ముక్కు మీద నిలువునా వేలు వేసుకున్నాడు అహోబిలం. ఆ వేలుని అలాగే వుంచి భయభక్తులతో "ఎంత మాట సార్! ఉద్యోగరీత్యా మీరు నా పైవారు. మారువేషాలు వేయటంలో నాకు గురుతుల్యులు. మీ మాట నాకు వేదవాక్కు. అలాంటి మిమ్మల్ని చూసి నేను నవ్వుతానా సార్!" వినయంగా అడిగాడు.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు దబుక్కున తగ్గిపోయాడు.
"నీ సంగతి నాకు తెలియదుటోయ్. సరే ఎందుకు నవ్వావో చెప్పు! నేను కూడా విని ఆనందిస్తాను."
శ్రీరాముడి వేషం వేయటం వేషం మధ్యలో మర్చిపోయి విజిల్ వేయటం చెప్పాడు అహోబిలం. అది వింటూనే ఇన్ స్పెక్టర్ వర్ధనరావు పడిపడి నవ్వాడు. ఆ తర్వాత నవ్వాపి "మనం ఇప్పుడు అర్జంటుగ డ్యూటీలోకి వెళ్ళాలి" అన్నాడు.
"మనం ఇప్పుడు డ్యూటీలోనే వున్నాం కద సార్!" తెల్లబోతూ అడిగాడు అహోబిలం.
"ఆ మాత్రం నాకు తెలియదా! డ్యూటీలో వున్నాం కాబట్టి కేసులకి సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలని అర్థం. అర్థమైందా?"
"అయింది సార్!"
"గుడ్! ఈ కేసులో మనం మారువేషాలు వెయ్యాలి. అని ఏ వేషాలు అయితే బాగుంటాయో ఆలోచించి చెప్పు."
"అలాగే సార్! ఇప్పుడే ఆలోచిస్తాను..."
"ఆలోచించు బాగా డీప్ గా ఆలోచించు. ఇదివరలో మనం ఏ కేసులోనూ వేయనటువంటి మారువేషాలు వేయాలన్నమాట అర్థమైందా?" కుర్చీలో వెనక్కి జారగిలబడి వుషారుగా కాళ్ళు వూపుతూ చెప్పాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"అలాగే సార్!" అంటూ ఆలోచనలో పడిపోయాడు అహోబిలం.
20
"ఇప్పుడు మన్ని వేటాడేది ఇద్దరు"
నా మాటలు వినంగానే రాంసింగ్ ఉలిక్కిపడ్డాడు.
"ఎక్కడ భాయ్ ఎక్కడ! ఎలా తప్పించుకోవటం?" రాంసింగు కంగారుపడిపోతూ అడిగాడు.
"ఇక్కడ కాదు. ముందు తాపీగా కాఫీ తాగు" అన్నాను.
"జోక్ చేశావన్నమాట...?"
"జోక్ కాదు నిజం."
మా మాటలు హిందీలో సాగుతున్నాయి. మా వేషాలు గడ్డాలు మీసాలు దట్టంగా వుండి తలకి పాగా వుండి చేతికి కడియం ప్యాంటులో ఫుల్ హ్యాండు షర్ట్ టక్ చేసి ముమ్మూర్తులా సిక్కుని పోలివుంది.
రాంసింగ్ వస్తుతహ సింధివాడు. నేను పదహారణాల తెలుగు వాడినైనా నా ఆకారం చాలా వేషాలకు సరిపోతుంది కాబట్టి ఇద్దరం పంజాబీవాళ్ళం లాగా సరీగ సరిపోతాము.
"ఆ... నిజమేమిటో తొందరగా చెప్పు భాయ్!" ఖాళీ అయిన కాఫీ కప్పుని కిందపెట్టి ఆతృతగ అడిగాడు రాంసింగ్.
నేను నిదానంగా చెప్పాసాగాను.
"మన బాస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయటం ద్వారా బాస్ గాడు బతికే వున్నాడన్నది అర్థమవుతున్నది. మన్ని జైలులోనే వుంచి పోలీసుల చేత కుళ్ళబొడిపించడానికి ప్లానువేసి ఆ ప్లానులో భాగంగా "కోటీ యాభయ్ లక్షల" వజ్రాలు మన దగ్గర వున్నట్లు ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి ఫోన్ లో చెప్పటం జరిగింది. బాస్ బతికే వున్నాడనటానికి ఇది ప్రబల సాక్ష్యం. వాడికి మనమీద కసి వుందనటానికి నిదర్శనం పోలీసులకు ఫోన్ చేయటమే. మనం పోలీసు స్టేషన్ నుంచి వెళ్ళిపోయినట్లు వాడెలాగూ గ్రహిస్తాడు కాబట్టి మన్ని చంపటానికి మనకోసం మూల మూలా గాలిస్తుంటాడు.
నెంబర్ వన్ శతృవు బాస్ గాడు మన్ని వేటాడటం.
నెంబర్ టు వేపకాయంత వెర్రి తాటికాయంత తలకాయ గల ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ది గ్రేట్ గారికి మనం మస్కా కొట్టాము. రోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం చేస్తామని చెప్పి రెండు రోజులపాటు స్టేషన్ కెళ్ళి ఆ తర్వాత వెళ్ళటం మానేశాము.
దాంతో ఆయనగారికి మనమీద అనుమానం బయలుదేరి ఉంటుంది. అది సహజం. కాబట్టి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ది గ్రేట్ కూడా మన్ని వెంటాడుతుంటాడు..."
అంటూ వివరంగా రాంసింగ్ కి చెప్పాను.
"నిజమే నీవు చెప్పింది. ఒకరి బారి నుంచి తప్పించుకోవటానికే తల ప్రాణం తోకకు వస్తుంది. ఇంక రెండోవారి బారి నుంచి కూడా తప్పించుకోవాలంటే..."
