చక్కగా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. ఇద్దరూ ఆడుకొంటూ, పాడుకొంటూ గృహకృత్యాలు పూర్తి చేస్తారు! తమ ఇద్దరి మధ్య ఒక చిన్నారి బాబు, ఒక చిన్నారి పాప! తను స్నానం చేయిస్తే అతడు బట్టలేస్తాడు! తను తలదువ్వితే అతడు పౌడరు వేస్తాడు! ఇద్దరూ సంసార బాధ్యతలను , పిల్లల పెంపకాన్ని సమంగా పంచుకొంటారు. ఎవరెక్కువ అన్న ప్రశ్న వుండదు. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవిస్తారు! కాని, ఇప్పుడేం జరిగింది? వట్టి పురుషాహంకారపు మగడు తనపాలిపడ్డాడు. చెప్పు క్రింద చీమలా నలిపివేయాలని చూస్తున్నాడు." "నా ప్రాప్తం ఇంతే! జన్మంతా ఇలా వెళ్లిపోవలసిందే!" అని సరిపెట్టుకోవటం తనకు చేతకాదు! ఆ బానిసబ్రతుకు తనకక్కరలేదు! వ్యక్తిత్వం నిలుపుకోడానికే పోరాడుతుంది! గెలవలేని పక్షంలో ఇక్కడినుండి తప్పు కొంటుంది.
* * * *
కమలాకర్ ఆఫీసుకు వెళ్లాడు.
వంటపని, ఇల్లు సర్దడం అంతా అయ్యాక, డాన్స్ ప్రాక్టీస్ లేక చాలా రోజులైందనుకొంటూ పెట్టెలోంచి గజ్జెలు తీసి కాళ్లకి కట్టుకొని అన్నమాచార్య కీర్తనలు కాసెట్ తీసి టేప్ రికార్డర్ లో పెట్టి ఆన్ చేసింది.
పాట కనుగుణంగా నర్తించసాగింది.
నృత్యంలో పూర్తిగా లీనమైపోయింది. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతత పొందుతున్నట్టుగా వుంది. అన్ని బాధలనూ మరపించగల అధ్బుతమైన శక్తి నృత్యగానాలకి వుంది!
నర్తనంలో లీనమైన హరిత తలుపుమీద ఎవరో బాదిన శబ్దంగాని, పిలిచిన శబ్దంగాని అసలు వినలేదు. పాట ముగింపుకు వస్తూంటే అప్పుడు వినిపించింది తలుపులు విరగబాదుతున్నట్టుగా శబ్దం!
కాళ్లకు గజ్జలు అలా వుండగానే చెమట పట్టిన ముఖం తుడుచుకొంటూ వెళ్లి తలుపులు తెరిచింది హరి.
ఎదురుగా అత్త మామలు - కోపం, అసహనం నిండిన ముఖాలతో!
"వట్టి టేప్ రికార్డర్ పాట కాదండీ.... మీ కోడలు గారు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు!" అంది అత్తగారు.
మామగారు సీరియస్ గా, "ఊరినుంచి వచ్చిన అత్తమామలు వీధిలో నిలబడి ఎంతసేపైందీ కూడా జ్ఞానం లేకుండా పోయిందన్నమాట!"అన్నాడు.
ముందే తలుపులు తెరవలేదన్న కోపంతో వున్నారేమో, కాళ్లకి గజ్జలు కట్టుకొని ఘల్లు ఘల్లుమంటూ నడిచి వచ్చిన కొడల్ని చూసి మరీ మండిపోయినట్టుగా అయ్యారు.
వస్తూ వస్తూనే అత్తమామల ప్రవర్తన చికాకు కలిగించింది హరితకు. "మీరొస్తున్నారని ముందుగా తెలిస్తే తలుపులు తెరిచి వుంచి స్వాగత భంగిమలో నిలబడి వుండేదాన్ని" మంటగా అనుకొంది. "వినిపిస్తే తీయవా వినిపించలేదు... రండి, అత్తయ్యా! కాళ్లు కడుక్కోండి!"అక్కడున్న సామాన్లలోంచి ఒక బుట్ట లోపలికి పట్టుకొస్తూ మర్యాదగా ఆహ్వానించింది.
"అబ్బా! అమ్మా! ఏం బస్సులో.. .ఏం ప్రయాణమో. కాళ్లు నడుం పట్టుకుపోయి వస్తే వీధిలో గంట నిలబెట్టేసింది కోడలు మహాలక్ష్మి!" అత్తగారు సుబ్బమ్మ మూలుగుతూ, ముక్కుతూ బాత్ రూం కెళ్లొచ్చి మంచమెక్కి కూర్చొంది.
మామగారు కాళ్లు కడుక్కుని బట్టలుమార్చి ఆయన ఇంకో మంచాన్ని ఆక్రమించారు.
గజ్జలు విప్పి బీరువాలో పెట్టి గబగబా కాఫీ కలిపి తీసుకు వచ్చింది హరిత.
"భోజనం టైంలో కాఫీ ఎందుకు? రాత్రి గురువారం ఉపవాసం. కాస్త తొందరగా భోజనం ఏర్పాటు చేయవమ్మా!" అన్నారు మామగారు.
"వేడివేడిగా కాఫీ తాగితే అలసట తగ్గుతుంది. మామయ్యా. భోజనం రెడిగానే వుంది. కాస్త వడియాలు అప్పడాలు వేయించడమే!"
అరగంట తరువాత అత్తమామలకు భోజనం వడ్డించి, మళ్లీ అన్నం వండేసరికి కమలాకర్ వచ్చాడు.
అతడురాగానే కోడలు డాన్సుచేస్తూ తమని వీధిలో ఎలా నిలబెట్టేసిందో కొడుకు చెవిని వేసిగాని ఊరుకోలేదు....
"అయినా, ఆమెకు ఇంకా ఏం డాన్సులురా? కాళ్లకి గజ్జలుకట్టి తైమని రంగస్థలంమీద ప్రదర్శనలిస్తుందటనా?" అంది తల్లి.
"ఇస్తుందట."
"సంసారపక్షం వాళ్లకి ఈ డాన్సులూ, ప్రదర్శనలూ ఏమిటిరా? హవ్వ! దాని ఇష్టానికి నువ్వు తందాన పాడుతున్నావా?" అంది సుబ్బమ్మ.
