Previous Page Next Page 
కావేరి పేజి 41

    "కావాలంటే అంబుకాన్ని అడుగు?" అన్నాడు ఎంతో చిద్విలాసంగా!

    "మీరు చెప్పితే చాలదూ?" కళ్ళు అటుఇటు తిప్పింది కావేరి.

    "హోటల్ కి వెళ్ళి బిల్లుకట్టి సామానుతో సహా ఈ ఇంటిలోకి వచ్చేద్దాం! యింకా చెప్పేదేమంటే? నీ స్టేటస్ ని పెంచేటందుకు ఖరీదు గల సోఫాలు టీపాయ్ లు, డబుల్ కాత్సు, కిటికీలకి గుమ్మాలకి కర్టేన్సు...ఓ టెలిఫోన్, గేటు దగ్గిర గుర్ఖా! ఇన్ని హంగులు కొద్దిరోజులలోనే ఏర్పర్చకపోతే నువ్వు నిర్మాతల దృష్టిలో నిలవవు!"

    "అవన్నీ కొనాలంటే చాల డబ్బు అయిపోతుందేమో?" తన సందేహాన్ని వ్యక్తం చేసింది కావేరి.

    "అవకుండా ఎలా?...రేపు ఏ నిర్మాత అయినా నిన్ను సినిమాలో బుక్ చేశారనుకో! లక్ష రూపాయలు ఇస్తారు ఒక్క సినిమాకి! ఆ సినిమా హిట్ అయిందనుకో! మరో నిర్మాత వచ్చి లక్షన్నర అంటాడు. మరో నిర్మాత వచ్చి రెండు లక్షలు అంటాడు. ఆ స్థాయికి నువ్వు ఎదగాలంటే ముందు డబ్బు ఖర్చుచేసి నీ స్థాయిని పెంచుకోవాలి! యిప్పుడు డబ్బు కోసం చూడకూడదు!"

    కావేరి ఆలోచనలో పడిపోయింది.

    ఈ మాధవరావుని నమ్మాలా? వద్దా? అన్నదానికి సమాధానం తెచ్చుకుని "నమ్మాలి! తప్పదు!" అన్న నిర్ధారణకి సమాధానం వచ్చింది అతను కూడా తనంటే ఆప్యాయంగానే వుంటున్నాడు. ఆయా వ్యక్తులను బట్టి తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఏ స్టూడియో గేటు దగ్గిరకు వెళ్ళినా టాక్సీ ఆపేస్తున్న గుర్ఖాకి తన జేబులోనుంచి ఓ కార్డుతీసి చూపించటం, వాళ్ళు వెంటనే శాల్యూట్ చేసి గేట్లు తెరిచి మర్యాద పూర్వకంగా లోపలికి వెళ్ళమని చేతులు ఊపటం, ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికితీసుకెళ్ళి కాబోయే నూతనతార" అని పరిచయం చేయటం, ఆ క్రితంరోజున రకరకాలుగా తీయించిన కలర్ ఫోటోలు జిప్ బాగ్ లోనుంచి తీసి చూపించటం, లాంటివన్నీ తను చూస్తూనేవుంది. తనకి ఫాషన్ డ్రస్సులు, కళ్ళజోడు, వాచీ లాంటివస్తువులు కొనటం వరకేగాని తనక్రింద ఒక్క వస్తువు "కొనుక్కో లేదు యింతవరకూను!....దీనినిబట్టి చూస్తే మాధవరావుకి తనను సినిమా తారగా పైకి తీసుకురావాలన్న పట్టుదల వున్నట్టే తోస్తున్నది.

    "రాత్రిళ్ళు పడక విషయంలో కూడా తను కాదంటే దూరంగా జరిగి పడుకుంటాడు తప్ప తనను బలవంతం చేయడు.

    ఆ డ్రాయింగ్ మాష్టారు కాబట్టి ఫోటోలు ఇస్తానని చెప్పి ఇంటికి రమ్మనమని చెప్పి తీరా వెళ్ళిన తరువాత తనను వెనుకనుంచీ వాటేసుకుని తన కౌగిలిలో బిగించిపెట్టాడు...తనకి ఊపిరి ఆడలేదు. ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు. ఎన్ని బూతుబొమ్మలు తనకి చూపించాడు? ఎంతగా నలిపివేశాడు. తనభుజంమీద వున్న పమిటని తీసేశాడు. జాకెట్టు గుండీలు విప్పాడు!....ఛీ తలుచుకుంటేనే రోతగా వుంది....కాని మాధవరావు అలా చేయలేదు! తన అంగీకారంతోనే స్పృసించాడు. మగా? ఆడా? అంటే ఏమిటో ఎంతో సున్నితంగా తెలియచెప్పాడు. తనంటే ఎంతో ఇష్టం అనేవాడేగాని వినాయకం బావ ఇలా చేసేవాడు కాదు. ఇందులో ఇంత ఆనందం వుంటుందనుకుంటే ఆరోజునే డ్రాయింగ్ మాష్టారు చెప్పినట్టు వినేది!

    ప్చ్!...తనకివన్నీ తెలియవు! అందుకే తప్పించుకుని వచ్చేసింది.

    "ఏమిటి ఆలోచించుతున్నావు కావేరీ?"

    అంటూ భుజమీద చెయ్యివేసింది మాధవరావు అన్న సంగతి గుర్తులేక ఉలిక్కిపడింది.

    "కాబోయే సినీ తారవు కదా? భవిష్యత్తుమీద ఎన్నెన్నో కళలు కంటున్నావు. అది సహజం!" అంటూ నవ్వాడు.

    "సినీతారవు" అని మాధవరావు అన్నప్పుడు కావేరి మనసంతా పరవళ్ళు తొక్కుతుంది. శరీరమంతా రోమాంచితమయి ఆమెను అదొక లోకంలోకి తీసుకెళ్ళి కొన్ని క్షణాలు వివశురాలని చేస్తుంటాయి.

    "బాబు చెప్పింది అక్షరసత్యం కావేరీ! నువ్వు అనతికాలంలోనే గొప్ప తారవయిపోగలవు! అయినవాళ్ళూ వున్నారు!" సగం తెలుగు సగం అరవం కలగలిపి మాట్లాడుతూ అక్కడికి వచ్చిన అంబుజం తన చేతుల్లోనుంచి చెరొక కప్పూ అందించి అక్కడే నిలబడిపోయింది.

    "ఇప్పుడు ఇవెందుకమ్మా!" అన్నాడు ఎంతో అభిమానం, మరెంతో ప్రేమ ఉట్టిపడే స్వరంతో!

    "అతిధులకి మర్యాద చేయవద్దూ? ఇంతకీ కావేరికి ఈ ఇల్లు నచ్చిందా?" అనడిగింది అంబుజం.

    తనపేరు ఈమెకి ఎలా తెలిసింది? మాధవరావు తననుగురించి చెప్పివుంటాడు? లేకపోతే ఎలా తెలుస్తుంది?"

    "ఇదిగో కావేరి? నువ్వంతసేపు ఆలోచించటం అనవసరం! ఎందుకంటావా? ఇందులో వున్నవాళ్ళంతా పెద్దపెద్ద సినిమాస్టార్సు అయిపోయినారు తెలిసిందా?"

    "ఆఁ.....ఆఁ...బాగానచ్చింది! నేను ఈ ఇంటిలోనే వుంటాను! అవునూ? ఈ ఇంటిలోకి ఎప్పుడు వద్దాం?"

    "అదేమిటి? హోటల్ రూం కాళీచేసి వచ్చేద్దామనుకుంటున్నాంగా?" అన్నాడు మాధవరావు.

    "అవునవును! చెప్పారు! నేనే మరిచిపోయాను!" అంది పరాకుగా వుండి.

    కప్పులోని కాఫీని గబగబా త్రాగేసి కాళీకప్పుని అంబుజానికి ఇచ్చేసి కిటికీదగ్గిరకు వెళ్ళి బయటికి చూస్తోంది కావేరి.

    అలా చూస్తున్న ఆమెకి ఎదురు బజారులోని ఓ మేడ, ఆ మేడ గేటుదగ్గిర కాకీబట్టలు, తలమీద కాకీటోపీ పెట్టుకుని చేతిలో నల్లటి లాఠీని ఊపుతూ నిలబడివున్న గూర్ఖా, లోపలేకాదు, బయటకూడా కారులు బార్లు తీరి నిలబడి వుండటం చూసింది. ఎవరయివుంటారు? నిర్మాతా? లేక హీరో? హీరోయినా? ప్రముఖమయిన వ్యక్తి అయితేనే యింతమంది వచ్చేది!

    "ఆ మేడవైపుకి చూస్తున్నావా?" అంటూ వచ్చింది అంబుజం!

    "ఆఁ....ఎవరది? ఎంతోమంది వచ్చారు. కార్లుచూడు ఎన్ని వున్నాయో?"

    "ప్రముఖ నటీమని జయశీలది ఆ మేడ! అనకాపల్లినుంచి రావటంతోనే ఈ ఇంటిలో అద్దెకి దిగింది. అప్పటినుంచి స్టార్ తిరిగిపోయి పెద్ద స్టార్ అయిపోయింది. అప్పుడుకూడా మాధవరావు ఎంతో సహాయం చేశాడు. ఎంతోమంది నిర్మాతలదగ్గిరకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. అలాంటి జయమ్మ ఇప్పుడు జయశీలగా ఆకాశంలో వుండేటట్టు చేసింది మా బాబే! ఆ మహాతల్లినుంచి ఎలాంటి ప్రతిఫలం ఆసించకుండానే నిరాడంబరంగా వున్నాడు. అంత మంచి బాబుని దూరంగా నెట్టేసి ఇప్పుడు ఎవడినో వుంచుకుని, ఆతర్వాత వాడినే పెళ్ళిచేసుకుని మూడు పువ్వులు! ఆరు కాయలుగా సంపాదించి ఎంతో గొప్ప నటీమణి అయింది. ఆమెలో వున్న మంచిగుణం ఒక్కటంటే ఒక్కటి!" అంటూ ఆగింది అంబుజం!

    "ఏమిటది?" ఆసక్తిగా అడిగింది కావేరి!

    "ఈ యింటినే కొనాలని చూసింది. అమ్మనన్నారు. ఈ బజారులో వున్న తరువాతనే తనకి ఇంత అదృష్టం పట్టిందని అక్కడొక చిన్న ఇల్లు అమ్ముతానంటే కొని రెండంతస్తుల మేడకట్టింది. అందరికీ అంతో యితో సహాయం చేస్తుంది, అడిగితే దేనికీ కాదనదు!"

    అని అటుయిటూ చూసి ఏటో రహస్యం చెప్పుతున్నట్లుగా కావేరికి మరింత దగ్గిరగా జరిగి నెమ్మదిగా అంది-

    "నువ్వుమాత్రం మాధవరావుబాబుని వదిలిపెట్టకు! ఆ బాబంతటి మంచివాడు ఇంకెవ్వరూ లేరు. కష్టమయినా, సుఖమయినా, నష్టమయినా అతనితోనే వుండు! పెద్ద పెద్ద కంపెనీల నిర్మాతలను తీసుకుని వస్తాడు. పరిచయం చేస్తాడు....నిన్న అందరికంటే గొప్పదానిని చేస్తాడు. అతను చెప్పినట్టువిను! వింటేనే నీకు ఇక్కడ? అంటే ఈ సినీఫీల్డులో ఎంతో విలువ ఏర్పడుతుంది!"
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS