"అవ్వా తెల్లార్లు! ఇక్కడే, ఈ చెట్టుక్రిందే కాలక్షేపం చేశావా? తోడు లేకుండా!" జాలిగా అడిగాను. "బాబూ! అదుగో! ఆ ఎండుపుల్లను అక్కడ పడివున్నావని అడిగేవాళ్ళెవరైనా ఉన్నారా? కొండవీటిలో కొండల మీద ఇన్ని బండరాళ్ళు శాపగ్రస్తులైన సుందరీమణుల్లాగా పడివున్నాయ్! ఎందుకిలా పడివున్నారని అడిగేవాళ్ళున్నారా. అదిగో ఆ రాయి చూడు, సున్నని నల్లని రాయి. అది శాపగ్రస్తురాలైన సుందరి కాదా చూడగలిగిన వారికి? ఏ శిల్పి ఉలిపలకరింతకో దాని శరీరం పులకించి సుందర శిల్పంగా మారదా?" అదే బాబూ జీవితంలోని లోతు. కాలం కలసి వచ్చినప్పుడు నేనొక ఆదర్శమూర్తిని! ప్రేయసిని. మరి ఈనాడు దిక్కుమాలి ఈ చెట్టుక్రింద పడివున్న అనేక ఎండుకట్టెను నువ్వేదో ఆసక్తితో పలరించావు. సేవ చేశావు. బ్రతికించావు. లేకపోతే..." అవ్వ ధోరణిలో చెప్పుకుపోతోంది. జీవితానుభావాలు ఆమె చేత అలా మాట్లాడిస్తున్నాయి. "అవ్వా ఏమన్నావు? శిల్పి ఉలిస్వర్శకోసం ఎదురుచూచే ఈ బండరాయి సుందర శిల్పం ఎందుకు కాకూడదు అనికదూ! అవునవ్వా! నువ్వు..."
"ఏమిటి బాబూ సంశయం. పరాయి దాన్నిగా అనుకోక చెప్పు" చెప్పాలనే వచ్చానవ్వా! కానీ నీతో చెప్పాలంటే భయంగా ఉంది. మొదలే నీ ఆరోగ్యం బాగులేదు."
ఆరోగ్యానికేమిటో బాబూ! ఆజ్ఞ రానిదె పోలేను కదా! ఈ ముసలిదాని గుండె బండరాయిలాంటిదె అనుకో! లేకపోతే యాభై సంవత్సరాలనాడు వెళ్ళిపోయిన...తలచుకుంటూ బ్రతికుండగలనా?" ప్రశ్నించింది. నాకు రవ్వంత ధైర్యం వచ్చింది ఈ మాటతో.
"అవ్వా ఆ సుందరి శిల్పానివి నువ్వే ఎందుకు కాకూడదు?" అవ్వ నవ్వటం ప్రారంభించింది. చాలాసేపు నవ్వింది.
"ఈ ముసలిముండకి ఇంకా బ్రతుకు నిముషాల్లో ఉంది. నువ్వేమో భవిష్యత్తును ఆలోచిస్తున్నావు" అన్నది.
"కాదులే అవ్వా! విధి విచిత్రమైనది. ఇప్పుడు నిన్ను ప్రేమించిన ఆ బ్రాహ్మణ యువకుడు తిరిగి రాకూడదూ?" అన్నాను. ఈ మాటకూ అవ్వ బోసినోరు తెరిచి పకపకా నవ్వసాగింది. గ్రుక్కతిప్పుకోలేనంత గాఢంగా నవ్వుతోంది.
"ముసలిముండని చేసి ఆడిస్తున్నావా! మొనగాడివే!"
"కాదవ్వా! ఈ సృష్టిలో జరగకూడని దంటూ ఏదీ లేదు. ఒకవేళ తిరిగొస్తే నువ్వేమి చేస్తావు? అన్నట్లు అతని పేరేమిటో యింతవరకూ చెప్పలేదు నువ్వు."
"అవ్వ చూపులు దూరంగా నిలిచాయి. ఆ కన్నుల్లోని భావాలు జ్ఞాపకాలను రేపినందుకు బాధపడుతున్నట్లున్నాయి. మరికాసేపు సంతోష పూర్ణంగానూ ఉన్నాయి.
"బాబూ! ఎప్పుడో దశాబ్దాల క్రింద కప్పడిపోయిన జ్ఞాపకాల తేనెపట్టుమీద నువ్వు చెయ్యి వేస్తున్నావు. ఆయన పేరు రవివర్మ. రవ్వంత ఎత్తరి. అయినా బాబూ! బొగిలిపోయి పెట్టిపోతున్న యీ చెట్టుమీద చేయివేసే శిల్పి ఎక్కడున్నాడని నేను ఆశించను. ఇది లోకం గమనిస్తే ఎంత హాస్యాస్పదమైన విషయంగా తలపోస్తుంది. వొద్దులే బాబూ! ఇక కదిలించకు.
ఇంకాసేపటికి కాలిపోయే ఈ కట్టె చిగురిస్తుందా! అంతా భ్రమ. ఆమె చూపులకు కన్నీటి తెర పొరవేసింది.
"అవ్వా! రవివర్మ బ్రతికే ఉన్నారు" శతాబ్దాల నుండి విరాఘాటంగా విస్తరిల్లుతున్న వటవృక్షం మీద పిడుగుపడినట్లయింది. అవ్వ ఈ వార్తను తట్టుకోలేక అల్లల్లాడిపోతోంది. ఆ ఒణుకుజూచి భయపడ్డాను. తప్పుచేశానేమోనని బాధపడ్డాను, ఆమె తట్టుకునేదెలా?
"...అని నీకెవరైనా చెపితే వినటానికి సిద్ధమేనా?" అన్నాను. అవ్వ వొణుకు నుండి తేరుకుంది. అనుమానంగా చూచింది.
"బాబూ! నీకు నేను బ్రతకాలని లేదా! మంచివాడివనుకున్నాను. మనసువిప్పి మాట్లాడాను. ఈ పేదగుండెతో నీవు బంతులాడుతున్నావా?" కన్నీటిధారల మధ్య కన్నుమూస్తూ ఏదో అనుమానిస్తోంది. మళ్ళీ నిరాశ చేసుకుంటోంది.
"అవ్వా! నేను నువ్వు అనుకున్నంత కసాయని కావనుకుంటాను. శిల్పి చేయి తగిలితే బండరాయి ఒళ్ళు వులకిస్తుందన్నావే! సుందరశిల్పంగా పునర్జన్మ ఎత్తుతుందన్నావే? ఆ శిల్పి భగవంతుడే కదా! రహస్యమయమైన అనేక సుందర తరలోకాలను సృష్టించిన భగవంతుని కన్న గొప్ప శిల్పి ఎవరున్నారు?" దారిమళ్ళించే ప్రయత్నం చేశాను. అవ్వ కొంత తేరుకుంది. మొత్తం ఒకేసారి చెపితే ఆమె బ్రతకదు. ఆ గుండె కొట్టుకోవటం తక్షణమే ఆగిపోతుంది.
"స్వర్గాన్ని సృష్టించిన భగవానుడు గొప్ప శిల్పే! కాని నీవు నా దేవుడు సంగతి చెపుతున్నావు కాబోలని భ్రమ పడ్డాను. ఒకవేళ ఆయన బ్రతికి వుంటే నన్ను చూడకుండానే ఇంతకాలం గడిచిపోతుందా? అయితే బాబూ? నేను బ్రతికి ఉన్నాను కనుక ఆయన బ్రతికే ఉంటారు" ఫర్వాలేదు చెప్పవచ్చు.
"ఔనవ్వా! ఆయన బ్రతికే వున్నారు. నీకు దగ్గరలోనే ఉన్నారు. నీకోసం కలవరిస్తూ కాల ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాని జీవితపు అంచులమీదికి వచ్చి నిలచాక ఆయనకు నువ్వు లేనిదే బ్రతకలేననిపించింది. వచ్చారు."
"బాబూ! నేను బ్రతికే ఉన్నానా? ఈ మాటలు వింటున్న ప్రాణి ఫాతిమా ఏనా? ఎక్కడ...? అవ్వ తూలుతూనే ఆదుర్దాగా లేచి నిలిచింది. ఓ ఎండు కర్రను చేతికర్రగా పట్టింది. వడివడిగా నడిచే ప్రయత్నం చేస్తోంది."
"అవ్వా ఏమిటా ఆదుర్దా? ఎక్కడికి ప్రయాణం? కొంచెం నిలవరించుకో! తూలిపోతావు" అన్నాను. అవ్వ నా మాటలు వినే స్థితిలో లేదు. నన్ను కూడ పడవేసి లాక్కుపోయేటంత శక్తివంతురాలల్లే ఉంది. నాకు ఆమె వివశమైన ఆనందాన్ని చూస్తున్నప్పుడు ఎన్నడూ కలగని సంతోషం కలిగింది. మానవ ప్రాణిలోని అల్పత్వం గుర్తుకొచ్చింది. కాస్తంత జరిగినప్పుడు క్రుంగిపోవటం. అది అవ్వ జీవితంలో జరగలేదు. కాస్తంత కలిసొస్తే పొంగి పోవటం. ఇది అవ్వ జీవితంలో చూస్తున్నాను. లేచి ఆమె చేయి పుచ్చుకుని ముందుకు అడుగు వేయించాను.
రెండడుగులు వేశామో లేదో ఓబులయ్య ఎదురొచ్చాడు. ప్రక్కన వీరముష్టివాళ్ళూ, పంబలవాళ్ళూ ఎవరూ లేరు మేము దొంగ ఆంజనేయస్వామి దగ్గర చూచినప్పటి భీకరావతారం లేదు. ప్రశాంతమైన చిరునవ్వుతో నమస్కరించాడు.
"దండాలు సాములూ! మాట దయ చెయ్యాలి" అన్నాడు. మాట దయసెయ్యటమంటే మాట్లాడే అవకాశం కోసం ప్రార్థించటమన్నమాట. మా కుటుంబంతో అతడుండే తీరు అది.
