Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 42

దొంగనోట్ల ముఠా నాయుకుడు జయచంద్ర అని తెలియడంతో ఒక వైపు ఉత్కంఠతో పాటు మరొక వైపు ఆలోచన కూడా బయలుదేరింది.
ఎందుకంటే జయచంద్ర సామాన్యుడు కాడు.
కోటీశ్వరుడు మాత్రమే కాదు _ ఎందరో గూండా నాయకులను తన చేతి కింద వుంచుకున్న ఘారానా మాఫియా లీడర్.
బయట ప్రపంచానికి వ్యాపారవేత్తగా_ రాజకీయ నాయకునిగా మాత్రమే తెలుసు.
అతని అసలు స్వరూపాన్ని తెలుసుకున్న చతుర్వేదిని అడ్డు తొలగించుకుని వుంటాడు.
ఇలాంటప్పుడు తను ఫోటోగ్రాఫర్ ను కస్టడీలోకి తీసుకుని కేవలం అతని స్టేట్ మెంట్ తో జయచంద్ర ను అరెస్ట్ చేయాలని అనుకోవడం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుంది.
తిమ్మని బమ్మిని చేయగల సామర్ధ్యం వున్న జయచంద్ర తను అసలు చతుర్వేదిని చంపనే లేదని తేలిగ్గా నిరూపించుకుని నిర్దోషిగా బయట పడగలడు.
సో... సమయం చూసి మాత్రమే అతనని దెబ్బతీయాలి. ఈ లోగా తను అతనని అనుమానిస్తున్నట్టు ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్తపడాలి.
తగిన సాక్ష్యాధారాలను సంపాదించి అతనని దోషిగా పకడ్బందీగా అరెస్ట్ చేయాలి తప్ప ఏ మాత్రం తొందరపడినా జాగ్రత్తపడిపోతాడు.
ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఏసిపి వీరేష్ అప్పటికప్పుడు బార్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
తన ఆలోచనను అమల్లో పెట్టాలంటే తన పైఅధికారి సహాయం ఎంతయినా అవసరం....
అందుకే అర్దరాత్రి సమయంలో సయితం డి.ఐ.జి. ఇంటికి బయల్దేరాడు.
అప్పుడే అయన నిద్రకు వుపక్రమించబోతున్నాడు.
వేళకాని వేళ వచ్చిన వీరేష్ ను చూసి ఆశ్చర్యపోయాడు ఆయన.
కానీ, వీరేష్ ను గురించి తెలిసి వుండడం వలన ఎంతో అత్యవసరం అయితే రాడని, వెంటనే లేచి వచ్చి విషయం ఏమిటో అడిగాడు.
"సర్... మీరు నాకు అప్పగించిన పని పూర్తి చేశాను"
ఆయన కనులలో విస్మయం తొంగి చూసింది.
"అవును సర్_ సంఘంలో ఘరానా పెద్ద మనిషిగా చలామణి అవుతున్న జయచంద్ర ఆ చీకటి వ్యాపారానికి అధిపతి. ఇన్ స్పెక్టర్ చతుర్వేదిని చంపింది కూడా అతనే"
"వాట్?"
"నిజమే సర్_ కానీ మనం అతనిపై యాక్షన్ తీసుకోవడానికి సిద్దపడితే వెంటనే డిఫెన్స్ స్టెప్ తీసుకుని తను నిర్దోషిగా న్యాయస్థానం చేత తీర్పు చెప్పించుకుంటాడు..."
"ఎస్... యూ ఆర్ రైట్... అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు?"
"అతనికి చెందిన సాక్ష్యాలను చాటుగా పొంచివుండి సేకరిద్దాం. చాపకింద నీరులా అతని వెనుక అతని చరమాంకానికి పునాది తవ్వూతూ మన పని మనం చేసుకెళ్ళాలి.
ఎటూ తప్పించుకొని విధంగా పద్మవ్యూహం పన్నడం అయిపోయాక అప్పుడు అతనిని అదుపులోకి తీసుకుందాం. అందుకు మీ సహకారం కావాలి"
"ఓ.కే... నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమయినా అందించటానికి మన డిపార్ట్ మెంట్ మొత్తం నీ వెనుక వుంటుంది... బట్ బీకేర్ ఫుల్ వీరేష్..."
"అలాగే సర్.. ఇంకొక చిన్నరిక్వెస్ట్ సర్..."
"ఏమిటది?"
"మన మధ్య జరిగిన సంబాషణ మన యిద్దరికీ తప్ప మూడవ వ్యక్తికి తెలియకూడదు. మన డిపార్ట్ మెంట్ లో ఇంకెవరి వద్దా జయచంద్రను గూర్చి చర్చించకుండా వుండడం మంచిది" అన్నాడు వీరేష్.
"అంటే.... మనవాళ్ళనే అనుమానిస్తున్నావా?"
"అనుమానించటం కాదు సర్... ముందు జాగ్రత్త. సహజంగా ఎంతో రహస్యంగా సాగిపోయే చీకటి వ్యాపారానికి మద్దతును యిచ్చే పెద్ద మనుషులు ఎందరో వుంటారు. వాళ్ళ  కారణాలు వాళ్ళకు వుంటాయి. డబ్బుకు ఆశపడో.... లేక ఇంకేదో ప్రలోభానికి ఆశపడి తమ వృత్తికి ద్రోహంచేస్తూ జయచంద్రకు బానిసలై వుండవచ్చు. అలానే మన డిపార్ట్ మెంట్ లోని వాళ్ళు కూడా ఎవరో ఒకరు అతనికి లొంగిపోకుండా ఎలా వుంటారు. లేకుంటే ఎంతో పకడ్బందిగా ఇన్నాళ్ళు చీకటి వ్యాపారాన్ని చేయగలిగేవాడు కాదుగా?"
అతని ముందుచూపుకు, పట్టుదలకు డి.ఐ.జి. ముగ్ధుడు అయిపోయాడు.
వీరేష్ హెచ్చరించకుండా వుండి  వున్నట్టయితే చెప్పాలని కాకపోయినా ఏదో ఒక క్షణంలో జయచంద్రను గురించి  బయటపెట్టి ఉండేవాడు.
అది ఎవరికి తెలియ కూడదో వాళ్ళ చెవిన పడి అతను మరింత జాగ్రత్త పడిపోయేవాడు.
అదే జరిగితే అతడు దోషిలా చట్టానికి దొరకడం జరిగేదేకాదు....
ఏసిపి వీరేష్ తీసుకున్న తెలివయిన నిర్ణయం అలాంటి ఘోర తప్పిదాన్ని నివారించ గలిగింది. అందుకే డి.ఐ.జి. అతనిని మనస్పూర్తిగా మెచ్చుకున్నాడు.
"యంగ్ మాన్... మేక వన్నె పులిలాంటి హయచంద్ర విషయంలో ఆచి తూచి అడుగు వెయ్యి. ఏ మాత్రం అవసరం అనిపించినా నన్ను కాంటాక్ట్ చేయి. పరిస్థితి విషమించకముందే అడుగు వేయకపోతే నీ ప్రాణాలు రిస్క్ లో పడతాయి. ఒక సిన్సియర్ ఆఫీసర్ ను పోగొట్టుకున్నాం. మరొక హానెస్ట్ ఆఫీసర్ ను వదులుకోవాడానికి నేను సిద్దంగా లేను" గంభీరంగా అన్నాడు డి.ఐ.జి.
"ఓ.కే సర్..." సెల్యూట్ చేసి బయటకు వచ్చేశాడు ఏసిపి వీరేష్.
మరొక అరగంటలో ఇంటికి చేరుకున్నాడతను.
అంతవరకూ వీరేష్ నే అనుసరించి వస్తున్న గుబురు మీసాల వ్యక్తి బార్ దగ్గర నుంచి డి.ఐ.జి.ని కలుసుకోవడం వరకూ పూస గుచ్చినట్టు జయచంద్రకు వివరించి చెప్పాడు.
అయితే వాళ్ళిద్దరూ ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నారో తెలిసే అవకాశం లేదు కాబట్టి జయచంద్ర ఆలోచన్లో బడ్డాడు. బార్ లో ఏం మాట్లాడుకున్నదీ తెలియకపోయినా తన మనుష్యులపై నిఘా వేయటాన్ని బట్టి తనను అనుమానిస్తూ వుండాలని కన్ ఫర్మ్ చేసుకున్నాడు.
అంత అర్దరాత్రివేళ డి.ఐ.జిని కలుసుకోవడమంటే ఎంతో ముఖ్యమైన వ్యవహారమే అయి వుండాలి.
ఎందుకయినా మంచిదని వీరేష్ అనుమానించే తన అమ్నుషులను సిటీనుంచి దూరంగా పంపించివేయాలని నిర్ణయించుకున్నాడు జయచంద్ర.
   
                        *    *    *    *
ఇంటెలిజెన్స్ రిపోర్ట్సు చూసిన ముఖ్యమంత్రి తల తిరిగిపోయింది.
అసమ్మతి ప్రజ్వరిల్లటానికి కేంద్రబిందువు ఎవరో అప్పటికి అర్దమయింది.
అంటే... తను ఇన్నిరోజులుగా దొంగకు తాళాలు అప్పగించినట్లు అసమ్మితిని రూపుమాపే బాధ్యతను జయచంద్రకు అప్పగించి తను చాలా  పెద్ద తప్పు చేశానని అప్పుడు బాధపడసాగాడు.
అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.
తన వెనుక పెద్ద కుట్రే జరుగనుందని అర్దమైంది! చాలామంది ఎమ్.ఎల్.ఏ.లను తన వైపుకు తిప్పుకుని తనే సి.ఎమ్. కావాలని జయచంద్ర ఉవ్విళ్ళూరుతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS