అయితే ముఖ్యమంత్రి అప్పుడు చేసిన తెలివయిన పని ఏమిటి అంటే... వెంటనే పరిస్థితి మొత్తాన్ని వివరిస్తూ ఒక ప్రత్యేక దూతను ఢిల్లీకి పంపించాడు.
ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.
పరిస్థితి చక్కదిద్దుకోవడానికి కొంత వ్యవధిని ఇస్తూ_ అప్పటివరకూ కలుగజేసుకోమనే హామీతో ఆ దూత తిరిగి వచ్చాడు.
ముఖ్యమంత్రి అప్పుడు దైర్యం కలిగింది.
అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించి.... శాసనసభ్యులు అందరూ తప్పక హాజరు కావాలని విప్ జారీ చేయించాడు.
ఫలితం.... అసమ్మితి వాదులు కూడా వచ్చారు.
"మైడియర్ ప్రెండ్స్... రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విఘాతం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
మీలో కొందరికి నేను ముఖ్యమంత్రి సీట్లోనుంచి దిగిపోవడం కావాలి కాబట్టి ఆ అభీష్టానికి అనుగుణంగా నేను పదవిలోనుంచి తప్పుకుంటాను.
సి.ఎల్ .పి. సమావేశంలో నేను మెజారిటీ కోల్పోయిన మరుక్షణంలోనే నేను వైదొలగుతాను"
ఎమ్.ఎల్. ఏ లందరిలోనూ విస్మయం...
జయచంద్ర సైతం అలాంటి ప్రపోజల్ ను అసలు వూహించనే లేకపోయాడు.
తను ప్రతాపానికి బెదిరి అలాంటి ప్రపోజల్ ను ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నాడని అనుకుంటున్నారే తప్ప అది ఒక రాజకీయ ఎత్తుగడగా ఎవరూ వూహించే అవకాశం లేకపోయింది.
"ఎవరికివారే తమ నియోజక వర్గాలపై దృష్టి కేంద్రకరించండి. అల్లర్లను అణచివేసి శాంతిభద్రతల పునరుద్దరణకు కృషిచేయండి... ఆ తర్వాత కొత్త సి.ఎమ్.ఎవరన్నది మన సి.ఎల్.పి. సమవేశంలో ఎన్నుకుందాం.
ముఖ్యమత్రి పదవిలో ఎవరున్నా ముందుగా ఆశించేది ప్రజలు సుఖంగా వుండాలనేదే కాబట్టి... నగరంలో అల్లర్లు లేకుండా చూడవలసిన భాధ్యత మీదే..."
ఎమ్.ఎల్.ఏలు అందరూ అయన మాటలతో ఏకీభవించారు.
ఫలితంగా రెండవరోజుకల్లా శాంతిభద్రతలు చేకూరాయి.
తన మొదటి ఎత్తు ఫలించడంతో ముఖ్యమంత్రి రెండవ ఎత్తు వేయటానికి సన్నద్దుడయ్యాడు.
* * * *
వసుమతి మనస్సు మూగగా రోదిస్తుంది.
కొన్ని సంవత్సరాల క్రితం తను వేసిన తప్పటడుగు ఫలితమే ఇప్పుడు తీరని మానసిన క్షోభను అనుభవిస్తుంది.
దాచినా దాచలేని నిజం ఇంతకాలానికి ఊపిరి పోసుకుని తనమీద సమర శంఖారావం పూరించి వుంది.
ఫలితంగా తన కొడుకు తొలిసారిగా తనను అనుమానించాడు.
ఎవరికీ తెలియని ఈ నిజాన్ని తన బిడ్డ మనసులో నాటుకునేలా చేసిన వ్యక్తి ఎవరో?
ఏ ప్రతిఫలాన్ని ఆశించి గతించిన గతాన్ని బయట పెట్టారో?
ఎంత ఆలోచించినా తన ప్రశ్నకు సమాధానం దొరకలేదు.
ఇప్పుడు మరొక విషయం మనసును కల్లోలపరుస్తుంది.
రవితేజ, అభినయ్ ఇద్దరూ శత్రువులయ్యారు.
ఒకే రక్తం పంచుకుపుట్టిన ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులుదూస్తున్నారు...
ఈ సమస్యను పరిష్కరించడం ఎలా?
కొన్ని క్షణాలు ఆలోచనల అలజడి... మరికొన్ని క్షణాల తపన, ఆరాటం, ఆతురత.
చివరకు ఆమె మనసులో ఒక ఆలోచన మొదలైంది.
జైల్లో వున్న రవితేజను కలుసుకోవడానికి నిర్ణయించుకుంది ఆమె.
రవితేజ, అభినయ్ ఇరువురూ తనకు రెండు కళ్ళు. వాళ్ళలో ఎవరికీ నష్టం కలిగినా తను భరించలేదు.
అభినయ్ ఆవేశపరుడు... రవితేజకు నచ్చచెబితే వినవచ్చునని ఆమె ఆశ.
తన గత జీవితాన్ని రవితేజకు చెప్పాలి. కానీ ఒక తల్లిగా కన్న కొడుకుకు తను పతితనని చెప్పుకోవాలి. ఎలా? ఎలా చెప్పుకోవాలి?
విషయం తెలిస్తే రవితేజ తనను అసహ్యించుకోడు....
క్షమ, దయ,ఆలోచించే గుణం, మాననత్వం మూర్తీభవించిన ఆనందరావు పెంపకంలో పెరిగిన రవితేజ తప్పక తనను అర్ధం చేసుకుంటాడనే నమ్మకం ఆమెను ఆ నిర్ణయానికే బద్దురాల్ని చేసింది.
వెంటనే ఆనందరావుకు ఫోన్ చేసి తన మనసులోని మాట వివరించింది వసుమతి.
తెల్లవారిన వెంటనే వెళ్ళి రవితేజను కలవాలని ఉవ్విళ్ళూరుతుంది ఆ మాతృమూర్తి హృదయం!
కానీ తెల్లవారకముందే.... ఆమె రవితేజను కలవకముందే.... జరిగిపోయిందొక సంఘటన!
ఆ రాత్రి జైలునుంచి రవితేజ తప్పించుకున్నాడు అన్నా వార్త పిడుగుపాటులా ఆమె చెవికి చేరింది.
తనకు వున్న ఒక్క ఆశా వమ్ముకావడంతో దుఃఖం ముంచుకు వచ్చిందామెకు.
ప్రతీకారం కోసం ఏ క్షణాన్నయినా రవితేజ ఇక్కడికొస్తాడు_ ఏ అనర్ధం జరకముందే అతన్ని అడ్డుకోవాలి.
మానసిక సంఘర్షణతో సతమతమైపోతున్న వసుమతి ఆ రాత్రి అంతా నిద్రలేకుండానే అభినయ్ గది బయట కుర్చీవేసుకుని ఒక విధముగా గస్తీ పోలీసులా కూర్చుందామె.
భళ్ళున తెల్లవారింది....
గదిలో అభినయ్ లేడు...
తన కళ్ళలో వత్తులు వేసుకుని కావలి కాసిందే మరి... అభినయ్ ఎలా మాయమైనట్టు... ఖంగారుగా పోర్టికోలోకి వచ్చి కారు స్టార్టు చేసింది వసుమతి.
* * * *
నమ్ముకున్న సిద్దాంతాలను కాపాడుకోవడానికి మా క్రామ్రేడ్స్ ప్రాణాలను కూడా లెక్కచేయరు. ఈ ప్రభుత్వం మమ్మల్ని జైలులో నిర్భందించినా మా సిద్దాంతాలను గోడ కట్టలేదు"
రవితేజ మామూలుగా అడిగినందుకు రణధీర్ ఆవేశంగా జవాబు ఇచ్చాడు.
"మీరు బందిపోట్లు అనీ... దోపిడీదారులు అనీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎన్ కౌంటర్స్ పేరిట ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు కదా... తక్కువ సంఖ్యలో వున్న మీరు వాళ్ళను ఏ విధంగా ఎదుర్కోగలరు?"
"ఇప్పటికే మేధావులు మా సిద్దాంతాలను అర్ధం చేసుకున్నారు. పేదప్రజలు మాతో చేతులు కలుపుకున్నారు. మా గురించి ప్రభుత్వం ఏ ప్రచారం చేసినా మేము పట్టించుకోము. నిజానిజాలు ప్రజలకు తెలుసు.
సిద్దాంతాలను నమ్ముకుని అజ్ఞాతంగా తిరుగుతున్న మా కామ్రేడ్స్ పట్టెడు అన్నం దొరకక పస్తులు వున్న రోజులు వున్నాయి. మేము తిండి తినకపోతే చావనయినా ఛస్తాం కానీ దోపిడీలు చేయము.
పేదవారి కడుపులను కొట్టడం మాకు చేతకాదు. భూస్వాములపై పోరాటం మా లక్ష్యం. మేమంటేనే హడలిపోయే పెత్తందార్లు, భూస్వాములు మమ్ములను దోపిడీదొంగలుగా చిత్రించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. సమయంచూసి సరి అయినా సమయంలో మేమంటే ఏమిటో నిరూపించుకుంటాం..."
"మీ కామ్రేడ్స్ కు నువ్వు నాయుకుడివా?"
రవితేజ ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వు నవ్వాడు రణధీర్.
"నిత్యమూ ప్రాణాలను అరచేత పట్టుకుని అడవులలో పరుగులు దీసే మీరు ఆశించినట్టు ప్రజారాజ్యం వస్తుందా? సమసమాజ నిర్మాణం సాధ్యపడుతుందా?"
"బ్రీటిష్ వాళ్ళను ఎదురించడానికి ఆనాడు ఒక్కొక్క భారతీయుడు అల్లూరి సీతరామరాజు, భగత్ సింగ్ లు అయ్యారు. విప్లవ శంఖం పూరించి విదేశీయులను తరిమికొట్టడంలో కృతకృత్యులు అయ్యారు. ఎందరో అసువులు బాసారు.
స్వాతంత్ర్యం కోసం ప్రజలు నిత్యమూ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడారు.
స్వాతంత్ర్యం సిద్దించినా మనదేశంలో బానిసత్వం పోలేదు. బ్రిటిష్ వారి అడుగుజాడలలోనే మన పాలకులు నడుస్తూ... పేద ప్రజలను హీనంగా చూస్తూ తమ స్వార్ధాన్ని పెంచుకుంటున్నారు.
అందుకే ఎక్కడ చూసినా పీడితప్రజల మనోభావాలనుండి మరలా విప్లవోద్యమం మొలకెత్తింది.
ఎక్కడ నిరంకుశత్వం తలఎత్తినా ఎక్కడ విప్లవం అనే ఉక్కుపాదం దానిని అణచివేయడానికి సిద్దమవుతుంది.
"ఆ ప్రయత్నంలో విప్లవకారులు ప్రాణాలు అర్పించకమానరు. రక్తం చిందించకా తప్పదు. మాది శ్రామిక శక్తి. మా విప్లవశక్తిని ఎదిరించే ఆయుధం ప్రపంచంలో లేదు.
కార్మిక, కర్షక, బడుగువర్గాల వాళ్ళు మా ఆశయాలకు మూల స్థంభాలు. మనది అధిక జనాభాగల అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఎక్కువమంది పేదవాళ్ళు ఉన్న దేశం మనది....
"ఆకలి మంటలు పోరాటమార్గానికి వెలుగు చూపుతున్నాయి. ఆ బాటలోనే లాంగ్ మార్చ్ చేస్తూ ముందుకు సాగిపోతుంటాం. పోరాటం లేనిదే ఈ దేశంలో ఏమీ సాధించలేము....
మా ఆశయాలు నచ్చితే మాతో కలుపు. ఈ పోలీసు వ్యవస్థ మా కాళ్ళను కట్టి పడవేయలేదు. విప్లవం ముందు ఈ జైలు గోడలు విలువలేవు అని రుజువు చేస్తాం" అన్నాడు రణధీర్ ఆవేశంగా.
చేయని నేరానికి జైలు పాలయిన రవితేజలో అంతర్మధనం....
