Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 42


    ఇరుకుగా వుండటమేకాక రద్దీగా వున్న ఆ సందుల్లోని వేట మరో పది నిముషాలదాకా సాగేక శశాంక వెంటవున్న డ్రైవర్ ఓ మలుపు తిరుగుతూ సమీపంలో వున్న ఇంటిలోకి అతడ్ని లాగేసి గభాలున తలుపు గడియపెట్టాడు.


    అనాలోచితంగా స్టోర్ రూంలా వున్న ఆ హాల్లోకి అడుగుపెట్టి ఓ అయిదు నిమిషాలపాటు రొప్పుతూ కుర్చీలో కూర్చున్న శశాంక నెమ్మదిగా తలపైకెత్తాడు. తనకామాత్రం సహకరించిన డ్రైవర్ కి కృతజ్ఞతల్ని తెలియపరచాలని.


    అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.


    తలపై వున్న కేప్ తీసి ఎదురుగా నిలబడ్డ డ్రైవర్ మరెవరో కాదు. ధనుష్కోటిని హత్య చేసిన రాత్రి శశాంక దెబ్బకొట్టి ఓ మూలకి యీడ్చేసిన ధనుష్కోటి కారు డ్రైవర్... జాకీ...


    సమీపంలోని గదుల్లో ఏదో సంచలనం మొదలైంది. వెనువెంటనే "జాకీ... తలుపు తియ్" అన్న పిలుపు వినిపించింది.


    శశాంకకి అర్థమైపోయింది. తను మరో ప్రమాదకరమైన వలయంలో అడుగుపెట్టినట్టు.


                               *    *    *    *


    బంజారాహిల్సులో చాలా అధునాతనమైన భవంతి సోమాన్ సిల్కింగ్ టన్స్ సిరమిక్ వాల్ టైల్స్ చిహ్నకాంతుల మధ్య కార్వెట్ గ్రెనైట్ పిల్లర్స్ ని ఆనుకుని వున్న ఓ సోఫాలో కూర్చుని సర్కార్ చెబుతున్న విషయాల్ని నిశ్చలంగా వింటున్నాడు జయచంద్ర.


    "కుమార్ దాదాని మన లీగల్ ఎడ్వయిజర్స్ వెంటనే బెయిల్ మీద తీసుకొచ్చారు. దాదా భయపడుతున్నది అవినాశ్ విషయంలో. ఇంటరాగేషన్ కోసం ఇంకా అతను స్టేషనుకు రాకముందే బయటకి రప్పించడంతో అవినాశ్ మళ్ళీ వెంటపడతాడేమో అని అనుమానిస్తున్నాడు."


    ఎక్స్ లెన్సీస్ ఎక్స్ లెంట్ టేస్టున్న వ్యక్తులు మాత్రమే అడుగుపెట్టే ఆనందించగల తన భవంతి గ్రాంట్యార్ ని చూస్తూ వుండిపోయాడు తప్ప జవాబు చెప్పలేదు జయచంద్ర.


    దేశం నలుమూలలా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి ఇతర రాష్ట్రాల మాఫియా గేంగ్స్ తో సైతం సిండికేట్ ఏర్పాటు చేసుకుని తన వ్యవహారాల్ని దక్షతగా నడిపించుకుపోయే జయచంద్ర ఒక పోలీసాఫీసరు కోసం ఆ మాత్రం టైం కూడా స్పేర్ చేసేవాడు కాదు. కాని అవినాశ్ తన సిండికేట్ లో చాలామందికి తలనొప్పిగా మారిన మనిషి.


    నిముషాల వ్యవధిలో లక్షలు లాభం పొందడమూ నష్టపోవడమూ అలవాటై రాటుతేలిన గుండైనా తను చేసే వృత్తిని బట్టి అవినాశ్ వంటి వ్యక్తుల విషయంలో ఆమాత్రం శ్రద్ధ చూపడం తప్పనిసరి. క్వాంటిటీ ఆఫ్ అటెన్షన్ తో ఎలాంటి క్వాలిటీగల వ్యక్తినైనా పడగొట్టవచ్చనే మోడరన్ ఫిలాసఫీ అతనిది.


    వ్యక్తిని గాని సమస్యని కాని డీల్ చేసే ముందు జయచంద్ర ఆలోచించేది 'SWOT' ఎనాలిసిస్ గురించి మాత్రమే.


    అదే అతడి మేనేజ్ మెంటు సైన్స్. కాని అధర్మాన్ని నాలుగు పాదాలా నడిపించే నాలుగు అక్షరాల అస్త్రంకాని.


    Strength, Weaknesses, Opportunities, Threats అనే పదాల మొదటి అక్షరాలు 'SWOT' గా జయచంద్రలో ఎంత బలమైన ముద్రవేసుకున్నాయి అంటే అతని ఎదుగుదలకి అదే తారకమంత్రంగా భావిస్తుంటాడు.


    అవినాశ్ విషయంలో ఓ అవగాహనకి రావడానికి అతడికి పట్టింది కేవలం అయిదు నిముషాలు మాత్రమే... గొడ్డలిగా మారిన మరుక్షణం అతడ్నెలా దేబ్బతీయాలో అప్పుడే నిర్ణయించుకున్నాడు.


    సరిగ్గా అప్పుడే సర్కార్ అన్నాడు మళ్ళీ_ "మీరు సరేనంటే శశాంకని లేపేస్తామంటున్నారు!"


    విసుగ్గా చూశాడు జయచంద్ర.


    అంత చిన్న విషయం తనతో చెబుతున్నందుకు కోపగించుకుంటున్నాడేమో అని సర్కార్ పొరపాటు పడ్డాడు కాని అదికాదు జయచంద్ర విసుక్కోడానికి కారణం. ఇప్పుడిప్పుడే కసితో రంగంలో అడుగుపెడుతున్న శశాంక పసికందులాంటివాడు. దెబ్బ కొడితే మరింత పెంకితనం ఎక్కువయ్యే అవకాశముంది...


    ధనుష్కోటిని అంతం చేసింది 'దావూద్' అన్న ఆలోచనలో మిగిలిపోయిన జయచంద్ర శశాంక విషయంలో పొరపాటు పడింది సరిగ్గా ఇక్కడే...


    "కుమార్ ని పట్టుకొని ఏమంటాడు" శశాంక గురించి అడిగాడు.


    "నా భార్యని ఎందుకు చంపావూ అంటూ నిలదీసాడట"


    అక్కడెవరూ గమనించలేదు జవాబు విన్న వెంటనే జయచంద్ర నుదిటిపై పట్టిన చెమట బిందువుల్ని... సుమారు నలభై అయిదు సంవత్సరాల వయసు గల జయచంద్రలో మేరువులా చెక్కుచెదరని నిబ్బరాన్నే తప్ప ఏనాడు అలజడిని చూసి ఎరగని అనుచరులు వాళ్లు...


    తన మొహంలోని భావాల్ని ఎవరూ గుర్తించకూడదనుకున్నాడేమో వెంటనే లేచి పర్సనల్ ఛాంబర్ ని చేరుకున్నాడు.


    తేరుకోడానికి అతడికి పట్టింది మరో రెండు నిముషాలు మాత్రమే. "విజార్ కన్ సైన్ మెంటు గురించి ఎంక్వయిరీ చేయి" అన్నాడు సర్కార్ ని చూస్తూ.


    యస్.టి.డి.లో విజార్ మాట్లాడిన సర్కార్ వెంటనే చెప్పాడు. "షిప్ కెప్టెన్ కి అందచేశారట సాబ్... ఓ అరగంటయిందట. సింహాచలం మన కోసమే ట్రై చేస్తున్నాడట"


    అక్రమంగా విదేశాలకు రవాణా చేయాల్సిన మెటీరియల్ ని పంపే ప్రాంతాల్ని ఎన్నుకునే జయచంద్ర 'గోల్డ్ స్మగుల్' చేయడానికి వైజాగ్ పోర్టునే ఉపయోగించుకుంటాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS