అప్పుడే ఒక తమాషా జరిగింది.
నేను మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో వాల్తేరు ప్యాసింజరు కోసం ఎదురు చూస్తున్నాను. రెండు గంటల లేటు! ఛా! ఎప్పుడూ ఈ రైళ్ళు ఇంతే! మనం వెళ్ళేప్పుడూ- మన వాళ్ళెవరైనా వస్తున్నప్పుడే ఆలశ్యంగా వస్తాయి.
మా సుబ్బారావు భార్య ఆ రైల్లో వస్తుంది! వాడికి వారం రోజులుగా జ్వరం. జనరల్ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులో చేర్పించాం.
టైఫాయిడ్ అని మరో పదిహేను రోజులన్నా ఆసుపత్రిలో వుండాల్సి వస్తుందని డాక్టరు చెప్పాడు. ఆసుపత్రి దగ్గిర వుండడానికి ఎవరూ లేరు. కాకినాడలో పుట్టింట్లో వున్న భార్యను రమ్మని ఉత్తరం రాశాడు. ఆదివారం ఉదయం బయలుదేరి ప్యాసింజరులో వస్తున్నానని సమాధానం వచ్చింది ఆమె నుంచి.
మావాడు ఎప్పుడూ పెళ్ళాం గురించి చెపుతూ వుండేవాడు. కాని నేను ఆమెను చూడలేదు. నేను చెయ్యలేని వాటిల్లో (ఆ రోజుల్లో) కొత్త ఆడవాళ్ళతో మాట్లాడటం. నన్ను స్టేషన్ కు వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నాడు. బయలుదేరాను తప్పనిసరై!
నన్ను నేనే పరిచయం చేసుకోవాలి. ఎలా మాట్లాడాలో రిహార్సల్ వేసుకుంటూ ప్లాటుఫారం మీద పచార్లు చెయ్యసాగాను.
బండి వస్తూంది. ఫ్లాటుఫారం మీద కూలీలంతా హడావిడిగా పరిగెత్తుతున్నారు.
పొట్టనిండా పొర్లిపోయే జనంతో బండివచ్చి స్టేషన్ లో ఆగింది.
వరసగా పెట్టెలు చూసుకుంటూ వస్తున్నా. గార్డు పెట్టె పక్కన వున్న లేడీస్ కంపార్టుమెంటు ముందు చిన్న పెట్టే, హోల్డాల్ తో సన్నగా, ఎర్రగా ముఖంమీద పడుతున్న ముంగురులు సర్దుకుంటూ నుంచుని వుంది ఓ ఇరవై ఇరవైరెండేళ్ళ యువతీ. ఎవరినో ఏమో ఆదుర్దాగా ఎదురుచూస్తూ.
"ఏమండీ! సుబ్బారావుగారి భార్య మీరేనా?" ధైర్యంగా ముందుకెళ్లి అడిగాను.
ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూస్తూ "అవునండీ!" అన్నది.
"వారేరండి? స్టేషన్ కు రాలేదా?" ఓ క్షణం ఆగి మళ్ళీ అడిగింది.
"జ్వరం తగుల్తూంటే హాస్పిటల్ లో చేర్పించాం. మీకావిషయం రాశానని చెప్పాడే! మీరు వస్తున్నారు తీసుకురమ్మని నన్ను పంపించాడు." అన్నాను.
"ఎన్నాళ్ళ నుండీ జ్వరం? ఏదో ఉద్యోగం దొరికిందని రమ్మని రాసేరే!" ఆమె ఆదుర్దాగా అడిగింది.
"బహుశా మీరు గాబరా పడ్తారని జ్వరం అని రాసి వుండడు" అన్నాను.
"ఏం జ్వరం అన్నాడు డాక్టరు!" బిక్కమొహం వేసి అడిగింది.
"అబ్బే అదేం పెద్ద జబ్బు కాదు. వారం రోజుల్లో తగ్గిపోతుందని డాక్టరు చెప్పాడు."
ఇంతలో ఇద్దరు కూలీలు పెట్టె ఒకడు, హోల్డాల్ ఒకడు పట్టుకొని నిల్చున్నారు. బలవంతంమీద రెండూ ఒకడికే ఇచ్చి స్టేషన్ బయటపడ్డాం.
ఆసుపత్రికి నాలుగు గంటల నుంచిగాని వెళ్ళడానికి వీల్లేదు. ఇంటికి వెళ్లి భోజనం చేసి సాయంత్రం వెళ్దాం అని చెప్పి ఒక అర్ధరూపాయితో కూలివాడి పేచీ వదిలించుకొని టాక్సీ మాట్లాడి మైలాపూర్ లో వున్నా మా రూంకి వెళ్ళాం. హోటలునుంచి క్యారియరు తెప్పించాను. కొత్త కావడం చేత సిగ్గు సుబ్బారావుకు జబ్బుగా వుందని మరోవైపు బాధ, సాంబారు సాధం, అన్నీ తోడైనై ఆమె తిండికి. నా బలవంతంమీద ఏదో కాస్త తిన్నాననిపించింది.
సాయంత్రం నాలుగింటికి బయలుదేరి కాఫీ తాగి నాలుగున్నరకు ఆసుపత్రికి చేరుకున్నాం.
బ్లెయిల్ వార్డు పక్కనే వున్న స్పెషల్ వార్డులో వాడున్న ఆరో నంబరు బెడ్ దగ్గిరకు వెళ్ళాం.
బెడ్ మీద ఎర్రగా బొద్దుగా వయసులో వున్న యువతీ సుబ్బారావు నొసటిమీద చెయ్యివేసి దగ్గరగా అనుకోని పక్కన కూర్చుంది.
