"పరిహారం!" పారిజాత పెదవులెందుకో విరక్తిగా, విచిత్రంగా నవ్వాయి. సరిగా ఇదే మాట మనూ కూడా మాట్లాడాడు కదూ! వీళ్ళు చెల్లించే పరిహారం తనకు న్యాయాన్ని చేకూర్చుతుందా?
"నువ్వు నాకు ద్రోహమేమీ చేయలేదత్తా! నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ అంతస్తుకు తగిన సంబంధం నువ్వు చూచుకొన్నావు. పొరపాటు నాదే. తొలి వయసులోని ఆకర్షణవల్ల మనూ నావాడైతే బాగుండునని ఆశ పడ్డాను. నాది ఆశే కాదు. దురాశ కూడా, నేనెక్కడా? మనూ ఎక్కడా? ఈ ఇంట్లో పని మనిషిని కావలసినదాన్ని కోడల్ని ఎలా అవుతాను? ఇప్పుడు మనూ మీదగాని, నీ మీద గాని నాకు కోపం లేదత్తా! నా స్థానం ఎక్కడో నా అర్హత ఏమిటో నాకు కాలం చెప్పింది. నేనిప్పుడు అమాయకురాలిని కాదు. ప్రపంచాన్ని కాచి వడబోసినంత అనుభవ జ్ఞానం కలిగింది. మా నాన్న పోయిన ఈ కొద్ది కాలంలోనే"
"అసలు సంగతి చెప్పవే పారూ! రంగనాథాన్ని పిలిచి మాట్లాడనా?"
"నా మంచికోసమే నువ్వీమాట చెబుతున్నప్పుడు బొత్తిగా నీ మాట తీసివేయలేనత్తా! కాని నన్ను కొంచెం ఆలోచించుకోనీ. అయినా రంగనాధం మామయ్య నన్ను తన కొడుక్కు చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆయనే నన్ను కోడలిగా చేసుకుంటానంటే నేను ఒప్పుకోలేదు. అదే కోపంతో వాళ్ళిప్పుడు నాతో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ నువ్వడిగితే రంగనాధం మామయ్య ఒప్పుకోడనే నా ఉద్దేశ్యం.
"ఆయన్ని నేను ఎలాగో ఒప్పిస్తాను సరేనా?"
"నన్ను కొంచెం ఆలోచించుకోనీ అత్తా!"
దశమి రోజు కోమలమ్మ ఒక పట్టు చీర, ముత్యాల నెక్లెస్సూ తీసికెళ్లి రజనికి ప్రదానం చేసివచ్చింది.
రెండువరోజు రజని తరపున ఏడెనిమిది మందిదాక బంధువులు వచ్చారు వరనిశ్చయం చేయడానికి. పెళ్ళిరోజు సందడి ఆరోజే వచ్చినట్టయింది కోమలమ్మ ఇంటికి.
ఆరోజే లగ్న నిశ్చయంకూడా అయింది. సరిగా ఇరవై అయిదు రోజులు మాత్రం ఉంది మనోహర్ పెళ్ళి.
16
ఒకరోజు పారిజాతను ఈడ్చుకువచ్చి తమింట్లో కూలేసి, "ఇంత సిగ్గులేని దానిగా ఎలా తయారయ్యావే పారూ? ఇంకా ఏ ఆశతో ఉన్నావు ఆ ఇంట్లో?" నిలదీసింది లలిత.
"ఆశా? ఏ ఆశతో ఉన్నాననుకొంటున్నావు లలితా?"
"మనోహర్ తెగించి నిన్ను పెళ్ళాడతాడన్న ఆశా?"
"ఉహుఁ. ఆ ఆశ ఎప్పుడో అడుగంటింది. నేను మా మేనత్త ఊరినుండి ఉత్తరం వ్రాశానే! ఆ ఉత్తరం చదువుకొని కూడా మనూ రాలేదే - అప్పుడే నా ఆశ అడుగంటింది. ఏ కోటీశ్వరుల అమ్మాయికో భర్త కావలసినవాడు నాకు ఎలా లభ్యమౌతాడు? తెలిసీ తెలియని ఆ వయసు దాటి పోయింది లలితా! మనూ కూడా మునుపటి వాడు కాదు. రజని అతడి ఊహల్లో నిండి పోయింది. ఇప్పుడు ఈ పారు అతడింట్లో పని మనిషి మాత్రమే"
"అదే నీ అభిమానాన్ని, సిగ్గును ఎక్కడ వదిలేసినట్టు?"
"అభిమానం, సిగ్గు నాకు దిక్కు అవుతాయా? ఎవరూ దిక్కు లేనిదానికి అవి ఉండకూడదు. అవి నాకు అన్నం పెట్టవు!మనిషిని చెయ్యవు. ఆ రెంటినీ వదిలేశాను గనుకే నేను కోమలమ్మత్త ఆస్రయం సంపాదించుకోగలిగాను. తన ఖర్చుతో నాకు గిరిధర్ తో పెళ్ళి చేసి పంపిస్తానంటూంది తెలుసా? డబ్బు, సంఘంలో ఒక అంతస్తూ, పరువూ ఉన్న కోమలమ్మ ఆశ్రయంలో ఉన్నాను కాబట్టి నన్ను అల్లరి పెట్టడానికి ఎవరూసాహిసించడం లేదు. లేకపోతే వంటరిగా ఎక్కడ ఉండేదాన్ని? వంటరిగా ఉంటే ఈ మగవాళ్లు నన్ను బ్రతకనిచ్చేవాళ్ళా?"
"రేపు మనోహర్ పెళ్లి అయి రజని వచ్చాక కూడా నువ్వా ఇంట్లో ఉండి ఊడిగం చేస్తావా?"
"చేస్తాను తప్పేముంది?"
"అందరూ నీ గురించి ఏమనుకొంటున్నారో తెలుసా?"
"ఏమనుకొంటున్నారు?"
"నువ్వు మనోహర్ మీద ప్రేమ చంపుకోలేక ఆ ఇంట్లో ఉన్నావని, అతడికి భార్య అయ్యే అదృష్టం లేక పోయినా అతడికి ఉంపుడు గత్తెగా ఉండడానికి తయారయి నావని!"
రక్తం లేనట్టుగా పాలిపోయింది పారిజాత ముఖం. అదిరే పెదవులతో, "నిజమా లలితా?" అని అడిగింది.
"అబద్దం ఆడే అవసరం నాకేమిటి? ఈ విషయం నిన్నెంత గాయపరుస్తుందో తెలిసి కూడా నీకెందుకు చెప్పానంటే ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుస్తావని!"
