కాని, ఏనాడూ వ్యవసాయం జోలికి పోకు, ఒకవేళ అలా చేయవలసినా తిలలు పెసల జోలికి మాత్రం పోకు. వాటికి బిల బిలాక్షుల గొడవ అధికం. దీర్ఘాయురస్తు చిర యశో పాప్తిరస్తు!" అంటూ ఆశ్వీరదించారాయన. శ్రీనాథయ్య ఆయన పాదాలకు నమస్కరించి నిలచాడు. ఆయన అరణ్యంలో కనుమరుగైపోయేవరకూ చూచి కొండవీటి ముఖంగా సాగిపోయాడు.
లింగమనీదు శతఘ్నులు ప్రేలుస్తున్నాడు. కొండవీడు తుత్తునియలైపోతున్నది. ఆ శతఘ్ని దెబ్బలకు కొండవీటి నూరు సంవత్సరాల చరిత్ర ధూళిగా మారి ఆకాశంలోకి ఎగిరింది. అంతటితో దృశ్యం కన్పించటం ఆగిపోయింది. చెవులు చిల్లులు పడే ఆ శతఘ్ని మ్రోతలకు ఈ లోకం తెలిసింది. అవి శతఘ్ని మ్రోతలు కావు పిడుగులు! ఇంకా అర్థరాత్రి దాటలేదు. రివ్వున చలిగాలికి చెట్లు సైతం చీకటి దుప్పటిని కప్పుకున్నాయి! మళ్ళీ కళ్ళు మూసుకున్నాను! పెద్దియజ్వ కన్పించారు. నమస్కరించాను! ఆశీర్వదించారు నాయనా! నా మనోగతాన్ని నీవు గ్రహించావా? ఈ కథ లోకానికి చెప్పి వేమాంబ సోమదేవుల విషాదాంత ప్రణయ గాధను లోకానికి వెల్లడించు" అని ఆజ్ఞాపించారు! ఔనని శిరని కంపనం చేశాను. నల్లరాయి కాబోలు తలకు గట్టిగా తగిలింది! నేను కానన్ కీ మధ్య ఊగులాడుతూ వున్నానన్నమాట!
బండరాయి మీంచి లేచాను. చలిచలిగా వుంది! ఏవో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి! తిరుగుముఖం పట్టాను! నడుస్తున్నాననే కాని కొండవీటి చరిత్ర యావత్తూ కళ్ళముందు రీలులా తిరుగుతోంది. వేమాయోగిని. మహా తపస్విని, ఆమె మనసులోని ఏకాగ్రత స్త్రీ లోకానికే గర్వకారణం. అసలు ఏకాగ్రత అనేది స్త్రీ లోకానికి భగవంతుడిచ్చిన వరం!
ఆలోచిస్తూ నడుస్తున్నాను! అలవాటుపడిన దారి!
నేను బంగ్లా చేరేసరికి వెలుగు తీగలు సాగుతోంది. చీకటి తోకముడిచి పారిపోతోంది.
సూర్యోదయం కోసం యావత్తు ప్రకృతి ఎదురుచూస్తోంది. నేను గొప్పనిధి సంపాదించిన వాడల్లే సగర్వంగా నడుస్తున్నాను కాని మనసులో వేమాంబను గూర్చిన బాధాకరమైన స్మృతులే మెలివేస్తున్నాయి. ఈ ప్రపంచంలో పుట్టి ఆనందాన్నీ, అనురాగాన్ని కోరి మనిషి ఎన్నో కలలు కనటం సహజం! కాని ఆ కలలు కల్లలైనప్పుడు ఆ మనుషులే జీవితం నిస్సారమైందిగా తలపోయటమూ సహజమే.
కాని కాలం చెప్పిన తీర్పును మనోధైర్యంతో ఎదుర్కొనే మనస్థయిర్యం ఎంతమంది కుంటుంది!
అందుకే చరిత్రలో నేను జరిపిన త్రవ్వకాలకు ప్రతిఫలంగా దొరికిన నిధి వేమాంబ.
ఆమెను లోకం ముందుంచటం నా విధిగా భావించాను.
10
ఆలోచనల మధ్య తలవొంచుకుని పరధ్యానంగా నడుస్తున్న నన్ను దూరం నుండే చూచాడు కాబోలు. ఎదురొచ్చాడు కవి చిన్న శబ్దం చేశాడు. తలెత్తాను.
"ఆచార్లూ! నీ ఆలోచనలతో మా దుంపతెంచుతున్నావు ఎలా పోతావో! మహేంద్రజాలుడల్లె మాయమైపోతావు. మళ్ళీ తెల్లారేదాకా కనిపించవు. ఈ వాలకం చూస్తుంటే నిన్ను ఏ భూతమో ఆవరించిందేమోనని అనుమానంగా ఉంది" అన్నాడు.
నాకు నవ్వొచ్చింది.
"భూతమంటే గతమనేగా నీ ఉద్దేశ్యం. అంటే చరిత్ర. అదే నన్నావహించిన మాట యధార్థమే కాని దానివల్ల నీకు కాని, నాకు కాని వచ్చే బాధేమిటట?" అన్నాను.
"ఈ దేశంలో చరిత్రలకేమి కొదువలే! అసలు భారతదేశమే ఒక చరిత్ర పేటిక!" వ్యాఖ్యానించాడు కవి.
"ఇన్నాళకొక నిజాన్ని అఘోరించావే! అన్నట్టు ఆ ముసలమ్మేవిటి అలా పడివుంది. బ్రతికుందా చచ్చిపోయిందా?" అప్పుడే వచ్చిన రమణ అందుకున్నాడు.
నేను ముసలవ్వకేసి చూచాను. యుగయుగాలుగా తపోసాగరంలో మునిగిపోయిన యోగిని వలె చెట్టుమూల పడివుందామె. కదలిక ఉన్నట్లే లేదు. దగ్గరగా వెళ్ళాను. పలకరించాను. పలకలేదు.
అవ్వ చేయి పుచ్చుకుని కదిపేందుకు ప్రయత్నం చేశాను. ఒళ్ళంతా చల్లగా ఉంది. తెల్లవార్లూ ఇక్కడే పడి ఉందేమో! అరిచేతులూ, అరికాళ్ళు రుద్దుతూ కాసేపు ఉపచారాలు చేశాక అవ్వ కదిలింది. కళ్ళు తెరిచింది.
"నువ్వా! బాబూ! అల్లా నిన్ను చల్లగా చూస్తాడు. నువ్వెక్కడ పుట్టావో, నేనెక్కడ పుట్టానో...ప్చ్...నీ కడుపు చల్లగా నాకింత సేవ చేశావు. అల్లా సహాయం చేసేది మంచివాళ్ళకే నాయనా! వెళ్ళు నీ పని చూచుకో!" అన్నది ఆయాసంతో. "అవ్వా! మరింక మాట్లాడబోక! నేను వెళ్ళేందుకు రాలేదు."
వెళ్ళక ఈ ముసలిదాని దగ్గర కూర్చుంటే నీకు ప్రొద్దుపోతుందా?" అయితే కూర్చో! నాకూ తోడు కావాలనే ఉంది కాని ఈ ముసలిదాని మొఖం చూస్తేనే కుర్రకుంకలకు డోకు" చిన్నగా నవ్వింది.
