అటుగావస్తున్న ఆటోని పిలిచి అందులోకి ఎక్కించి శిరీష, రంగారావు చెరో పక్క కూర్చున్నారు.
రంగారావు గదికి తీసుకెళ్ళాక గంట తర్వాత భారతి కళ్లు విప్పింది.
ఈలోగా జరిగిన కధని శిరీష అతనికి పూర్తిగా చెప్పింది. అంతే కాదు. తనగురించి కూడా పూర్తిగా చెప్పేసింది.
శిరీష ఎలాంటిదైనా ఆమె వ్యక్తిత్వం అతని కెంతో నచ్చింది.
భారతి చేతుల్లో మొహాన్ని దాచేసుకొని బావురుమంది.
"నన్నెందుకు బతికించారు!"
"నాకోసం భారతీ!" అన్నాడు రంగారావు ఆమె చేతులకి అయిన గాయాలని తడిగుడ్డతో తుడిచి అయోడిన్ రాస్తూ.
ఆమె ఏడుపు ఆపి అతనికేసి చూసింది.
"జరిగింది నేను కొంత ఊహించాను. అందుకే ఇలా జరుగుతుందని ఊహించి ఆఫీసునుంచి నువ్వు వెళ్ళేముందు నీకు అలాచెప్పాను. నువ్వేమనుకొన్నావో నాకు తెలీదు. ఇప్పుడు శిరీష ద్వారా మొత్తం తెలుసుకొన్నాను."
"నేను చెడిపోయిన దాన్ని!"
అతను నవ్వేడు.
"సాధారణమైన ఆడపిల్ల అనే మాటనే నువ్వు అంటున్నావు శరీరం చెడిపోవచ్చు. ఈ విధంగా కాకపోయినా మనషి శరీరం ఏదో ఒకరోజు చనిపోయాక చెడిపోతుంది. అది కుళ్లిపోయి వాసన వేస్తుందనే దహనం చేస్తారు.
కానీ మనిషి మనసు పవిత్రంగా వుండాలి. అభిమానం ప్రేమ, ఆదరణ, చేసిన పుణ్యం ఇవే కీర్తి రూపంలో మనిషికి మిగిలే ఆస్తులు
భారతి!
నేను నిన్ను ప్రేమించాను. ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తాను.
నువ్వు నాక్కావాలి.
నీ జీవితంలో భాగస్వామిని కావాలనీ నేను కోరుకుంటున్నాను.
నా బతుకులోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. అందుకే నిన్ను కాపాడుకొన్నాను!" అన్నాడు రంగారావు.
భారతి కళ్లవెంట నీరు ధారగా స్రవిస్తోంది.
"కానీ నేను మామూలు మనిషిని కాదు రంగారావు. నా కడుపులో ఆ దుర్మార్గుడి ప్రతిరూపం పెరుగుతోంది!"
రంగారావు ఆమె మొహంలోకి చూశాడు.
అతనేం చెపుతాడో వినాలని ఆసక్తిగా అతనికేసి చూస్తోంది శిరీష.
23
రంగారావు చిన్నగా నవ్వేడు.
"నాకు ఆ సంగతి తెలుసు."
శిరీష ముందు నిర్ఘాంతపోయినా అటు తర్వాత అతని వ్యక్తిత్వం, ఉదారస్వభావం, ఎలాంటిదో అర్దం చేసుకోగలిగింది.
ఆమెకి రెండు చేతులూఎత్తి నమస్కారం చేయాలనిపించింది.
"నా గురించి అంతా తెలిసి కూడా నీజీవితంలోకి నన్ను ఆహ్వానించగలవా రంగారావు?"
వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది భారతి.
అతను ఆమె మొహంలోకి చూశాడు. ఆమెఎంత అమాయకురాలో చెప్పకుండానే అర్దం అవుతోంది.
అతని కెందుకో చెప్పలేనంత జాలి కూడా కలిగింది.
"దాహంగా వుంది!" ఆమె జీరపోయిన గొంతుతో అడిగింది.
జగ్గులోంచి నీళ్లని గ్లాసులోకి వంపి ఆమెకి అందించింది శిరీష.
రంగారావు సిగరెట్ వెలిగించి అన్నాడు.
"భారతీ!"
ఆమె మొహం ఎత్తి అతనికేసి చూసి కళ్లు దించుకొంది.
"నేను నీకిదివర కెప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు."
నా నిండు బతుకులో వాడు విషాన్ని గుమ్మరించాడని బాధ పడుతున్నానే తప్ప నీ పైన ఏవగింపుగానీ, ద్వేషంగానీనాకు లేవు.
బారతీ!
నువ్వు నమ్మి మోసపోయినదానికే తప్ప కావాలని చెడిపోయిన దానివి కాదు.
నీ మనసెంత నాజూకైనదో,
ఏ హృదయం ఎంత కల్మషం లేనిదో
నిర్మలమైన నీ మొహం చూస్తే తెలీదా?
అందుకనే భారతీ!
నేను మరోనిర్ణయం కూడాతీసుకున్నాను" అన్నాడు.
శిరీషకి అతన్ని చూస్తుంటే "ఇతను మనిషా? దేవుడా?" అన్న అనుమానం కలుగుతోంది.
"ఏమిటి?" అడిగింది. ఆమాట నూతిలోంచి వెలువడినట్లుగా వుంది.
"నీకు పుట్టబోయేబిడ్డని నా బిడ్డగా, నువ్వు నాకిస్తున్న బహుమతిగా స్వీకరిస్తాను"
అతని మాటలకి నమ్మలేనట్లుగా చూసి చేతుల్లో మొహాన్ని దాచేసుకుని బావురుమంది భారతి.
"వద్దు. నీ మాటలతో నేను చచ్చిపోతున్నాను. నీ మంచితనాన్ని నేను భరించలేకపోతున్నాను.
నా బతుక్కి నిండు గ్రహణం పట్టింది. ప్రతిక్షణం గతం గుర్తుకొచ్చి నీడలా నన్ను వెంటాడుతుంటే నేను భరించలేను.
నా కసలు జీవించాలనే లేదు.
నన్ను చచ్చిపోనీ!
