రవికుమార్ చెప్పిన పుస్తకాల షాపువాడు నాలుగురోజుల క్రితమే షాపు ఖాళీ చేసి పారిపోయినట్టు తెలుసుకున్న ఇన్ స్పెక్టరు వీరేష్ నీరసపడిపోయాడు.
నేరస్థుని చిరునామా తెలిసింది. అతని ద్వారా మిగిలిన ముఠాను పట్టుకోవచ్చునని అనుకున్నాడు తను. కాని ఇప్పుడా ఆశ కాస్తా నీరుగారి పోయింది.
ఈ పరిస్థితులలో ఏం చేయాలి? అడ్రసు లేకుండా పోయిన వ్యక్తి గురించి ఎక్కడని వెదకాలి?
ఈలోపుగానే బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు దళారుల చేతులు మారి ఇతర రాష్ట్రాలకు, దేశ విదేశాలకు ఎగుమతి అయిపోవని నమ్మకం ఏమిటి?
ఈ నేపథ్యంలో రవికుమార్ అవసరం ఎంతవరకు ఉంది?
అసలు నేరస్థులు పట్టుబడితే, రవికుమార్ ను అప్రూవరుగా తీసుకుని, అతనికి క్షమాభిక్ష పెట్టించి నేరస్తులకు శిక్ష పడేట్టు చేయవచ్చు. కాని ఇప్పుడా అవకాశం చేజారిపోయింది.
రవికుమార్ ను ప్రేరేపించిన అశ్లీల సాహిత్యం, అది రాసిన రచయిత మీద ఏ చర్యా తీసుకోలేని ప్రస్తుత చట్టాలను, విధానాలను నిందించడం మినహా తను చేయగలిగిందేమీ లేదు.
కాలేజీ విద్యార్థినుల పట్ల సానుభూతి, రవికుమార్ స్థితికి జాలి కలిగిందా క్షణంలో వీరేష్ కు.
పోలీసు స్టేషన్ లో అడుగుపెట్టిన వీరేష్ లాకప్ లో కనిపిస్తున్న దృశ్యం చూసి దిగ్బ్రాంతి చెందాడు.
అతని హృదయం లయ తప్పి కొట్టుకుంది. ఒళ్ళు చల్లబడి ముఖాన ముచ్చెమటలు పోశాయి.
సిబ్బందిలో గుసగుసలు ప్రారంభమయ్యాయి.
లాకప్ డెత్! రవికుమార్ ఈజ్ డెడ్! ఉరి వేసుకుని చనిపోయాడు.
రవికుమార్ ను ఎవరూ క్రూరంగా ఇంటరాగేట్ చేయలేదు. మాన్ హాండిల్ చేయలేదు. థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించలేదు. అతని మనసును ఏమాత్రం గాయపరచలేదు. అతన్ని ఏ విధంగానూ అగౌరవ పరచలేదు, అవమానపరచలేదు. మరెందుకు అతను ఉరివేసుకున్నాడు?
నిందితుని మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వలన ఎంతో అనర్థం జరిగిపోయింది. ముందుగా అతని ఆలోచనలను కనిపెట్టి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో! ఇన్ స్పెక్టరు వీరేష్ పరిపరి విధాల ఆలోచించాడు.
అతని ఆలోచనలకు జవాబుగా సెల్ లో ఒక మూలగా కాగితం రెపరెపలాడుతూ కనిపించింది.
ఆత్రుతగా ఆ కాగితాన్ని విప్పి చూశాడు వీరేష్. అది రవికుమార్ తనకు రాసిన లేఖ.
"ఇన్ స్పెక్టరు గారికి!
నేను ఎవరూ క్షమించరాని తప్పు చేశాను. చౌకబారు సాహిత్యమే నాలో జుగుప్సాకరమైన ఆలోచనలను రేకెత్తించింది. నా వలన చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయాయి. వాళ్ళకు తిరిగి నా ముఖం చూపించలేను. ఈ విషయాలు నా ద్వారా వెలుగులోకి వస్తే అవమానంతో వాళ్ళు కూడా సురేఖలా...వద్దు సార్! నా తప్పు నాతోనే పోనివ్వండి. ఈ కేసు మూసివేయండి. వాళ్ళ జీవితాలను కాపాడండి. నా తప్పు బయటపెట్టి సమాజంలో నా తల్లిదండ్రులు తలవంచుకునేటట్టు చేయకండి...."
ఉత్తరం చదివిన వీరేష్ భారంగా నిట్టూర్చాడు.
లాకప్ డెత్ వార్త తెలిసిన ప్రజలు గుంపులు గుంపులుగా పోలీస్ స్టేషన్ బయట పోగవుతున్నారు.
తుఫాను రావడానికి ముందు ఉండే వాతావరణం అక్కడ అలుముకుని ఉంది.
స్టేషన్ చుట్టూ చేరిన ప్రజలు కోపోద్రిక్తులై పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ స్టేషన్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇన్ స్పెక్టర్ వీరేష్ స్వయంగా తుపాకి చేతిలోకి తీసుకుని వాళ్ళను లోనికి రానివ్వకుండా గురిపెట్టాడు. అతని కనులు నిప్పులు కురుస్తున్నాయి.
అతని చేతిలో తుపాకి చూసిన జనం స్టేషన్ లోకి జొరబడడానికి వెనుకాడారు.
అందుబాటులో ఉన్న అన్ని కమ్యూనికేషన్లు అవసరానికి పనికి రాకుండా పోయాయి.
జనం స్టేషన్ ముందు ఉన్న మోటార్ సైకిలుకు నిప్పు పెట్టారు. నినాదాలిస్తూ పోలీస్ స్టేషన్ మీదకు రాళ్ళు రువ్వారు.
ఇన్ స్పెక్టర్ వీరేష్ కుడిచేతి చూపుడు వేలు తుపాకి ట్రిగ్గర్ మీదకు కదిలింది.
వీరేష్ సంశయంలో పడ్డాడు. పోలీసు ఆఫీసరుగా తను తీసుకునే చర్య చట్ట సమ్మతమైనా, తరువాత సురేఖ కేసులో అన్ని విషయాలూ బయటపెట్టాలి. అప్పుడు మిగిలిన విద్యార్థినుల జీవితాలు కూడా పేపర్ల కెక్కుతాయి. వాళ్ళ పేర్లు అందరి నోళ్ళలోనూ నానుతాయి.
ఆ ఆలోచనతో క్షణం అతని కళ్ళముందు కాలేజీ విద్యార్థినుల భావి జీవితాలు కదలాడాయి.
మరుక్షణం అతని చేతి వ్రేలు ట్రిగ్గర్ మీదినుంచి సడలింది.
అదే క్షణంలో ఒక రాయి అతని నుదుటిని తాకింది. రక్తం చివ్వున చిమ్మింది. అతని కళ్ళు మూతలు పడుతుండగా, అదనపు బలగాలతో ఉన్నతాధికారులు దిగారు.
* * * *
శ్రీపతిని చూడగానే ఆనంద్ భ్రుకుటి ముడిపడింది.
"లోపలకు రావచ్చా?"
అతనెందుకు వచ్చాడో ఆనంద్ కు అర్థం కాలేదు.
శ్రీపతి ఏమనుకున్నాడో ఏమో, సరాసరి లోనికి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు!
ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. అనూషను వెతుక్కుంటూ వచ్చి ఉంటాడని గ్రహించాడు.
"మిష్టర్ ఆనంద్! అనూషను తీసుకువెళ్ళడానికి నేను రాలేదు. తన గురించి ఆలోచించి నా కాలాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు నేను. ఈ కవరులో నేను సంతకాలు చేసిన బ్యాంక్ చెక్కులున్నాయి. మీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకోండి. మీరూ, అనూష నా కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిపోయి ఆనందంగా జీవించండి. దయచేసి నా ఎదురుగా కనిపిస్తూ సమాజంలో నేను తల దించుకునేటట్టు చేయవద్దు!" ప్రాధేయ పూర్వకంగా అంటూ, ఆనంద్ చేతిలో కవరు పెట్టాడు శ్రీపతి.
