మరో అరగంటకు తన తల్లీ, మేనమామ ఓ భూతవైద్యుడితో దిగారు. ఒంటినిండా కాషాయపు వస్త్రాలతో, ముఖాన రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టుతో మహా భయంకరంగా వున్నాడు భూతవైద్యుడు. వారు వచ్చిన విషయం క్షణంలో తెలిసిపోయింది వూళ్ళోనివారికి.
"సీతారామయ్య మేనమామ వచ్చాడు. సీతారామయ్య చేత నువ్వు పెట్టిన మందు కక్కించి వెంట తీసుకువెళతారంట. ఓ మంత్రగాడ్ని తీసుకొచ్చారు" ఒకామె వచ్చి సత్యవతికి చెప్పింది.
సీతారామయ్య తల్లి, మేనమామ వచ్చిన విషయం తెలియదామెకి. ఇప్పుడీ ఉపద్రవం వచ్చిపడటంతో తను నలుగురి నోళ్ళల్లో నానాలన్న భీతి పట్టుకుంది.
కానీ ఆమె తన ధైర్యాన్ని మాత్రం వదల్లేదు. ఆ రోజు రాత్రి సీతారామయ్యతో అన్నిటినీ చర్చించింది.
"ఏమిటిదంతా? మీ అమ్మ వచ్చిన విషయం చెప్పనేలేదు. ఇప్పుడు మీ మేనమామ ఎవరో మంత్రగాడ్ని తీసుకొచ్చాడట. ఊరంతా మన గురించి ఏమనుకుంటారు? ఇప్పుడెవరికీ ఏమీ తెలియదని అనడం లేదు. మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకోలేం గదా" అన్నది.
"నిజమే. ఏం చేయను? మా మేనమామకు ఓ కూతురుంది. దాన్ని పెళ్ళి చేసుకొమ్మని గొడవ" అన్నాడు సీతారామయ్య తాపీగా.
"చేసుకోవచ్చుగదా? వాళ్ళనెందుకు బాధ పెట్టడం?"
"మరి నాకు మనువై పోయిందిగా?"
ఆ మాటలు సరదాగా నవ్వులాటకి అంటున్నాడేమోనని అతని ముఖంలోకి చూసింది. కానీ అతను సీరియస్ గా వున్నాడు.
"నీకు పెళ్ళికావడమేమిటి? విచిత్రంగా వుంది. నీ పెళ్ళాం పేరు ఏమిటి?" చిన్నగా నవ్వుతోంది.
"తమాషా కాదు. నా పెళ్ళి జరిగిపోయింది. ఏ క్షణంలో అయితే నీ చేయి పట్టుకున్నానో ఆ క్షణంలోనే నా పెళ్ళయిపోయింది. నా పెళ్ళాం పేరు ఇంకా చెప్పాలా?"
"అలాంటి వెర్రి మొర్రి ఆలోచనలు పెట్టుకోవద్దు. నేను అన్నీ అయిపోయినదాన్ని. తలచెడినదాన్ని" అంది.
"అవన్నీ నాకు తెలియనివి కావుగదా. భర్త చనిపోయినంత మాత్రాన మారు మనువు చేసుకోకూడదని రూలేం లేదుగదా. వితంతువుల్ని పెళ్ళి చేసుకొమ్మని పెద్దవాళ్ళు కూడా కొందరు చెప్పారని నువ్వు వినలేదా? ఏదేమయినా నా నిర్ణయం మారదు" అన్నాడు సీతారామయ్య.
అంత ఆప్యాయతను భరించలేక ఆమె అతన్ని గుండెలకు హత్తుకుంది. అది పగలన్న విషయం కూడా ఇద్దరూ మరిచిపోయారు. తలుపైనా వేయలేదు. ఇద్దరూ ఒకరి కౌగిట్లో మరొకరు ఒదిగిపోయారు.
"ఏమే సత్యవతి!" అంటూ ఆమె తల్లి వచ్చేవరకూ వాళ్ళలాగే వుండిపోయారు.
"ఏమిటే?" అంది ఆమె సిగ్గుపడి.
"సీతారామయ్య కోసం అతని మేనమామ వచ్చాడు. వీధిలో నిలబడి పిలుస్తున్నాడు" చెప్పింది.
అది విని సీతారామయ్య "ముసుగులో గుద్దులాటలెందుకు? మనం పెళ్ళి చేసుకుంటున్నట్లు ఖచ్చితంగా చెప్పేస్తాను" అని బయటికి వచ్చాడు.
"రారా! నీతో మాట్లాడాలి" అన్నాడు మేనమామ అతన్ని చూస్తూనే.
ఇద్దరూ బయలుదేరారు. భూతవైద్యుడు, సీతారామయ్య మేనమామ ఓ ఇంట్లో బస చేశారు. ఆ ఇల్లు చిల్లర కొట్టు చెంచురామయ్యది. ఈమధ్యనే చెంచురామయ్య కొత్త డాబా కట్టి అందులో చేరాడు. అంతకు ముందున్న గుడిసెలో రెండు రోజులుంటామని వాళ్ళు దిగారు. ఇప్పుడు నేరుగా సీతారామయ్యను అక్కడికే తీసుకొచ్చాడతని మేనమామ.
సీతారామయ్య ఇంట్లోకి కాలు పెట్టబోయి లోపలున్న దృశ్యాన్ని చూసి అలానే నిలబడిపోయాడు.
అతన్ని చూస్తూనే భూతవైద్యుడు ఎదురొచ్చి "రా బిడ్డా! నీకోసం చూస్తున్నారు దేవతలంతా" అని పిడికిట్లో వున్న నిమ్మకాయను గట్టిగా నలిపాడు. విచిత్రంగా అందులోంచి రక్తం కారుతోంది.
"చూశావా బిడ్డ! నీ మీద మందు ప్రయోగించారు. అందుకే నిమ్మకాయ లోంచి రక్తం వస్తుంది" అని అతన్ని బిరబిరా లాక్కెళ్ళాడు. గుడిసె మధ్యలో పెద్ద ముగ్గుంది. పసుపూ, కుంకుమ, వేపమండలు, జిల్లేడు ఆకులు కొబ్బరికాయలు రకరకాల వస్తువులతో ఆ ఇల్లే పెద్ద ముగ్గులా వుంది. సీతారామయ్యని ముగ్గు మధ్యలో బలవంతంగా కూర్చోబెట్టాడు. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న అతన్ని మేనమామ అడ్డుకున్నాడు.
భూతవైద్యుడు ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ అతని నుదుటున పెద్ద విభూది బొట్టు పెట్టాడు.
అంతలో చెంచురామయ్య కూడా వచ్చాడు. ముగ్గురూ కలిసి బలప్రయోగం చేసి అతికష్టం మీద అతని చేత మందు తాగించారు. ఆ మందు కడుపులో పడగానే సీతారామయ్యకి మైకం కమ్మేసింది. ఆ మైకంలోనే నాలుగుసార్లు వాంతులు చేసుకున్నాడు.
"ఈ వాంతుల్లోనే అది పెట్టిన మందు వచ్చేస్తుంది" అని భూతవైద్యుడు విజయగర్వంతో చెప్పాడు.
"మూడురోజుల వరకూ మన మనిషి కాలేదు. అంతవరకూ ఇతన్ని మనం దాచేయాలి" అన్నాడు మళ్ళీ.
"ఇక్కడే పెట్టి బయట గొళ్ళెం పెట్టేద్దాం. ఎవరికీ నా ఇంటికొచ్చి సోదా చేసే దమ్ముల్లేవు" అని చెప్పాడు చెంచురామయ్య.
ఆ తర్వాత ముగ్గురూ బయటపడ్డారు. ఊరి పొలిమేరల్లో అమ్మే దొంగసారా కడుపునిండా తాగారు.
"మొత్తానికి మీ అంతటి భూతవైద్యుల్ని ఎక్కడా చూడలేదు. చిటికెలో సీతారామయ్యచేత మందు కక్కించారు" అన్నాడు చెంచురామయ్య రెండు చేతులెత్తి నమస్కరిస్తూ.
"ఇప్పుడేం చూశావు చెంచురామయ్య! రేపు మీ ఊర్లో మోడీ పెట్టించు. అప్పుడు చూద్దువుగానీ నా తడాఖా, మాయలు, మంత్రాలు తెలిసిన నాలాంటివాడు నీకు మంచి స్నేహితుడని తెలిస్తే యిక నీ జోలికెవరూ రారు" అన్నాడు భూతవైద్యుడు చెంచురామయ్యను ఆశీర్వదిస్తున్నట్లు ఓ చేయి పైకెత్తి.
"రేపే అరేంజ్ చేస్తాను స్వామీ! టికెట్లు కూడా పెడతాను. వచ్చిన సొమ్ముతో ఖర్చులు పోను ఇరవై పర్సెంట్ యివ్వండి"
"అలానే"
ముగ్గురూ ఇంటికొచ్చి నిద్రపోయారు.
అయితే సత్యవతికి మాత్రం నిద్ర రావడం లేదు. పోయిన సీతారామయ్య తిరిగి రాకపోయేసరికి ఆమె కంగారుపడుతోంది. క్షణక్షణానికీ ఆందోళన ఎక్కువవుతోంది. తాను మందు పెట్టానని చెప్పి, దాన్ని కక్కించడానికి వచ్చిన భూతవైద్యుడ్ని తలుచుకుంటే కోపం నషాళానికి అంటుతోంది.
సీతారామయ్యను పిలుచుకురావడానికి చెంచురామయ్య ఇంటికి వెళ్ళాలనిపించింది. కానీ చెంచురామయ్య సామాన్యుడు కాడు. నాగుపాముతో సమానం. అంత క్రూరుడు. తనను వీధిలో నిలబెట్టి నలుగురినీ పోగేసి, తన ఇంటికి ఎందుకొచ్చావని నిలదీసే రకం. అందుకే సీతారామయ్యను వెదకలేకపోతోంది. అలా అని ధైర్యంగా వుండలేకపోతోంది.
