Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 41


    "అత్తయ్యా, మామయ్యను కలుసుకొన్నావా?"

    "అమ్మా ఏం ప్రయోజనం ఆశించి నన్ను తెచ్చుకొన్నావు? ఇందుకేనా?"

    దొరసానీ, చివరికి ఇంత ఘోరంగా ఆత్మహత్య చేసుకొని దీర్ఘకాల దుఃఖజీవితాన్ని పరిసమాప్తి చేసుకొన్నావా."

    ఆర్తనాదాలతో గదిలోకి ఉరికారు అందరూ.

    ఉరివేసుకున్న కృష్ణవేణిని పోల్చుకోడానికే వీల్లేదు. దిగ్భ్రమతో నిశ్చేష్టిత అయ్యి చూస్తున్నది దేవదాసి.

    అత్తా, మామా చేతులు కలుపుకొని ఆకాశమార్గంలో సాగిపోతున్నట్లు అనిపించింది దేవదాసికి.

    కర్మ ప్రారంభించేనాటికి రమణారావు తల్లిదండ్రులు వచ్చారు. పెంపుడు తల్లిదండ్రులు మరణించారు, గొప్ప కార్యభారం కొడుకు భుజస్కంధాలమీద పడింది. మంచి, చెడ్డ చెప్పి చేయించడానికి తమకంటే ఆప్తులెవరున్నారన్న ఉద్దేశ్యంతో.

    కర్మ జరిపించబోయే బ్రాహ్మణుడు కావలసిన వస్తువులు చెబుతూంటే గోవిందస్వామి పట్టిక వ్రాస్తున్నాడు. మౌనంగా కూర్చొన్నాడక్కడ రమణ.

    "ఇదో, మాట! ఇలారా!" తండ్రి పిలుచుకుపోయాడు అవతలికి "బ్రాహ్మణుడు వ్రాయించినవన్నీ తెప్పించెయ్యడమే? చిన్నవాడిని చూచుకొని పది, ఇరవై వేలదాకా వదిలించేట్లున్నాడా బ్రాహ్మణుడు. ఇన్ని బట్టలూ, ఇన్ని దానాలూ ఏమిటి?" మందలించాడు.

    "ఆయన ఏది చెప్పినా శాస్త్రప్రకారమే!"

    "శాస్త్రం! ఉన్నవారికి ఒక శాస్త్రం, లేనివారికి ఒక శాస్త్రం చెబుతారీ బ్రాహ్మణులు! కొంచెం ముక్తసరిగా దాటించే పనిచెయ్యి. ఉన్నదని ఖర్చుపెట్టెయ్యడం కాదు. ముందు ఇల్లు చక్కదిద్దుకోవలసిన వాడివి."

    చిరాకుపడ్డాడు రమణ. అదేమిటి? మీరు అలా అంటున్నారేమిటి? వారిచ్చిన బుక్క ఇది వారినోట మట్టికొట్టి నన్ను అనుభవించమంటారా?

    "ఆఁ. చచ్చినవాళ్ళు చూడొచ్చారు. నువ్వంతా సక్రమంగా నడిపించి కొడుకుమీద మనసు పెట్టుకొని కృశించి చచ్చినవాడి ఆత్మను స్వర్గానికి పంపవచ్చు."

    మౌనంగా లోనికి వెళ్ళిపోయాడు రమణ. కృష్ణవేణి తన నుండి ఏం కోరి తనను దత్తత చేసుకొందో ఆమె వచ్చి చూడబోయేది లేదు కాదుగా నమ్మకద్రోహం చేయలేదు! అన్నీ సక్రమంగా జరిగిపోవాల్సిందే.

    భార్యా పిల్లలను ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళిన సూర్యదేవులు అక్కడి వ్యవహారాలు చక్కదిద్ది కర్మకాండ ముగిసే వరకు తిరిగి వెళ్ళే అవసరం లేకుండా చేసుకొని వచ్చారు. ఆయన వచ్చేరోజే దేవదాసి పేర ఒక వుత్తరం వచ్చింది అక్కడికి. ఎన్నడూ లేనిది దేవదాసికి ఉత్తరాలు వ్రాసేదెవరా అన్న కుతూహలంతో, కూతురి మంచి చెడ్డలు చూచే బాధ్యత తనకున్నది కనుకనూ కవరుచించి ముందు ఆయనే చదువుకొని భద్రంగా కూతురికి తెచ్చియిచ్చారు.

    'నీ బావ వ్రాశాడమ్మా ఉత్తరం' అంటూ తండ్రి ఉత్తరం అందీయగానే అత్యంత ఆశ్చర్యంతో, సంభ్రమంతో ఉత్తరం తీసుకువెళ్ళి మేడమీద ఒంటరిగా కూర్చొని చదువుకొంది దేవదాసి.

    "దేవదాసీ!"

    నీనుండి చాలా దూరం పోవాలనుకొన్నాను. పోయాను కాని, మనసుమాత్రం నీ దగ్గరికే వచ్చేస్తూంది. నీ తలపు నేనయినప్పుడు అనునిత్యం నీ హృదయంలో ఉన్నానన్నావు. నిజంగా నువ్వు కనిపించని క్షణం లేదు. నువ్వు జ్ఞానివి. దేవదాసీ! నువ్వు స్వయం జ్యోతివి. నాకు వెలుగులేదు. నేను వెలుగులోకి పోలేను.

    విషయ భోగాలయందు ద్వేషమున్నది. కాని, వాటి నుండి విడివడలేను. ఇదెంత ఆశ్చర్యం! నీ యందు రాగోదయం అయిన క్షణంనుండి దాన్ని తుదముట్టించే ప్రయత్నంలో ఉన్నాను. కాని, అది క్షణంలో కొమ్మలూ, రెమ్మలూవేసి మహావృక్షమైపోతున్నది. జీవితమంతా ఈ పోరాటంలోనే వ్యయమైపోతుందేమో? జన్మ సార్థక్యత ఎలా?

    రాగ భోగాలలో తరించిన వారు ఉన్నారు అన్నావు.

    నాకు మిగిలింది నువ్వు చెప్పన ఉపాయమే. వాటిని అంతమొందించే ప్రయత్నంకంటే వాటిని పెంపొందించుకొని విశ్వప్రేమకూ, విశ్వకళ్యాణానికి జీవితాన్ని ఉపయోగిద్దామనుకొంటున్నాను.

    అమ్మా నాన్నలను దుఃఖపెట్టను. నిన్ను వియోగ విరహాలలో దగ్ధం కానీయను.

    నా శూన్య వాదానికి స్వస్తి!

    మీ మధ్య మీ అందరికీ ఇష్టమైన మార్గంలో ముక్తిని వెదక్కొంటూ నవ్యజీవితాన్ని నిర్మించుకొంటాను.

    త్వరలో మీ అందరి సమక్షంలో - నీ బావ భార్గవరామ్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS