32
యాంత్రికంగా నడచి వస్తున్న రవిని చూచింది ఇందిర. విషయం అర్థం అయింది. తను కూర్చున్న కుర్చీ భూమిలోకి దిగిపోతున్నట్టనిపించింది. తల తిరిగిపోతూ వుంది.
"ఏమయిందిరా బాబూ! అలా వున్నావేం? ఇందిర చెప్పింది నిజమేనా? ఆమె ఏమన్నది?" జగన్నాథం రవి భుజం మీద చెయ్యి వేసి ఆరాటంగా అడిగాడు.
"లాభం లేదు నాన్నా! ఆమె నన్ను గుర్తించలేదు! గుర్తించనట్టు నటిస్తుంది. కారణం తెలియదు ఆమెకు నేనంటే చాలా కసిగా ఉంది. ఆమె నన్ను ద్వేషిస్తోంది" అన్నాడు.
జగన్నాథం ఓ క్షణం ఆలోచించాడు.
"నేను వెళతాను. తండ్రిగా యాచిస్తాను. ప్రాధేయపడతాను! ఆమె గుర్తించక తప్పదు! ఆమె సాక్ష్యం ఇవ్వక తప్పదు. నేను వెళతాను" జగన్నాథం రవి పిలిస్తున్నా వినిపించుకోకుండా కారు స్టార్టు చేశాడు.
అప్పుడే ప్రాణం పోయినట్టు కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్న ఇందిర దగ్గరకు వచ్చి నిల్చున్నాడు రవి. ఇందిర చేతిని తన చేతిలోకి తీసుకొని గోముగా నిమరసాగాడు. అయినా ఆమె ఈ లోకంలోకి రాలేదు.
"ఇందిరా!" మృదువుగా పిల్చాడు.
ఇందిర పలకలేదు.
"ఇందిరా! నాకొక ప్రామిస్ చేస్తావా? నా ఆఖరి కోరిక... చావబోయే ముందే ప్రాణి కోరే చివరి కోరిక... కాదనవనే అనుకుంటున్నాను."
ఇందిర చివ్వున తలెత్తింది. ఉద్రేకంగా రవి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
"చెప్పు ! రవీ నువ్వేం చెప్పినా చేస్తాను. నీ ఆఖరి కోరిక ఏదయినా సరే తప్పక తీరుస్తాను. అది నా అదృష్టంగా భావిస్తాను!" ఆ క్షణం కోసం యుగాలుగా ఎదురుచూస్తున్నదానిలా ఆర్తిగా అన్నది ఇందిర.
రవి ఆలోచిస్తూ నిలబడ్డాడు. ముఖం గంభీరంగా మారింది. గవదల ఎముకలు పైకిలేచాయి.
"చెప్పు రవీ! సందేహించకు. నాకు అంతకంటే కావాల్సిందేమీలేదు చెప్పు."
"తీరా చెప్పాక నిరాకరిస్తావేమోనని భయంగా ఉంది."
"అంటే నా మాట మీద నమ్మకం లేదా రవీ!"
"అదికాదు ఇందూ... నేను చెప్పేది..."
"నువ్వు ఏం చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను రవీ!"
"నువ్వు బాధపడకూడదు."
"నువ్వేం చెప్పినా సంతోషంగా నవ్వుతూ చేస్తాను, సరేనా చెప్పు."
"నువ్వు పెళ్ళిచేసుకో ఇందూ!"
అంటూ ఇందిర ముఖంలోకి చూసి "చూశావా! నేను సందేహించినట్టే అప్పుడే ముఖం మారిపోయింది."
"నువ్వు పెళ్ళి చేసుకో. సుఖంగా ఉండు. మీ అమ్మగారి ఆశలన్నీ నీమీదే వున్నాయ్! ఆమె చల్లని నీడలో నీ జీవితాన్ని నందనవనంలా తీర్చిదిద్దుకో."
ప్రామిస్ చెయ్యమన్నట్టు రవి చెయ్యి ముందుకి చాపాడు.
ఇందిర రవి చేతిలో చెయ్యి వేసింది.
"అలాగే రవీ! నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆనందంగా చేస్తాను. నీ ఆఖరి కోరిక తీర్చడం కంటే నాకు ప్రియమైంది ఏదీ లేదు" గబగబా అనేసి ఒక్కక్షణం నిల్చోలేనిదానిలా అక్కడనుంచి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిపోతున్న ఇందిరను చూస్తూ, గుండెల్లో అంతవరకూ అణచుకున్న బాధను బయటికి నెట్టేస్తున్నట్టు నిట్టూర్పు విడిచాడు రవి. ఇప్పుడు తనకు ఎంతో రిలీఫ్ గా ఉంది. సంతృప్తిగా వుంది! లేచెళ్ళి మంచానికి అడ్డంపడి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే నిద్రలోకి జారిపోయాడు.
"బాబూ! రెండు గంటలవుతోంది! భోజనం చెయ్యండి" అప్పన్న రవిని నిద్రలేపాడు.
"నాన్న వచ్చారా అప్పన్నా!"
"లేదు బాబూ! ఎక్కడకెళ్ళారో ఏమో!" దిగులుగా, బరువుగా ఉంది అప్పన్న కంఠం.
"నాన్నను రానియ్!" అంటూ మళ్ళీ కళ్ళుమూసుకున్నాడు రవి.
గడపలో అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచాడు రవి. పెళ్ళికూతురిలా అలంకరించుకొని వచ్చిన ఇందిరనే కళ్ళప్పగించి చూశాడు.
"ఏమిటి రవీ! అలా చూస్తావేం? ఈ ముస్తాబు నాకు బాగాలేదా?" నవ్వుతూ మంచం దగ్గరకు వచ్చింది ఆమె.
రవి దిగ్గున మంచం దిగాడు. ఇందిరకేసి రెప్పవాల్చకుండా చూడసాగాడు.
"ఏమిటలా చూస్తావు? దెయ్యంలా వున్నావా? పెళ్ళికూతురిలా లేనా!" మృదువుగా అంటూ రవి చెయ్యి తన చేతిలోకి తీసుకుంది.
రవి ఉలిక్కిపడి చెయ్యి వదిలించుకున్నాడు.
"ఏమిటి ఇందిరా ఈ వేషం."
"కన్పించడంలా పెళ్ళికూతురి వేషం !"
"ఎందుకూ?"
"ఎందుకేమిటి? నువ్వే పెళ్ళిచేసుకోమన్నావుగా?"
"అంటే! నీ ఉద్దేశం..."
"నీ ఉద్దేశమేదో నాకు అనవసరం. నేను నీకు ప్రామిస్ చేశాను! నా ఉద్దేశం నేను చెబుతాను. ఇలారా" అంటూ రవి చెయ్యి పట్టుకొని ఇందిర వెంకటేశ్వరస్వామి ఫోటో ముందుకు తీసుకొచ్చింది.
గుప్పిట్లో ఉన్న పసుపుకొమ్ము కట్టిన పసుపుతాడు రవిచేతిలో పెట్టింది. ఎవరో అనుకోకుండా నాగుపాముని చేతిలో పెట్టినట్టు బెదిరిపోయి వదిలేశాడు రవి. ఇందిర క్రింద పడకుండా మాంగాల్యాన్ని పట్టుకుంది.
