Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 43


    జపాన్ నుంచి వచ్చే షిప్స్ లో ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసే 'ఓర్ హేండిలింగ్ ప్లాంటు' స్టాప్ నీ, అక్కడ అధికారుల్ని జయచంద్ర ఎప్పుడో కొనేశాడు.


    అప్పటికి సరిగ్గా పదహారు గంటల్లో అంటే తెల్లవారు జామున రెండు మూడు గంటల మధ్య ఖనిజాన్ని లోడ్ చేసుకున్న షిప్ బెర్త్ ని వదిలిపెట్టి సముద్ర జలాల్లోకి ప్రయాణం చేస్తుంది.


    జయచంద్ర తీసుకోవాల్సిన జాగ్రత్త కస్టమ్స్ టెరిటరీలో ఏ అధికారి కెప్టెన్ని నిలదీయకూడదు. రైడ్ చేసి పట్టుకోకూడదు. అంటే సుమారు ఏభై కిలోమీటర్ల లోపలకి ప్రయాణం చేసేవరకూ జపాన్ కి స్మగుల్ చేస్తున్న రెండు కోట్ల రూపాయిల బంగారానికి తనే రక్షణ ఇవ్వాలి"


    జపాన్ 'యెకోహోమా' పోర్టుకి వంద కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో ఓడ లంగరు వేయగానే ఆ దేశానికి చెందిన పార్టీ టగ్స్ లో వచ్చి 'కన్ సైన్ మెంటు' కలెక్ట్ చేసుకుంటారు. దీనికి షిప్ కెప్టెన్ తో బాటు 'క్రూ' మొత్తానికి లక్షల్లో రాబడి వుంటుంది.


    మరో అయిదు నిముషాలలో వైజాగ్ నుంచి సింహాచలం జయచంద్రతో సరాసరి మాట్లాడేడు.


    ఆపరేషన్ జయప్రదంగా ముగిసింది.


    అతడిని చీకటి సామ్రాజ్యపు భవంతిలో మరో అంతస్తు పెంచుకున్న అరుదైన ఉద్వేగం చకితుడ్ని చేస్తుంటే పైకి లేచిన జయచంద్ర ఎక్కువసేపు అక్కడ నిలబడలేదు.


    ఆ భవంతిలోని ఓ మారుమూల చిన్న గదిలో అడుగుపెట్టాడు.


    అది అతని ప్రవేశానికి మాత్రమే ప్రత్యేకించబడిన గది...


    అక్కడ ముఖ్ మల్ కార్పెట్స్ లేవు. అపురూపమైన అలంకరణ లేదు.


    సమాదైన గతంలా వుంది.


    ఆ సమాధి నుంచే పెంచుకున్న నవ సామ్రాజ్యపు బాపుటా సంకేతంలా వుంది.


    కాలి బూడిదైన బ్రతుకు డైరీలో సుమారు రెండు దశాబ్దాల చరిత్రలో అస్తవ్యస్తమైన ఒకనాటి జీవన సమరపు చరమాధ్యాయాన్ని గుర్తుచేసే ఆ గదిలో ఉన్నది ఒకే ఒక్క ఖాళీ విస్కీ బాటిల్.


    ఇప్పటిది కాదు. పద్దెనిమిదేళ్ళ నాటిది.


    ఏ స్మృతినో కెలికి అప్పుడప్పుడూ అతడ్ని మనిషిగా మార్చేది అదే.


    ఆ గదిలో నిలబడ్డ జయచంద్ర ఓ పెద్ద మాఫియా ప్రపంచంలో అధిపతిలా లేడు. వెలుగులో సామ్రాజ్యపు చక్రవర్తి అయ్యుండి కోరి చీకటి గది నేలపై పవళించిన ఔరంగజేబులా వున్నాడు.


    ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చివరి యాత్రలో కాఫిన్ బాక్ నుంచి బయటికి జారిన వట్టి చేతిని గుర్తు చేయడంలేదు ఆ ఖాళీ బాటిల్.


    గెలుపు, ఓటమి తెలీని ఓ విచిత్ర స్థితికి జయచంద్రని నెడుతూంది. ఇదీ అరుదైన క్షణమే.


    జయచంద్ర కళ్ళిప్పుడు నీళ్ళు వర్షిస్తున్నాయి.


                                                       *    *    *    *


    మరో అరగంటకి సోఫియా ఇంటిలో ఫోన్ రింగయింది.


    అది వైజాగ్ కస్టమ్స్ ఆఫీసు నుంచి.


    ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న సోఫియా చాలారోజుల క్రిందటే కస్టమ్స్ ఆఫీసులో వున్న ఓ నిరుద్యోగిని డబ్బుతో కొని అమ్మాయిని ప్రయోగించి కంట్రోల్ లోకి తీసుకుంది. ఇక్కడ కంట్రోల్ అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చిందీ అంటే ఆ అమ్మాయితో వుండగా ఫోటోలు తీయించింది. వాటి ఆసరాతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. నిజానికి ఆ ఉద్యోగి జయచంద్ర ఇచ్చే మామూళ్ళనీ తీసుకుంటాడు.


    "యురేకా" అరిచింది సోఫియా ఫోన్ క్రెడిల్ చేస్తూ_ "దామోదర్"


    సుమారు ముప్పై ఏళ్ల వయసున్న దామోదర్ ఆమె ముందు నిలబడ్డాడు.


    ఆరడుగుల ఎత్తుతో, ఎత్తుకు తగ్గ దేహ దారఢ్యంతో ఉంటాడు దామోదర్. బటన్స్ లేని తన పెట్టీకోట్ మధ్య వున్న గోల్డ్ చెయిన్ని పంటితో కొరుకుతూ జిన్ బేన్ డ్ డ్రైమార్డినీ తాగుతున్న సోఫియా ఒంటి సొంపుల్ని కాంక్షగా చూస్తూ "యస్ మేడమ్" అన్నాడు.


    "జయచంద్రని చావుదెబ్బ కొట్టే అవకాశమొచ్చింది" ఉత్సాహాన్ని నిభాయించుకుంటూ ఇన్ ఫర్ మేషన్ తెలియపరిచింది.


    ఉత్సాహాన్ని ఒకనాటి ఓటమి అనుభవం గుర్తువచ్చి ఓడిస్తుంటే గ్లాసులో 'మార్డినీ'ని ఆగకుండా తాగేసి ఉద్వేగంతో బుసకొట్టింది.


    సుమారు ఆరు నెలల క్రితం అండర్ గ్రౌండ్ కెళ్లి బ్రతికాడో, లేడో తెలీని స్థితిలో కనిపించకుండా పోయిన ప్రియుడ్ని గుర్తు చేసుకుంది.


    బొంబాయి నగరంలో మామానరంగ్ యూసఫ్ పటేల్ దగ్గర ఓ అనుచరుడిగా జీవితాన్ని ప్రారంభించి అతి స్వల్పకాలంలో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్న రమేష్ 1982లో సోఫియాతో బిజినెస్ పరంగా సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఆమెకు ప్రియుడైపోయాడు. (ఇది జరిగిన కథే అయినా ఇంకా కోర్టులో కేసు నడుస్తుండడం మూలంగా పేర్లు మార్చి రాయాల్సి వచ్చింది... రచయిత)


    1983లో గ్రీస్ నుంచి రమేష్ సహకారంతో ఓ షిప్ ని కొన్న సోఫియా రీటా షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేసి మాల్డాలో రిజిస్టర్ చేసింది.


    మూడు సార్లు ఏథెన్స్ నుంచి ఇండియాకి కార్గోషిప్ గా ప్రయాణం చేసిన అంజలి (మార్చబడిన షిప్ పేరు) సుమారు 442 పేకెట్సు గల కాంట్రా బెండ్' తో బోంబే తీరాన్ని చేరుతుండగా రెవిన్యూ ఇంటలిజన్స్ అఫీషియల్స్ నేవల్ హెలికాప్టర్ ద్వారా ఆగివున్న షిప్ ని అందులో నుంచి తరలించబడుతున్న గూడ్స్ నీ ఫోటోలు తీస్తూ కోస్ట్ గార్డుకి మా వివరాల్ని తెలియజేశారు. కస్టమ్స్ అధికారులు వెపన్స్ తో చుట్టుముట్టారు. అంతే... సుమారు మూడు కోట్ల ఖరీదు చేసే కాంట్రా బెండ్ ని సముద్రంలోకి తోసి రమేష్ ఆదేశంపై అంజలికి నిప్పంటించి క్రూ మొత్తం సముద్రంలోకి దూకేశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS