Previous Page Next Page 
కావేరి పేజి 42

    ఇంక తను చెప్పటం అయిపోయిందన్నట్టుగా అక్కడనుంచి గబగబా వెళ్ళబోతుంటే కావేరి ఆమె చెయ్యిపట్టుకుని ఆపింది.

    "ఎందుకలా వెళ్ళిపోతున్నావు?" అనడిగింది.

    "తనను గురించి ఎవరయినాసరే! ఎక్కువగా చెప్పుకుంటే బాబు ఊరుకోడు! తనకి పొగడ్తలంటే ఇష్టంవుండదు. ఎక్కడ వింటాడోనన్న భయం! నేను చెప్పింది గుర్తున్నదా?" అంటూనే నిష్క్రమించింది అంబుజం!

    అప్పటివరకూ అనేక అనుమానాలతోను, అపనమ్మకాలతోనూ కొట్టుమిట్టాడుతున్నా ఆమె మనసులోని సంశయాలన్నీ ఎక్కడివక్కడే పటాపంచలయిపోయాయి. సంపూర్ణమయిన నమ్మకం ఏర్పడింది కావేరికి...తానేదో ఘనవిజయం సాధించినంత రిలీఫ్ గా ఫీలయింది.

    ఆ పల్లెటూరిలో నాలుగుగోదాలమధ్యా వుండటంవలన తనకేమీ తెలిసేదికాదు! యింకా తను చాటుచాటుగా సినిమాపత్రికలు , కథలపుస్తకాలూ కొనుక్కుని చదవబట్టి నాటకంలో వేషంవేసి అందరిమెప్పూ పొందబట్టిగాని ఈ మాత్రమయినా అర్ధంచేసుకో గలుగుతోంది. లేనట్లయితే ఈ మహాపట్నంలో తనలాంటివాళ్ళు ఎంతమందో మోసపోతుంటారు. అందరికీ మాధవరావులాంటి మంచివాళ్ళు దొరకరుగా?

    అలా భావించుకుంటున్న కావేరి దగ్గిరకు వచ్చాడు మాధవరావు ఎంతో హడావుడిగా!

    అప్పుడే చూస్తున్నట్లుగా ఎంతో అపురూపంగా వున్నాయి ఆమె చూపులు. యింత మంచిమనిషి దొరకటం తన అదృష్టం అనుకుంది మనసులోనే!

    "సినీతార జయశీలని బుక్ చేసేందుకు వేలాయుధంగారు వచ్చారు. ఆమె కాల్ షీట్స్ లేవన్నదట!"

    "కాల్ షీట్స్ అంటే ఏమిటండీ?" తెలియక అడిగింది.

    "షూటింగ్ ఫలానా, ఇన్ని రోజులలో మీరు చేయాలి! అని నిర్ణయించబడేదానిని కాల్షీట్సు అనంటారు. అందుకు ఇష్టపడిన నిర్మాత ఆ నటీమణిని బుక్ చేసుకుని ఆమె యిచ్చిన తేదీలలో కనుక షూటింగ్ పూర్తిచేసుకోకపోతే ఇంకొక్కరోజుకూడా ఆ నిర్మాత తీసే సినిమాలో యాక్ట్ చేయదు!"

    "సినిమా మిగిలిపోతే?"

    "ఆమెకు నిర్మాత మరో లక్షరూపాయలు ఇచ్చి మిగిలిన షూటింగ్ చేసి తన సినిమా పూర్తిచేసుకుంటాడు!"

    "అమ్మో!" గుండెలమీద చెయ్యివేసుకున్నది కావేరి.

    "మరేమిటనుకున్నావు? సినిమాతారగా రావటం ముందు కొంచెం కష్టం అయినా నిర్మాత, డైరెక్టర్ చెప్పినట్టువింటే ఎంతోత్వరగా హీరోయిన్ అవగల అవకాశాలున్నాయి."

    "అలాగా!" ఏదో ఆలోచించుతూ అంది.

    "ఇంక వెళదామా? కొనవలసినవి చాలావున్నాయి. లిస్టు తయారుచేయాలి పద! పద!"

    "వేలాయుధంగారన్నారు?"

    "నేను మాట్లాడనులే! కొత్తవారితో సినిమా తీస్తారట! అన్ని హంగులూ సమకూర్చుకున్న తరువాత నీ దగ్గిరకు తీసుకువస్తాను. ఆయన దృష్టి పడిందంటే చాలు! నువ్వు హీరోయిన్ అయిపోయినట్టే!"

    ఆలోచించుతూ కావేరి బయటికి నడిచింది.
   
                             19

    అదే లగ్నానికి వినాయకరావుకి సంబంధం చూసి పెళ్ళిచేయాలని సంకరం, కామాక్షమ్మ తీవ్రప్రయత్నాలు చేశారు. ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన ఆ తల్లీకొడుకు పూజారిని, ఆ గ్రామంలోని మరో ఇద్దరు పెద్దమనుష్యులు అనబడేవారిని, సోములుని తోడుయిచ్చి తానయి అడగమన్నట్లుగాకాక వీళ్ళే అడుగుతున్నట్లుగా అడిగించింది. ఇదివరకు వేలకువేలు కట్నం, పొలంకూడా కలిపి కట్నంగా ఇస్తామని వచ్చినవారి దగ్గిరకు పంపారు!

    "కట్నం సమస్య ఎప్పుడూలేదు కామాక్షమ్మగారికి! మేనకోడలు వుందని అప్పుడలా అన్నారు! ఈ లగ్నానికి మీ అమ్మాయినిచ్చి వినాయకరావుకి పెళ్ళిచేస్తే బాగుంటుంది!"

    అన్నారో లేదో ఆ పిల్లతండ్రి అంతెత్తున ఎగిరి పడిపోయాడు.

    "వాడికా? ఏమాత్రం మొగతనం లేదనేగా ఆ పరంధామయ్య కూతురు వేరేవాడితో లేచిపోయింది? అలాంటి సన్యాసికి యిచ్చి నా కూతురు గొంతు కోయలేను!" అన్న ఈసడింపుతో బైటికి రావటం!

    "కట్నం ఇవ్వకపోయినా కామాక్షమ్మగారే స్థితిపరులు! అలాంటి వారింటి కోడలు అవటం మీ అమ్మాయి అదృష్టం! ఈ లగ్నానికే?" మాట పూర్తి చేయకుండానే అందుకునేవారు.

    "మాకేం డబ్బు లేదనుకున్నారా?...కట్నం లేకుండా మా పిల్లకి పెళ్ళి చేసేటంత హీనానికి దిగజారలేదు. ఆ ఆడంగి వెధవకి మా అమ్మాయిని యిచ్చి చేసేటంత అదోగతిలో లేను వెళ్ళండి!"

    ఆ చీత్కారాలు, అభాండాలూ విన్న ఆ పెద్ద మనుష్యులు మారుమాట్లాడకుండా వచ్చేయటం! వాళ్ళు చెప్పలేక చెప్పలేక కామాక్షమ్మకి సంకరానికి వివరించారు.

    "ఇలాంటి అబద్దాలు ఎవరు సృష్టించి ప్రచారం చేశారు?"

    అని ఆలోచించిందిగాని కామాక్షమ్మ దృష్టిలో ఎంత గాలిహ్సినా ఎవరూ కనిపించలేదు.

    అది వెంకయ్య అదృష్టం!

    పిల్లకోసం అడిగేటందుకు వెళ్ళిన వాళ్ళు ముఖాలు వేలాడేసుకుని తిరిగి రావటం చూసిన వెంకయ్య ఎంతో సంబరపడిపోయాడు.

    తన పాచిక పారిందని ఆనందించాడు.

    ఇంకా కామాక్షమ్మకి తన కూతురు తప్ప కోడలుగా యింకెవ్వరూ లేరు! రారు కూడాను! అంతగా వారి మనసులు నాతుకునే విధంగా నూరి పోశాడు...తన అతిశయం అంతా వదులుకుని-

    "మీ సుబ్బులుని నా కోడలుగా చేసుకుంటాను వెంకయ్యా!"

    అని తననే అడుగుతుంది...అప్పుడు తనేమని అల్నాలో రిహార్సలు మనసులోనే వేసుకోసాగాడు.

    తన కూతురిని వినాయకరావుకి చేసుకోమని వెళ్ళి అడిగితే ఎంత ఛీత్కరించింది? ఎన్ని మాటలు అన్నది? ఆ కావేరి లేచిపోవటం విన్నప్పుడే వెంకయ్య ఎంతో ఆనందించాడు.

    తన కూతురు ఎంతో అదృష్టవంతురాలు అవుతుందని అనుకున్నాడు....

    తనను ఎంత తేలికగా తీసి పారవేసింది ఆ రోజున? యిప్పుడేమయినది? తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి కల్పించింది....మహా బాగా చేసింది! అని తనలో తనే అనుకున్నాడు.

    కావేరీ వెళ్ళిపోయినా రోజునుంచీ కిరాయికి ఎవరికీ ఎడ్లబండి కట్టటంలేదు. ఉదయం లేచింది మొదలు సాయంత్రంవరకూ వీధి అరుగుమీద కూర్చోవటం, వెళ్ళిపోయే వారిని పలుకరించి మరీ మాట్లాడటం! చీకటిపడిన తరువతః పక్క గ్రామాలకి వెళ్ళి వారితో ఎంతో పని వున్నట్లుగా యింటి లోపలికెళ్ళటం. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువతః వినాయకం గురించి ఎంతో తేలికగానూ, అతని భవిష్యత్తుని దెబ్బ తీసేటట్లు "మగతనం లేదు!"
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS