"బాబోయ్! ఇప్పుడు టైమ్ పదకొండూ నలభై అయింది ఇంతవరకూ మరో బస్సు ఇటుప్రక్కకి రాలేదంటే అర్థం మన బస్సే లాస్టు బస్సు అని అర్థమవుతున్నది. ఇప్పుడు ఏం చెయ్యాలి?" అయోమయంగా అడిగారు వాచీలో టైమ్ చూసిన ఆయన.
ఏం చెయ్యాలి అన్నది తెలియని అయోమయ పరిస్థితిలోనే అందరూ మునిగి వున్నారు.
ఎవరికి వారే మౌనంగా వుండిపోయారు.
మోహనరావు రెండు నిమిషాల కొకసారి అత్తయ్యనీ మామయ్యనీ చూసుకుంటున్నాడు. వారి పరిస్థితిలో కించిత్ మార్పులేదు.
వున్నట్టుండి "టప్, టప్" మని రెండు చినుకులు పడ్డాయి. మరుక్షణంలో సన్నని తుంపర పడటం ప్రారంభం అయింది.
పెద్ద వానయితే అందరూ తడిసిపోతారు. మళ్ళీ అందరినీ బస్సులోకి చేర్చవలసినదే.
అయోమయ స్థితిలో ఆలోచిస్తూ వుండగా దూరం నుంచీ ముందుకు దూసుకువస్తూ రెండు లైట్లు కనిపించాయి.
అది వాహనం అన్న సంగతి వాళ్ళు గుర్తించటానికి ఎంతో సమయం పట్టలేదు.
శవాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తున్న వారు కూడా ఆ లైటు చూసి క్షణకాలం ఆనందించారు.
లైటు వెలుగు అంతవరకూ దగ్గరవటమే కాదు. దాని తాలూకా వాహనం కూడా అక్కడకి వచ్చి ఆగిపోయింది.
అది లారీ అని గుర్తించగానే, అక్కడున్న అందరికీ 'ఆ భగవంతుడే పుష్పక విమానాన్ని ఈ లారీ రూపాన పంపించాడా!" అనిపించింది.
లారీ డ్రైవరూ, క్లీనరూ లారీలోంచి క్రిందకి దిగారు.
లారీ డ్రైవరు మంచి హృదయం కల మనిషి. అక్కడ జరిగిన యాక్సిడెంట్ ని, వాళ్ళ విషమ పరిస్థితినీ చూసి వాళ్ళందరికీ సహకరించాడు.
ఆ తరువాత,
అందరూ కలిసి చాలా తక్కువ సమయంలో చకచకా అందరినీ లారీలోకి చేర్చారు.
మరు క్షణంలో
లారీ పట్నంవైపు పరుగుతీసింది.
19
రెండవరోజు,
లారీ డ్రైవరు పుణ్యమా అని గాయపడిన అందరినీ, ఆ ఉదయానికల్లా ఆస్పత్రిలో చేర్చటం జరిగింది.
శివరావు తలకి పైకి కనపడకుండానే, తలకి బలమైన గాయం తగిలింది. దాంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు.
శివరావుకి తెలివి తెప్పించటానికి డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
మోహనరావు అడిగిన మీదట "మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అతని తలకి బలమైన దెబ్బ తగిలింది. పూర్తి షాక్ లో వున్నాడు. తెలివి రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడే చెప్పలేం. కానీ, తెలివి రావచ్చనే మేము భావిస్తున్నాం." అంటూ డాక్టర్లు వివరించారు.
పార్వతికి ఏ మాత్రం జ్వరం తగ్గలేదు. అయినా ఆస్పత్రిలో చేర్చిన తరువాత ఉదయం ఎనిమిది గంటల వేళ తన పక్క బెడ్ మీద వున్నవాళ్ళని చూసి, వాళ్ళు చెప్పుకునే మాటల బట్టి తాము బయలుదేరిన బస్సుకి యాక్సిడెంట్ అయినట్టు తెలుసుకుంది.
సమయానికి మోహనరావు దగ్గర లేకపోయేసరికి తన భర్త ఏమయ్యాడో, మోహనరావు ఏమయ్యాడో, వాళ్ళు బ్రతికి వున్నారో, మరణించారో తెలియని పరిస్థితిలో విలపిస్తూండగా, అప్పుడు వచ్చాడు మోహనరావు.
"అత్తయ్యా! తెలివి వచ్చిందా!" అని ఆనందంతో మోహనరావు, 'మీ మామయ్య ఏరి? మోహన్!' అని పార్వతి ఏక కాలంలో ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.
పక్క వార్డులోనే శివరావు బెడ్ మీద వున్నాడు. "ఈ సమయంలో మామయ్య గురించి అత్తయ్యకి చెబితే ఆమె భరించలేదని, అటు కొడుకు ఇటు భర్తా ఏకకాలంలో తనకి దక్కుతారో, దక్కరో అనే స్థితిలో వున్నారని ఏమాత్రం తెలుసుకున్నా అత్తయ్య దక్కదని తెలిసి" మోహనరావు ఆ విషయం దాస్తూ,
