తలదించుకుని వెళ్ళిపోతున్న గాయత్రిని హాలులో కూర్చుని ఉన్న సుమిత్ర నిలువరించింది. అంతా తెలుసుకోవాలని ఆమె ఉబలాటం.
"గాయత్రీ! అబ్బాయిగారు రాలేదేం? ఫాంహౌస్ లో ఉన్నారా?"
"కాదండి! కారు తీసుకుని ఆయన పట్నం వెళ్ళిపోయారు."
"ఈరోజు కూడ ఉండమని అడగలేదా నువ్వు?"
"ఎలా అనగలను? పనులన్నీ ఆగిపోయి వున్నాయండి! ఈ రోజు విధిగా ఇంటర్వ్యూలు జరిపించాలి. ఆ తరువాత బ్రాంచి ఆఫీస్ లకి వెళ్ళి రావాలి! వరుసగా వారం రోజుల కార్యక్రమములు ఆగిపోయి వున్నాయి"
"ఇలా రావే గాయత్రి!" ఆమె తల్లి దగ్గర కూర్చుంది.
అయిదు రోజుల్లోనే ఇంత చిక్కిపోయావేం, వ్రతాలు నోములు అంటే ఆరోగ్యం చూచుకుంటూ కాపాడుకుంటూ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు తలకొకటి చెప్తారు! అన్నీ అలాగే చేయాలంటే ఇలాగే అవుతుందమ్మా!
ఎంత చిక్కి పోయావో చూడు. సగం అయిపోయావు" అంటూ కపోలాలు సవరించి తల దగ్గరగా తీసుకుని బుగ్గమీద పెదవులానించింది తల్లి.
గాయత్రి అందంగా నవ్వింది.
"వ్రతాలు చేస్తే చిక్కిపోతారేమిటండీ! అదేంకాదు. అంది.
"మరేమిటమ్మా కారణం?" వీపు దువ్వింది తల్లి!
"ఆయన మరీ పోకిరి అయిపోయారండీ! క్షణంకూడా ఊపిరి పీల్చుకోనివ్వరు. ఈ అయిదు రోజులు ప్రాణం తీశారు" అంటూ లేచి లోనికి వెళ్ళిపోయింది.
ఇంతవరకు సుమిత్రగారి మనసులో కొన్ని సందేహాలున్నాయి.
పిల్లలు ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారా?
ఆరు నెలలు దాటుతున్నా ఆ సూచనలు కన్పించక పోవటానికి వారిద్దరి మధ్య అవగాహన లోపం ఏమైనా ఉందా అనే అనుమానాలు ఆమెవి.
తల్లిగారి మనసులోని సందేహాలను తన మాటలతో తీసివేసింది గాయత్రి. సుమిత్రగారి మనసు తేలికపడింది.
ఆ శుభవార్త ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తోందామె!
* * *
"దుర్వార్త ఒకటి తెలిసింది అమ్మగారూ!" అంటూ వచ్చింది వర్ధని.
పెళ్ళి జరిగి సంవత్సరం మీద మూడు నెలలు గడిచాయి. క్యాలెండర్ మీద గుర్తులు చూచి గుణించుకుంటున్న సుమిత్రగారు తలఎత్తి చూచింది.
వాల్మీకి అత్తాయమ్మగారి అభిప్రాయాలు అనుమానాలు తెలుసుకున్న తరువాత వీలయినంతవరకు గ్రామంనించి రోజూ పట్నం వెళ్ళిరావటం సాయంత్రం ఎనిమిది గంటల తరువాత తాను ఇంటికి చేరుకోగానే ఒకసారి వారికి కన్పించటం చేస్తున్నాడు! సెలవుదినాలు ఆదివారాలు ఇంటిపట్టునే నిలిచి గాయత్రితో కులాసాగా కబుర్లు చెబుతున్నారు.
ఆమె మనసులో సందేహం పూర్తిగా మటుమాయం అయింది.
అల్లుడిగారిలో ఏం లేదు. అమ్మాయిని చాలా బాగా చూచుకుంటున్నారు అనే అభిప్రాయం ఆమెలో పూర్తిగా స్థిరపడిపోయింది.
ఆ సమయంలో హడావిడిగా వచ్చింది వర్ధని.
దుర్వార్త అని ఆమె అనటంతో చివ్వున తల ఎత్తి చూచింది. క్యాలెండర్ పంచాంగం లాంటివి అన్నీ ప్రక్కన ఉంది లేచి వచ్చిందామె.
"ఏమయింది వర్ధనీ! అమ్మాయి ఎక్కడ?" అని అడిగింది.
"ఫాంహౌస్ లో అమ్మాయిగారు తలతిరిగి పడిపోయారట. వాంతులు కూడ చేసుకున్నారట. పనివాళ్ళు పరుగెత్తుకొచ్చారు" అని వివరించింది.
వెంటనే క్రిందికి పరుగుతీసింది. సాధారణంగా ఆమె భవనం విడిచి వెళ్ళదు. కారు సిద్ధం చేయమని చెప్తూ ఉండగా ఇంటిముందు రెండెద్దుల బండి ఆగింది.
దానిలోంచి ఒకావిడ ముందుగా దిగి గాయత్రి దిగేందుకు ఎత్తుపీట తెచ్చి వేసింది. చేయి ఆసరాగా అందించి ఆమెను క్రిందికి దింపారు.
గాయత్రి చాలా నీరసంగా కన్పించింది.
"అమ్మగారూ! అమ్మాయిగారు ఒంట్లో ఉసులులేక పడిపోయారు. ఉదయంనించే చాలా నీరసంగా కన్పించారు. తోటలో మొక్కలకు నీళ్ళు పెట్టిస్తూ ఎండలో నిలబడి అలానే పడిపోయారండి!
లేచాక వాంతులుకూడ చేసుకుంటున్నారండి అంది.
ఈ మాటలువిని లోలోపల సంతోషించింది సుమిత్ర.
అమ్మాయి నీళ్ళోసుకుంది కామోసు అనుకుంది కాని ఆ విషయం ధృవీకరించుకోవలసింది ఇలా కాదు, డాక్టరుగారి ద్వారా!
వెంటనే ఆమె జీపు డ్రయివర్ ని పట్నం వెళ్ళమని ఆదేశించింది. వాల్మీకికి ఈ వార్త అందించటం డాక్టర్ ని తీసుకురావటం అతని పనులు. స్వీట్స్ తాంబూలాలు తీసుకురమ్మని ఎవ్వరూ వినకుండా చెప్పింది అతనికి! తానే స్వయంగా పట్టుకుని గాయత్రిని మెట్లు ఎక్కించింది.
మంచంమీద పడుకున్న తరువాత దగ్గర కూర్చుని విశేషాలు అడగటం ప్రారంభించింది. గాయత్రి చెప్పిన సమాధానాలు అయోమయంగా ఉన్నాయి.
చిన్నపిల్ల దానికేం తెలుసు! డాక్టర్ వస్తే అంతా తేలిపోతుంది కదా? అనుకుంది. సరిగా గంటన్నర తరువాత ఇంటిముందు జీపు ఆగింది.
దానిలోంచి డాక్టరు, వాల్మీకి క్రిందికి దిగారు.
అప్పటికి గాయత్రి నిద్రపోతూ ఉంది. వారు నేరుగా పైకివచ్చారు.
డాక్టర్ వసుధ వాల్మీకిని వరండాలోకి వెళ్ళమంది.
వర్ధని తలుపులు మూసి తిరిగి వెళ్ళింది.
అయిదు నిముషాల అనంతరం తలుపులు తెరుచుకున్నాయి.
డాక్టర్ వసుధ నవ్వుతూ వెలుపలకు వచ్చింది.
అప్పటికి సుమిత్ర కూడ వచ్చి విషయం తెలుసుకుని క్రిందికి వచ్చి హాలులో సోఫాలో కూర్చుంది.
వాల్మీకి వసుధ మాటాడుకుంటూ క్రిందికి దిగి వచ్చారు.
"అమ్మాయి తల్లి అవుతోంది కదా డాక్టర్!" అంది సుమిత్ర ఆశగా.
"నో నో!" యూ ఆర్ మిస్టేకన్ మేడమ్! అమ్మాయికి అలాంటివి ఏమీ లేవు. జీర్ణకోశం తాలూకు చిన్న ఒడిదుడుకులవల్ల తీసుకున్న ఆహారాన్ని ఆరగించుకోలేకపోయింది. అందుకే కళ్ళు తిరిగాయి.
వాంతులు అయింతరువాత ఆమె మామూలుగా అయిపొయింది.
ఇప్పుడు అలసట వల్ల నిద్రపోయింది.
నౌ షి ఈజ్ ఆల్ రైట్! అయినా పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు కాలేదు కదా? మీ కిప్పట్లో అలాంటి ఇబ్బందులు లేవు" అని తన రిపోర్ట్ అందించింది డాక్టర్ వసుధ.
ఆ మాటలు సమ్మెటపోటుల్లా సుమిత్ర గుండెలమీద పడ్డాయి.
వసుధ వెళ్ళి జీపులో కూర్చుంది. వాల్మీకి పైకి వెళ్ళాడు.
"అమ్మగారూ! స్వీట్స్ తమలపాకులు ఏం చేయమంటారు?" అని అడిగాడు డ్రయివర్! సుమిత్రకి సమాధానం చెప్పేందుకు నోరు పెగిలిరాలేదు.
"వెనక్కి తీసుకు పో!" అని బదులిచ్చింది ఆమె వెనుక నిలిచిన వర్ధని.
డ్రయివర్ వెళ్ళిపోయాడు. జీపు సౌండు క్రమంగా దూరమయింది.
తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించింది సుమిత్ర.
వర్ధని ఒక్కదానికే ఆమె మానసిక స్థితి అర్ధమయింది. గాయత్రి పుట్టక ముందు నుంచి సుమిత్ర కదలికలు ఆమెకు తెలుసు.
డాక్టరుగారు అది ప్రెగ్నెన్సీ తాలూకు సూచనకాదు అనటం సుమిత్రకి చాలా నిరాశ కలిగించింది. ఆమె మానసికంగా క్షోభకి గురి అయింది.
గాయత్రీ దంపతులకు వాస్తవంగా ఈ విషయమై బాధపడే సమయం కాదు. మరికొంత కాలం ఆగి పిల్లలు పుట్టినా వారికి అభ్యంతరం లేదు.
కాని సుమిత్రగారి ఆసక్తి కారణంగా వారిలోనూ కొంత మనస్తాపం కలిగింది.
"మీ అమ్మగారు ఈ విషయమై బాధపడుతున్నా రనుకుంటా" వాల్మీకి.
ఈ మధ్య ఆవిడగారికి ఆరోగ్యం సరిగాలేదు. మగబిడ్డ పుడితే తాను వాడికి కొన్ని పద్ధతులు నేర్పి ఆ తరువాత కన్ను మూయాలని ఆవిడ ఆశ! ఆలస్యమవుతున్నందుకు బాధ కాదు క్షోభ పడుతున్నారు" అంది గాయత్రి.
"వారిని అంత బాధ పడనివ్వటం మంచిది కాదేమో!"
"ఏం చేద్దామంటారు?"
"సిన్సియర్ గా ప్రయత్నం చేద్దాం"
"ఛీ పొండి! అల్లరి మాటలు కాదు. నిజంగా చెప్తున్నాను ఆ సూచనలు కన్పించకపోవటానికి మన ఇద్దరిలో ఏ లోపమూ లేదు. గర్భం ధరించాలంటే భార్యాభర్తలు అందుకోసం ప్రత్యేకంగా కృషి చేయాలా?
అది సహజమయిన పరిణామం. ప్రకృతి రీతి! నిజంగానే భగవంతుడు కరుణించాలేమో!"
"మీ అమ్మగారికి ఉన్న చాదస్తాలే నీకూ ఉన్నాయి. వారసత్వం పోనిచ్చుకోలేదు. క్విక్ రిజల్ట్ రాలేదు అనే అభిప్రాయం నీకు కూడ ఉంటే వెంటనే డాక్టర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. నా అభిప్రాయం అది"
గాయత్రి చాలాసేపు ఆలోచించింది.
"మీరు చెప్పేది అర్ధవంతమయిన విషయమే! పిల్లలు కలగటం అనేది కేవలం భార్యాభర్తల కలయిక అనే ఒక సంఘటనతో ముడిపడి ఉండదు.
ఆ తరువాత కనుపించని ఎన్నో పరిణామాలు జరిగి అది శిశువు కావాలి. అది ప్రాణుల జీవలక్షణం! ప్రకృతి సిద్ధం.
ఈ మొత్తం ప్రాసస్ లో ఎక్కడ లోపం జరిగినా తల్లిదండ్రులు అయేందుకు ఇద్దరూ అనర్హులు అవుతారు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చేయండి.
ముందు మీరు డాక్టర్ని సంప్రదించండి!" అంది గాయత్రి.
"నా గురించి నీకు ఏవైనా అనుమానాలున్నాయా?"
