భారతి తలూపింది.
"జీవితం విలువ నీకు తెలీదింకాదు. ఒకరోజులో సరిపెట్టుకునేది కాదు జీవితం. నూరేళ్ళ బ్రతుకు జీవితం మన చుట్టూ ఉన్న ప్రపంచం ఓ మహారణ్యం భారతీ. ఈ మహారణ్యం సాధు జంతువుల కంటే క్రూరమృగాలే ఎక్కువగా ఉంటాయి ఈ మృగాలకి ఆడపిల్లలని వేటాడ్డం సరదా! ఈ సరదా వెనక ఎందరో కన్నెపిల్లల జీవితాలు బలి అయిపోయాయి. అవుతున్నాయి. అందుకే నువ్వు ఆడపిల్లనన్న సంగతి ఏ క్షణంలోనూ మరచిపోవద్దు" అన్నాడు సారధి.
అతను చెబుతున్నది జీవిత సత్యం. రెండు చేతులూ జోడించి అతనికి నమస్కరించాలనిపించిందామెకి.
సారధి భారతిని మెల్లగా కూర్చోబెట్టి గదిలోంచి బయటికి నడిచాడు.
భారతి అతను వెళ్ళిపోతున్న వేపు వెర్రిగా చూసింది. ఆమె కళ్ళలో సన్నని కన్నీటి తెరలు కదులుతున్నాయి.
24
ఆరోజు సారధి వెళ్ళిపోయాడు.
అంతవరకూ లేదు కానీ, ఆరోజు మాత్రం అతను వెళ్ళిపోతున్నాడంటే భారతికి కొంచెం బాధ లాంటిది కలిగింది.
వెళ్ళేముందు తనతో చెప్పడానికి తన గదిలోకొచ్చాడు సారధి.
అప్పుడు భారతి అడిగింది.
"బావా నాకో చిన్న అనుమానం కలిగింది. అడిగితే నువ్వెలాంటి సమాధానం చెపుతావో వినాలనుంది. అడగనా?"
"అజుగు" అన్నాడు సారధి.
"నిన్న రాత్రి నన్ను నువ్వు ఇంటికి తీసుకొచ్చినప్పుడు మమ్మీ చూస్తే ఏం చెప్పేవాడివి?"
సారధి చిరునవ్వుతో చూశాడు.
"నేనే తీసుకెళ్ళానని చెప్పేవాడిని!"
భారతి ఆశ్చర్యంగా చూసింది నమ్మలేనట్టుగా.
"నువ్వు తీసుకెళ్ళానని అబద్ధం చెప్పేవాడివా?" అంది.
"అవును నీకోసం చిన్న అబద్ధం ఆడితే తప్పంటావా?"
"మమ్మీకలా చెప్పి ఆమెని ఫేస్ చెయ్యగలిగేవాడివా బావా?"
"నాకు ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో తీసుకెళ్ళానని చెప్పేవాడిని. ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేవాడిని" అన్నాడు సారధి.
భారతి హృదయం అతనిపట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.
భారతి ఇకముందు మనోహర్ కూడా తన వెంట పడకుండా తగిన జాగ్రత్తలో వుండాలని నిశ్చయించుకుంది.
అలా అనుకొన్నదే కానీ కొన్ని క్షణాలు అతని గురించి ఆలోచించకుండా మాత్రం ఆమె ఊరుకోలేకపోయింది.
అసలతను ఏ ఉద్దేశంతో తనని వెంబడిస్తున్నాడు.
తన కారు, డబ్బు, చూసి లొంగిపోయే రకం అనుకొంటున్నాడా? లేక తనతో ఆటలాడి సరదా తీర్చుకోవాలని ఆశిస్తున్నాడా? అదీ కాకపోతే తనని ప్రేమిస్తున్నాడా?
భారతి చెక్కిళ్ళు ఎర్రబడినాయి. "ఛీ, ఏమిటీ ఆలోచన" తిరస్కారంగా సంభాళించుకోబోయింది.
అతనికేళి విలాసాల గురించి యూనివర్శిటీలో తెలియంది ఎవరికి?
తన సంగతి తెలిసి ఉండాలి. తేలిగ్గా లొంగేమనిషికాదని అందుకనే వెంటాడుతున్నాడు.
అతన్ని నమ్మించాలి కాని పాడు చేసుకోడానికి తనేమీ ఫూల్ కాదు.
అతనికి సరిగ్గా బుద్ధి చెప్పాలి.
మళ్ళీ ఎప్పుడో పెద్ద హీరోలా వచ్చి తనని పలకరిస్తాడని ఆమెకి తెలుసు.
ఇక అతని గురించి ఆలోచించదలుచుకోలేదు.
బద్ధకంగా లేచి వెళ్ళి పడుకుంది భారతి.
25
మంచంపైన బోర్ల పడుకొని చదువుకొంటున్న అవంతి గది తలుపు చప్పుడైతే తలతిప్పి చూసింది.
తలుపు తోసుకొని లోపలికి వస్తున్న భారతిని చూసి అవంతి లేచికూర్చుని -
"స్వాగతం" అంది చిరునవ్వుతో.
"థాంక్యూ" అంటూ వచ్చి ఆమె కెదురుగా కూర్చుంది.
"దారితప్పి వచ్చిన నిన్ను చూస్తుంటే ఇది కలో నిజమో అర్థం కావడంలేదు" అంది అవంతి నవ్వుతూ.
"కళ్ళముందు జరిగే సత్యాలని కలగా అనుకోవడం నాకు చేతకాదు" అంది భారతి. "ఓ.కె. డన్ నీ మాటల్ని బట్టి చూస్తూంటే నువ్వేదో నామీద పోట్లాడ్డానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏమిటి కథ?" అంది అవంతి సాధారణ ధోరణిలో.
"కథ కాదు నవలకి పనికొచ్చే సబ్జక్టే నీతో నేను మాట్లాడాలి" అంది భారతి.
"ఇప్పుడు మనం మాట్లాడుకొంటున్నామనే అనుకొంటున్నాను. యామై నాట్ కరెక్ట్" అంటూ నవ్వింది అవంతి.
"నువ్వలా మాట్లాడి నాకు చిరాకు తెప్పించకు. నిజంగానే నేను నీతో చాలా సీరియస్ గా మాట్లాడాలనొచ్చాను."
అవంతి భారతికేసి ఓ క్షణం చూసింది.
భారతిని చూస్తుంటే ఏదో తెలీని ఉత్సాహం కలుగుతోంది. ఎందుకో తెలీదు కానీ...... కానీ..... భారతిని చూడగానే మనసదోలా అవుతుంది.
భారతి మంచి అమ్మాయనా?
