప్పులు చెరుగుతూ అన్నాడు.

    "తలిదండ్రుల పెంపకం అలా ఏడ్చిందనాలి" అంది సుబ్బమ్మ.

    "ఓ! మీరు పెళ్లాన్నికూడా కొట్టగలరన్నమాట. ఇప్పుడు పూరణ పురుషులనిపించుకున్నారు" హరిత కళ్లు నిప్పులు చెరుగుతూంటే వ్యంగ్యంగా అంది.

    "మళ్లీ నోరెత్తావంటే చంపేస్తాను... ఏమనుకొన్నావో నా దగ్గిర పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూడకు."

    బురదలో రాయివేస్తే ముఖాన చిందుతుంది. గాడిద దగ్గరికి వెడితే వెనక్కాళ్లతో ఝాడించి తంతుంది. అలా అనుకొని హరిత నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిపోయిందేగాని భర్త కోపానికిగాని, అత్త మామల అధికారానికిగాని భయపడికాదు.
 
    వైవాహిక జీవితంలో తొలి అడుగుపడింది పూలలో కాదు ముళ్ళలో. ముందు ముందుకు దృష్టి సారించి చూస్తే కనిపించినంతమేరా  ముళ్ళేగాని పూలెక్కడా కనిపించడంలేదు. హరితకు నిస్పృహగా అనిపించింది. కళ్లముందు అంతా చీకటి పరుచుకొన్నట్టుగా వుంది.

    ఆ తరువాత భర్తా, మామగారు మాట్లాడుకొన్న విషయాలు విన్నాక ఆ చీకటి మరింత దట్టమయిపోయింది.
 
    "కట్నం డబ్బుల్లోంచి స్కూటర్ కి కావాలి అని వ్రాశావు! మీ మామ లక్ష మాట్లాడి తీరా చేతిలో  పెట్టింది డబ్బైవేలే! మిగతా ముప్పైవేలకి రెణ్ణెల్ల గడువు పెట్టాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS