Previous Page
Next Page
యుద్దక్షేత్రం పేజి 41
రంగారావుకి అర్దం అయిందొక్కటే.
ఆమె ప్రశాంత్ దగ్గర కెళ్లింది.
అతను ఆమెని తిరస్కరించి బయటికి గెంటి వుండాలి.
మరి ఈ అమ్మాయి ఎవరు?
బాగా తాగినట్టుంది?
భారతిపైన ఆమెకి ఇంట్రస్ట్ ఏమిటి?
భారతికి స్నేహితురాలా?
లేక ప్రశాంత్ కి సన్నిహితురాలా?
బంధువా?
ఎవరు?
ఇవన్నీ ఆలోచించే వ్యవధి లేదు.
ఆమె ఎవరైనా ఫరవాలేదు.
భారతి ఆత్మహత్య చేసుకోబోతున్న సమాచారం తనకి అందించింది.
భారతిని కాపాడాలి!
ఆమె చేతిని పట్టుకొని గబగబ సందు వయిపు తిరిగాడు.
చీకటిగా వుంది.
రోడ్డుమీద జన సంచారం వుంది.
గబగబ నడవడానికి ఆమె సహకరించలేకపోయింది.
ఆ రోడ్డులో ఓ యాభై గజాల దూరంలో ఓ ఆడమనిషి తడబడుతోన్న నడకతో వెళుతోంది.
ఆ... .మనషిని రంగారావలు పోల్చుకున్నాడు.
వెయ్యి మందిలో నడుస్తున్నా భారతిని రంగారావు గుర్తుపట్టగలడు.
"అదిగో భారతీ!" అన్నాడు.
"ప్లీజ్... పరుగెత్తి ఆమెని ఆపండి!"కీచుగా అరిచింది ఆమె.
ఆమెనిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తూ పరుగులాంటి నడకతో రంగారావుతో కలిసి అడుగువేస్తోంది.
ఆయాసంతో ఆమె గుండెలు ఎగిరి పడుతున్నాయి.
"నీ పేరు!" నడుస్తూనే అడిగాడు రంగారావు.
"శిరీష!" ఆయాసంతో రొప్పుతూనే చెప్పింది శిరీష.
రాజభవన్ రోడ్డు.. .నిర్మానుష్యంగా వుంది.
దూరంగా రైలు కూత వినిపించింది.
భారతిని చేరుకోవడానికి ఇరవా గజాల దూరం వుంది సుమారుగా.
భారతి రైలు కట్ట పక్కకి నడిచింది.
అది గమనించగానే రంగారావు గుండె వేగంగా కొట్టుకోసాగింది.
"నేను పరుగెత్తలేను. నువ్వు వెళ్లు... భారతిని రక్షించు" ఏడుపు గొంతుతో అంటూ శిరీష రోడ్డుపక్కన కూలబడిపోయింది.
ఒక్క క్షణం శిరీషకేసి చూసాడు.
ఆమె తిరిగి లేవడానికి ప్రయత్నిస్తోంది.
దూరంగా రైలు వస్తున్నట్టు పట్టాలపైన ఇంజన్ హెడ్ లైట్ కాంతి పడుతోంది.
ఆ కాంతిలో.. .పట్టాలపైన అడ్డంగా భారతి పడుకోవడం చూశాడు రంగారావు.
అతని శరీరం చిరుగుటాకులా కంపించిపోయింది.
అంతే! శరీరంలోని శక్తినంతా కాళ్లలోకి తెచ్చుకొని చిరుతపులిలా ముందుకి ఉరికాడు.
ధన్ ధన్ ధన్ మని చప్పుడు చేస్తూ గోదావరి ఎక్స్ ప్రెస్ భారతికి పది పదిహేను గజాల దగ్గరికి వచ్చేసింది.
"భారతీ!" అని అరుస్తూ ఒక్క దూకు దూకాడు రంగారావు.
భారతి రెండు కాళ్లు పట్టుకొని పట్టాలమీద నించి కిందికి లాగేశాడు. ఆమెతోపాటు అతనూ ట్రాక్ పక్కగా కిందికి దొర్లిపోయాడు. మరుక్షణం రైలు దూసుకెళ్ళిపోయింది.
కంకరరాళ్ల పైన అతని వళ్లు చెక్కేసినట్టుగా చీరుకుపోయి రక్తసిక్తమైంది. మెల్లగా లేని భారతి దగ్గరగా వెళ్లాడు. ఆమె స్పృహలో లేదు.
కానీ ఆమె ఏడుస్తోన్నట్టుగా కంఠం అదురుతోంది.
"భారతీ" అని మృదువుగా పిలిచాడు.
ఆమె పలకలేదు.
ఆమె చెంపల మీద చేత్తో తట్టి పిలిచాడు.
ఆమె చేతులూ, గెడ్డ కింద బాగా కొట్టుకుపోయి రక్తం కారుతోంది.
అతనికి ఎంత తృప్తిగా వుంది.
ఆమెని కాపాడగలిగినందుకు.
కాదు.
కాపాడుకోగలిగినందుకు.
"ధాంక్స్ ఎ లాట్!" అన్న గొంతు విని తల తిప్పి చూశాడు.
శిరీష.
అతని పక్కనే కూలబడింది.
"భారతిని నేను నా గదికి తీసుకెళతాను" అన్నాడు.
"నేను వస్తాను" అంది శిరీష.
"సరే పద!" అని భారతిని లేపి భుజాన వేసుకుని రోడ్డుమీదకి తీసుకొచ్చి ఓ గోడవారగా కూర్చోపెట్టాడు.
Previous Page
Next Page