Previous Page Next Page 
వైరం పేజి 42


    "పనిలో పనిగా ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలని ఏమార్చి మన ఏజెంట్లుగా మార్చేశాం!" అన్నాడు అభిరాం నవ్వుతూ.
    తృప్తిగా తల పంకించాడు బిగ్ బాస్.
    "మీరు ఏ పని అయినా సరే చేసెయ్యగలరని నాకు తెలుసు!" అన్నాడు.
    అది నిజమే!
    తాము గూఢచారి ఏజెంట్లుగా మారిపోయామని శృతికీ, సునయనకీ కూడా తెలియదు. తమని అభిరాం యూస్ చేసుకుంటున్నాడని వాళ్ళిద్దరికీ తెలియదు. శృతికి తెలిసినది సునయనకి తెలియదు. సునయనకి తెలిసినది శృతికి తెలియదు. అభిరాంకి తెలిసినది జోకి తెలియదు. బిగ్ బాస్ కి తెలిసినవి మరెవ్వరికీ తెలియవు!
    అందరి పనీ ఒక్కటే!
    ఒకరిని ఒకరు వాడేసుకోవడం! అంతర్జాతీయ గూఢచారుల గూడుపుఠాణీ!
    ఆ పవర్ పాలిటిక్సులో ఎవరు పావులో, ఆ పావులని కదిపే వారెవరో ఎవరికీ తెలియదు! అన్నీ తనకి తెలుసనుకుంటున్న 'బిగ్ బాస్' లాంటి పెద్ద తలకాయలకి కూడా తెలియకుండా అమెరికాలో ఇంకోచోట ఇంకొక గూఢచారి వ్యవస్థ ఏర్పడుతోంది.
    పేరు -స్ట్రాటెజిక్ సపోర్ట్ బ్రాంచ్.
    అది అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతోంది.
    దేశాల మధ్య ద్వేషాలు ఉండడం సహజమే!
    అయితే - ఒక దేశంలోని వేరువేరు డిపార్టుమెంట్ల మధ్య కూడా డిఫరెన్సులు ఉండడం కామనే!
    అదొకరకం వైరం!
    బిగ్ బాస్ ఉండే సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ - 'సీ.ఐ.ఏ.' తో సంబంధం లేకుండా, 'పెంటగాన్' అనబడే అమెరికన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పడింది ఈ కొత్త గూఢఛారి వ్యవస్థ.
    ప్రపంచంలో అందరూ అసహ్యించుకునే టైపు ప్రబుద్ధులని కూడా అందులో చేర్చుకునే ప్రయత్నం! ఆ గూఢఛారుల లిస్టులో కూడా -
    పై వరసలోనే ఉంది అభిరాం పేరు! 'నరరూప రాక్షసుడు'గా నమోదు అయి!

                      *    *    *    *

    "నాకు తెలిసినదంతా నీకు చెబుతాను. ఫెయిర్ ఈజ్ ఫెయిర్! మాది ఇండియా. మా డాడీ చండీదాస్ ఇవాళ్టి ఎమ్మెల్యే - రేపటి మినిస్టరు" అంది శృతి, సునయనతో.
    అంతే తప్ప, అంతకుముందు అతనొక గ్యాంగ్ స్టర్ అని చెప్పలేదు.
    అంతకుముందర ఏమిటీ? అతను ఇప్పటికీ గ్యాంగ్ స్టరే - రౌడీ ఎమ్మెల్యే!
    అంతే తప్ప, అంతకుముందు అతనొక గ్యాంగ్ స్టర్ అని చెప్పలేదు.
    అంతకుముందర ఏమిటీ? అతను ఇప్పటికీ గ్యాంగ్ స్టరే - రౌడీ ఎమ్మెల్యే!
    "మా నాన్నకి సినిమాలంటే చాలా ఇష్టం! ఎప్పటికైనాసరే, టాప్ హీరోతో టాపు లేపేసే సినిమా తీయాలని కోరిక! అందుకే అభిరాంని కలిశాడు. పెద్ద హీరోగారి డేట్లు ఇప్పిస్తానని చెప్పాడు అభిరాం. అతను తలుచుకుంటే చెయ్యలేని పని అంటూ లేదు. అయితే, నిన్ను హీరోయిన్ గా పెట్టుకుంటేనే ఆ పని చేస్తానన్నాడు అభిరాం. అదీ సంగతి" అంది శృతి.
    'అరుణ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసుకొస్తేనే నీకు పెద్ద హీరో డేట్లు ఇప్పిస్తాను' అని అభిరాం దాసుకి ఒక టెస్టు లాంటిది పెట్టడం శృతికి తెలియదు కదా!
    ఆమెతో అభిరాం చెప్పినవన్నీ అర్థసత్యాలే - వాటిలో చాలా అసత్యాలు కూడా!
    తన మనసుని దొలిచేస్తున్న ప్రశ్నని బయటపెట్టింది సునయన.
    "నువ్వు కూడా...." అని ఆగి, "బాగానే ...వుంటావు కదా! మరి నిన్నే ఎందుకు హీరోయిన్ గా పెట్టుకోలేదూ?" అంది ఆరాగా.
    ఒక్కసారిగా సంతోషం ముంచుకొచ్చేసింది శృతికి.
    అంతే కదా మరీ!
    ఒక మిస్ యూనివర్స్ తన అందాన్ని అయిష్టంగా అయినా సరే, గుర్తించవలసి వస్తోందంటే - సంతోషం కాక మరేమిటీ?
    "అదే మాట అన్నారు మీ డాడీ కూడా. మిస్ యూనివర్స్ పోటీకి నేను కూడా వెళ్ళి వుంటే నీ బదులు నేనే సెలెక్టు అయి వుండేదాన్నిట. నువ్వు టైటిలు మిస్సయిపోయి వుండేదానివిట! మీ డాడీకి వయసు మీద పడింది గానీ, తను ఇంకా వయసు మీద వున్నట్లే మాట్లాడతారు - మహా సరదా మనిషిలే!" అంది శృతి - సునయన మొహంలో మారుతున్న రంగుల కలయికని ఎంజాయ్ చేస్తూ.
    ఎదుటివాళ్ళని నొప్పించడంలో ఎంజాయ్ మెంటు లేదని ఎవరనగలరూ?
    ఆ తర్వాత ఇంకా అక్కడ అరక్షణం సేపు కూడా ఉండాలని అనిపించలేదు సునయనకి. తామిద్దరినీ అక్కడ ఉండమని చెప్పి వెళ్ళిన అభిరాం కోసం వెయిట్ చెయ్యాలని కూడా అనిపించలేదు.
    తక్షణం వెళ్ళిపోవాలి!
    వెళ్ళి తండ్రిని నిలదీయాలి!
    నిలదీసి అన్నీ అడిగేసి నిలువునా కడిగేయాలి!
    ఎన్నెన్ని అవమానాలు తమకి -
    ఆయన దయవల్ల!
    మిస్టర్ ఆనంద్! తనకు తండ్రి కాని తండ్రి!
    ముసలి కేసనోవా!

                      *    *    *    *

    'కళ' అని ఇంటిపేరు రాసి వున్న రాతిఫలకం వైపు చూశాడు దాస్.
    చూడడం అయితే చూశాడుగానీ, చూసీ ఏమీ లాభం లేదు.
    ఎందుకంటే, అతనొక నిరక్షర కుక్షి.
    అక్షరజ్ఞానం లేని అంగుఠాగాడు.
    వేలిముద్రలు వేసే నిశానీ టైపు.
    పూర్వాశ్రమంలో అతనిమీద పాతిక పైనే పోలీసు కేసులు వున్నప్పుడు అతని వేలిముద్రలు పోలీస్ స్టేషన్ లలో వుండేవి.
    అతను ఇంకా ఇప్పుడు కూడా రౌడీ పద్ధతులు మానలేదు గానీ, ఎమ్మెల్యే అయ్యాక ఆ రౌడీషీటుని తొలగించుకోగలిగాడు. జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి విద్యాశాఖ ఇస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
    అరుణ ఇంటిని పరీక్షగా చూశాడు దాస్.
    అది ఒక ముని వాటికలాగా వుంది.
    అందులో జొరబడబోయే మృగంలా ఉన్నాడు దాస్.
    కాలింగ్ బెల్లు నొక్కాడు.
    అది మోగలేదు.
    కరెంటు లేదా?
    బెల్లు మోగకపోవడానికి కారణం బిల్లు కట్టకపోవడమే అయి ఉండవచ్చునని అతనికి ఓ అరనిమిషం తర్వాత తట్టింది.
    లేళ్ళూ దుప్పులూ ఏ దెబ్బ తగిలో, లేదా జబ్బుపడో నిస్సహాయంగా ఉన్నప్పుడు నేర్పుగా పట్టేసుకోగలదు పులి.
    అచ్చం అట్లాగే -సాటిమనిషి 'బీదరికం' అనే డబ్బు జబ్బుతో సగం చచ్చి ఉన్నప్పుడు, వెంటాడి తమవెంట తిప్పుకోవడంలో అంత ఎక్కువ కష్టం ఉండదని గ్రహించినవాడు దాస్.
    అరుణది అలాంటి కేసే అని అతను అనుకున్నాడు.
    తలుపు తట్టాడు.
    తట్టిన తక్షణం తెరుచుకోలేదు తలుపు.
    కొద్దిక్షణాల తర్వాత, ఒక చెట్టుకిందనుంచి వచ్చింది అరుణ.
    "ఎవరు?" అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది.
    "నేను దాస్. డాక్టర్ చండీదాస్ - ఎమ్మెల్యేని."
    "అయితే?" అన్నట్లు మొహం పెట్టింది అరుణ.
    "నువ్వు మా ఆనంద్ కూతురివి
    అయిష్టంగానే, అవునన్నట్లుగా తల వూపింది అరుణ. "మీనాయన మహానటుడు! తెలుగోడే అయినా తెలుగులోనే వుండిపోక హిందీ ఫీల్డులోకి వెళ్ళిపోదామని తెగ తాపత్రయపడ్డాడ్లే పాపం!
    హిందీలోకి వెళ్ళాక తన పేరు కూడా పంజాబీ పేరులాగా మార్చేసుకున్నాడు. ఆనంద్ కుమార్ కాస్తా ఇంకో 'ఆనంద్'ని తోకలాగా తగిలించుకుని ఆనంద్ కుమార్ ఆనంద్ అయ్యాడు. ఒక దేవ్ ఆనంద్ లాగా, ఒక హన్స్ రాజ్ హన్స్ లాగా!"
    ఏమీ మాట్లాడలేదు అరుణ.
    "మీ నాయన - అదే ఆనంద్ కుమార్ ఆనంద్, నాకు ఇంతప్పటినుంచీ తెలుసమ్మా! లంగోటా ఫ్రెండు! నేను ఉగ్గు తాగడం మానేసి పెగ్గు వేయడం మొదలెట్టినప్పటినుంచీ నాకు ఫీల్డుతో సంబంధం!" అన్నాడు దాస్ గొప్పగా.
    అంతే తప్ప, వేలెడంత ఉన్నప్పటినుంచీ తను సినిమా హాళ్ళలో టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముతూ ఉండేవాడినని మాత్రం చెప్పలేదు.
    అరుణ అతన్ని కూర్చోమని అనలేదు. అయినాసరే, అతను అక్కడే ఉన్న ఒక అరుగు మీద కర్చీఫ్ పరిచి, చతికిలబడుతూ "మీనాయన గొప్ప నటుడమ్మాయ్! కాలం ఖర్మం కలిసిరాలేదు గానీ..." అని మళ్ళీ మొదలెట్టాడు.
    'ఇవన్నీ నాకు అనవసరం' అన్నట్లు విసుగ్గా చూస్తోంది అరుణ. కానీ దాస్ మాత్రం తన ధోరణిలో తాను చెప్పుకుపోతూనే వున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS