"ఏమిటి?" రవి గాబరాగా అన్నాడు.
"కన్పించడంలా? మాంగల్యం! పెళ్ళిచేసుకోమన్నావుగా!"
"నన్ను చేసుకోమన్నానా?"
"నువ్వు అనలేదు. కానీ నేను ప్రామిస్ చేసింది మాత్రం నిన్ను చేసుకోవటానికనే!" అంది ఇందిర దృఢంగా.
రవి ఇందిర ముఖంలోకి అయోమయంగా చూశాడు.
"రవీ ! ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం కొరకే నేను యుగాలుగా వేచి వున్నాననిపిస్తోంది. ఈ ఒక్కరోజూ ఆనందం తాలూకు అనుభూతి చాలు! జీవితాంతం మననం చేసుకుంటూ బ్రతుకుతాను. ఈ సుఖానికి నన్ను దూరం చెయ్యకు!" అంటూ మాంగల్యాన్ని రవి చేతిలో పెట్టింది.
రవి రెండు చేతులతో మాంగళ్యాన్ని పట్టుకొని రెండు తాళ్ళ మధ్యగా ఇందిరముఖాన్ని చూస్తూ ఉద్రేకంగా అన్నాడు-
"ఇది మాంగళ్యం కాదు. ఇది ఉరిత్రాడు. ఈ ఉరితాడు నా చేతులతో నీ మెడకు తగిలించమంటావా? నేనేం పాపం చేశానని నాకు ఇంత దారుణశిక్ష విధిస్తున్నావ్? చెయ్యని అపచారానికి ఉరిశిక్ష ఎటూ నాకు తప్పడం లేదు.
కనీసం నేనేం పాపం చెయ్యలేదనే సంతృప్తితోనైనా ఉరికంబం ఎక్కాలనుకొన్నాను. కానీ చివరకు నన్ను హంతకుడిగా చంపాలని ఉద్దేశమా?"
ఇందిర చటుక్కున రవి చెయ్యిపట్టుకుంది. "ఇది హత్య ఏ మాత్రం కాదు రవీ! ప్రాణ దానం. అర్థంలేని నా జీవితానికి ఓ అర్థం కలిగించడం! నువ్వు లేని ఈ జీవితానికి ఓ ఆధారం!"
"నేను అంతపని చెయ్యను! చెయ్యలేను ఇందూ! చూస్తూ చూస్తూ చావబోతూ నీ మెళ్ళో మాంగల్యం కట్టే దుర్మార్గుడ్ని కాదు. నీ ఆవేశాన్ని అవకాశంగా తీసుకొనే అంతటి స్వార్ధపరుడ్ని మాత్రం కాదు."
"అవును! నువ్వు స్వార్థపరుడివి కాదు. దుర్మార్గుడివి కాదు. విశాల హృదయం కలవాడివి. ఆదర్శమూర్తివి. గొప్పవాడివి. గొప్పవాడివిగానే నిరూపించుకొని చచ్చిపో! నేనే దుర్మార్గురాలిని, స్వార్థపరురాల్ని. నీకు కళంకాన్ని ఆపాదించటానికి ప్రయత్నిస్తున్నాను" ఇందిర పిచ్చి ఉద్రేకంతో ఊగిపోతూ అన్నది.
"ఇందూ నన్ను అర్థం చేసుకో!" దీనంగా అన్నాడు.
"ఆ మాటే నేనంటే, నన్ను అర్థం చేసుకుంటావా?"
"ఇందూ!" రవి కంఠం వణికింది. ఆపై మాటలు కంఠంలోనే ఆగిపోయాయి.
"రవి నా ఈ ఒక్క కోరిక...కోరిక కోరిక కోరిన ఒకే ఒక్క కోరిక చివరిదీ, మొదటిదీ అయిన ఈ ఒక్క కోరిక కాదనకు. నా జీవితం నుండి శాశ్వతంగా నిష్క్రమించే ముందు నాకోసం ఈ ఒక్క త్యాగం చెయ్యలేవా? నీ ప్రేమకు చిహ్నంగా నిలవాలని ఉంది. నిన్నే స్మరిస్తూ భావి జీవితాన్ని గడపాలని ఉంది. నాకు అవివాహితగా చచ్చిపోవడం ఇష్టంలేదు రవీ! ఈ మాత్రం నా కోసం..." భోరున ఏడ్చింది ఇందిర.
రవి ఆర్తిగా ఇందిరను రెండు చేతులతో హృదయానికి హత్తుకున్నాడు. ఆమె కళ్ళు తుడిచాడు. వణుకుతున్న చేతుల్తో మాంగల్యం కట్టాడు.
ఇందిర ఆనందంగా నవ్వింది.
"రవీ!" అంటూ ఇందిర రవిని చుట్టుకుపోయింది. రవి గాఢంగా ఇందిరను హత్తుకున్నాడు.
తన్మయత్వంలో, సమస్త దుఃఖాన్ని మరచి రవి కౌగిలిలో ఒదిగిపోయిన ఇందిరకు సమస్త సృష్టీ ఆగిపోయినట్టు అనిపించింది. ఆ క్షణం కోసమే తను జన్మించినట్టు అనుభూతి పొందింది.
"రవీ !" పులి గాండ్రింపు.
రవి ఇందిరను వదిలేశాడు. ఇందిర ఉలిక్కిపడి చూసింది.
"దుర్మార్గుడా! ఏమిట్రా చేశావ్? ఒక అమాయకురాలి నిండు జీవితాన్ని నాశనం చేస్తావా? రేపు చచ్చేవాడివి ఇవ్వాళ పెళ్ళి కావాల్సి వచ్చిందా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న ఇందిరకే ఇంత ద్రోహం తలపెడ్తావా? మనిద్దరం దుర్మార్గులమేరా! నా వారసత్వమే నీకూ వచ్చింది. నేను ఇందిర తల్లి జీవితంలో నిప్పులు పోశాను. నువ్వు ఇందిర జీవితాన్ని బలికొన్నావు. నా రక్తమే నీలోనూ వుంది. మనిద్దరం మరో క్షణం కూడా బ్రతకకూడదు. నిన్ను చంపి నేను చస్తాను." జగన్నాథం పిచ్చి కోపంతో రైఫిల్ పైకెత్తాడు.
ఇందిర రవికి అడ్డంగా నిల్చుంది.
"నువ్వు తప్పుకో తల్లీ. ఇవ్వాళ మా ఇద్దరి రక్తం ప్రవహించాలి. మీ కుటుంబానికి చేసిన పాపాన్ని కడిగెయ్యాలి. ఇద్దరం ఒకే చితిమీద కాలాలి. అప్పటికైనా మీ అమ్మ గుండెల్లో మండుతున్న అగ్ని చల్లారితే నేను చేసిన పాపానికి నిష్కృతి అయినట్టే!" అన్నాడు జగన్నాథం ఉద్రేకంగా.
"మామయ్య నన్నొకసారి చూడండి. నా మెళ్ళో మాంగల్యం చూడండి. ఇంకా కొన్ని గంటలయినా కాలేదు. అంతలోనే నా మాంగల్యాన్ని తెంచి వేస్తారా? నొసటి కుంకుమ నేల రాలుస్తారా? ఈ రోజు... ఈ ఒక్క రోజైనా సంతోషంతో గడిపే అవకాశం ఇవ్వరా! ఇందులో రవి చేసిందేమీ లేదు. నేనే బలవంతం చేశాను. కన్యగా చనిపోవడం నాకిష్టం లేదు. జీవితమంతా అవివాహితగా నన్ను నేను ఊహించుకోలేకపోయాను. అందుకే బలవంతంగా నిష్టూరాలు ఆడి, ఏడ్చి, ఈ మాంగల్యం కట్టించుకున్నాను."
జగన్నాథం నీళ్ళు కారిపోయాడు. ప్రక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు.
రవి లోపలకు వెళుతూ ఉంటే పిల్చి పక్క కుర్చీలో కూర్చోమన్నాడు జగన్నాథం.
