అది ఎందుకో తెలుసు అభిరాంకి. బిగ్ బాస్ చెబుతూనే వున్నాడు.
"ఎందుకో చెబుతాను. వీటిల్లో తమిళానికీ, శ్రీలంక టెర్రరిజానికీ సంబంధం వుంది. హిందీ తెలుగు భాషలకి టెర్రరిస్టులతో సంబంధాలు లేకపోయినా, సామ్యవాద తీవ్రవాద ప్రభావం కిందికి వస్తున్న భాషలే ఇవి!
అమెరికా ఒక కేపిటలిస్టు కంట్రీ. అటు ఇస్లామిక్ టెర్రరిజానికీ, ఇటు కమ్యూనిస్టు తీవ్రవాదానికీ కూడా వ్యతిరేకం! మొన్నమొన్నటిదాకా రష్యాతో రాచ్చతోనే మన శక్తియుక్తులన్నీ ధారపోయడం జరిగింది కదా! ఇప్పుడు కమ్యూనిస్టు చైనా తన పద్ధతి మార్చుకుని మనకి ఇష్టమయిన దేశంగా మారి కేపిటలిజం మంత్రం జపిస్తున్నా కూడా ఇండియాలోనూ అక్కడా లెఫ్టిస్టు తీవ్రవాదం బలపడిపోతోంది.
అది మనం నిరోధించాలి.
అదీ కాకుండా - ఇంకో పాయింటు వుంది.
అది అటు ప్రెసిడెంటు బుష్ గానీ, ఇటు ప్రెసిడెంట్ కాబోయి మానేసిన కెర్రీగానీ గ్రహించలేదు. నేను గ్రహించాను" అన్నాడు బిగ్ బాస్ సగర్వంగా.
రాబోతున్న ఆవలింతని ఆపుకున్నాడు అభిరాం.
'ముసలోడు చెప్పేవన్నీ నాకు ముందే తెలుసు!' అనుకున్నాడు మనసులోనే విసుగ్గా. 'తన గొంతు తనే వినడం ముసలాడికి ఇష్టం కాబోలు!'
గొంతు సవరించుకున్నాడు బిగ్ బాస్.
"ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా నెంబర్ వన్ స్థానంలో వుంది. అవునా? పోతే - గత ఐదొందల సంవత్సరాలలో మూడు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి. మధ్యయుగాలలో యూరోప్ లో జరిగిన పారిశ్రామిక విప్లవం! తద్వారా వచ్చిన సౌభాగ్యం! రెండు. ఆ తర్వాత అమెరికా విజృంభణ! అంతర్జాతీయంగా అమెరికా వెలిగిపోవడానికి కారణం సైన్సూ, టెక్నాలజీ రంగాలలో మనకి తిరుగులేకపోవడం -
ఇకపోతే - మూడో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే, గత ముప్ఫయ్ సంవత్సరాలుగా ఆసియా ఖండంలో వస్తున్న మార్పులు. అమెరికాని ఛాలెంజ్ చేయడానికి రెడీ అంటున్నట్లుగా ఉంది ఆసియా ఇప్పుడు! మరీ ముఖ్యంగా మనకే సొంతం అని మనం అనుకుంటున్న సైన్సూ, టెక్నాలజీ రంగాలలో!
ఒక్క ఉదాహరణ చెబుతాను యంగ్ మెన్!
మొన్నమొన్నటిదాకా మొత్తం ప్రపంచంలో సైంటిస్టులు కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ సమర్పించిన పేపర్లలో అరవైతొమ్మిది శాతం అమెరికా నుంచే వచ్చేవి. దురదృష్టవశాత్తు, ఇప్పుడవి ఇరవైతొమ్మిది శాతానికి పడిపోయాయి. ఇండియా చైనాలు ఆ స్థానాన్ని ఆక్రమించేటందుకు పోటీ పడుతున్నాయి.
ఒక్క సాఫ్ట్ వేర్ రంగాన్నే తీసుకోరాదూ? ఇక్కడ ఈ అమెరికాలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లలో సగానికి సగంమంది ఇండియన్సే అనుకుంటే, మళ్ళీ ఆ సగంలో సగంమంది తెలుగువాళ్ళే అయి వుంటారు! ఇవాళ సాఫ్ట్ వేర్ అయింది. రేపు సింథెటిక్ జీన్స్ కావచ్చు - అంటే - లాబరేటరీలలోనే ప్రాణం సృష్టించే ప్రయత్నాల వంటివి!
దీనికి అంతెక్కడ? అప్పుడింక అమెరికా ఎక్కడ? అడ్డుకట్టవేయవలసినదే! అవునా?" అన్నాడు బిగ్ బాస్.
అవునన్నట్లు తలపంకించారు అభిరాం, జో.
"ఇప్పటిదాకా ఇండియా మనకి ఒక కొరకరాని కొయ్య! నయానా భయానా కూడా పూర్తిగా మన దారిలోకి తెచ్చుకోలేకపోయాం!" అన్నాడు బిగ్ బాస్.
"అవును! ఒకసారి ఇండియా పాకిస్తాన్ ల యుద్ధ సమయంలో పాకిస్తాన్ కి సపోర్టుగా అమెరికా అత్యంత శక్తివంతమైన 'సెవెంత్ ఫ్లీట్' అనే తన యుద్ధ నౌకలని పంపింది. అది చూసి ఇండియా ఠారుకుంటుందని ఆశించింది అమెరికా. కానీ ఇండియా కేర్ చేయలేదు" అన్నాడు అభిరాం.
"అవునవును!" అన్నాడు బిగ్ బాస్. "అందుకని నాకు ఒకటి తోస్తోంది. ఇండియాని బయటనుంచి ఎట్లాగూ లొంగదీసుకోలేం! అందుకనే లోపలనుంచే పెటకం పెట్టాలి."
"అంటే?" అన్నాడు జో
"అంటేనా?" అని నవ్వి "జో! ఒక జోకులాంటి ప్రశ్న అడుగుతాను. ఈసారి ఇండియాకి కాబోయే ప్రధానమంత్రి వింటున్నారా - ఈసారి ఇండియాకి కాబోయే ప్రధానమంత్రి -
ఏ దేశం వాడు అయి వుంటాడు? ఎవరైనా చెప్పుకోగలరా?" అన్నాడు బిగ్ బాస్.
నవ్వారు అభిరాం, జో.
"నవ్వులాటగానే ఉంది కదూ? కానీ ఇది నిజం! ప్రపంచంలో ఇంకే దేశపు రాజ్యాంగంలోనూ లేని లొసుగు ఇండియన్ కాన్ స్టిట్యూషన్ లో వుంది. ఐ రిపీట్! ఇండియన్ పౌరసత్వం తీసుకోగలిగితే, ఏ దేశస్థుడయినా సరే, ఇండియాకి ప్రధానమంత్రి కాగలడు! ఇప్పుడు మన అభిరాం ఇండియన్ సిటిజన్ అయిపోలేదూ- దొంగ రేషన్ కార్డుతో ఓటర్ల జాబితాలో పేరునమోదు చేయించుకునీ!"
నవ్వి, అన్నాడు అభిరాం.
"అమెరికా దేశపు పౌరసత్వం సంపాదించడం అతికష్టం! అనేక యూరోపియన్ దేశాల సంగతి కూడా అంతే! ఆ మాటకి వస్తే, ఏ దేశపు పౌరసత్వం సంపాదించాలన్నా కూడా విదేశీయులకి కష్టమే అవుతుంది. కానీ-ఇండియా ఈజ్ గ్రేట్! నేనిప్పుడు ఇండియన్ సిటిజెన్ షిప్పు ఇప్పించేస్తుంది" అన్నాడు అభిరాం అపహాస్యంగా.
'ప్రధానమంత్రిని చేసినా చేసేస్తుంది కూడా!" అన్నాడు బిగ్ బాస్.
'అదేగదా నా ప్రయత్నం!' అనుకున్నాడు అభిరాం.
"అయితే..." అని మళ్ళీ మొదలెట్టాడు బిగ్ బాస్.
"ఇప్పుడు అమెరికాలో కూడా ఇట్లాంటి పిచ్చి కళలకు పురుడు పోసే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడ పుట్టిన వాళ్ళయినా సరే...అమెరికాలో ఇరవై ఏళ్ళపాటు ఉండి, పౌరసత్వం సంపాదించ గలిగితే చాలు. అమెరికన్ అధ్యక్ష స్థానానికి పోటీ చేసే వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని కొందరు పెద్దలు ప్రయత్నాలు మొదలెట్టారు. దీని బ్యాక్ గ్రౌండ్ మనకి తెలుసు! ఆస్ట్రియా అనే అతి చిన్న దేశంలో పుట్టి పొట్ట పట్టుకుని అమెరికా చేరాడు ఇవాళ్టి సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్ష్ నిగ్గర్. అతను నటించిన 'టెర్మినేటర్' లాంటి యాక్షన్ మూవీస్ అందరూ చూసే వుంటారు. నోటెంబడి ఒక్క ఇంగ్లీషు ముక్క రాకుండా, జేబులో ఒక్క డాలరు లేకుండా ఆస్ట్రియా నుంచి అమెరికాకి వచ్చి ఆర్నాల్డ్ ఇవాళ మల్టీ మిలియనీర్. సినిమా ఇండస్ట్రీని శాసించే లెవెలుకి ఎదిగాడు. పాలిటిక్సులోకి వచ్చి కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నరు అయ్యాడు. కానీ ఆశకి అంతు వుండదు గదా! ఇప్పుడు ఏకంగా అమెరికాకే అద్యక్షుడయిపోవాలని త్వరత్వరగా వుంది. ఆస్ట్రియాలో పుట్టిన ఒకప్పటి ఆ అనామకుడికి! అందుకు వీలుగా అమెరికన్ రాజ్యాంగాన్నే మార్చేయాలని ఆత్రం! కానీ ఇది అమెరికా! ఆఫ్టరాల్ ఇండియా కాదు. అంతటి దౌర్భాగ్యం ఈ దేశానికి పట్టదనీ, పట్టకూడదనీ నేను ఆశిస్తున్నాను" అని ఆగాడు బిగ్ బాస్.
మళ్ళీ అన్నాడు. "కానీ మన అభిరాం ఇండియాని ఏలగలడు. ఏలాలి కూడా! అతని పూర్వీకులయిన ఇంగ్లీషు రాజులూ, రాణులూ గతంలో ఇండియాని ఏలారు కదా! మళ్ళీ చరిత్ర పునరావృతం చేయడంలో అభిరాంకి మన అందరి బ్యాకింగూ వుంటుంది" అన్నాడు బిగ్ బాస్.
వింటున్న అభిరాం మొహం వికసించింది!
తను! ఇండియాకి కాబోయే రారాజు!
తనకి అమెరికాతో సహా అందరి బ్యాకింగ్!
బిగ్ బాస్ చెబుతూనే వున్నాడు.
"మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. యుద్ధం చేస్తామని బెదిరించీ, భయపెట్టీ ఇండియాని కాళ్ళ బేరానికి తెచ్చుకోలేం. పాకిస్తాన్ కి జరిగిన పరాభవాలు మనందరికీ పాఠాలు!
కానీ-ఇండియాలో - ఇండియన్సులో కూడా బోలెడన్ని బలహీనతలు ఉన్నాయి. ఉదాహరణకు - కులపిచ్చీ, మత పిచ్చీ, భాషా ప్రాంతీయభేదాలు - వగైరా వగైరా! అక్కడ తమిళనాడు రాష్ట్రంలో అయితే, ఇంకా ఈనాటికీ కూడా ఏనాడో చరిత్రలో కలిసిపోయిన 'ఆర్యులూ-ద్రావిడులూ' అనే విభేదాలు రాజకీయాలని నడిపిస్తున్నాయి!
ఇండియన్సులో ఎన్నెన్నో బలహీనతలు!
అయినా కూడా వాళ్ళకి వుంది ఒక బలం!
భిన్నత్వంలో ఏకత్వం!
అయినా సరే 'డివైడ్ అండ్ రూల్' అంటే 'విభజించి పాలించు' అన్న పాలసీతో ఇంగ్లీషువాళ్ళు రెండొందలు ఏళ్ళపాటు అక్కడ రాజ్యం ఏలగలిగారు.
ఇప్పుడు మనం ఆ బలహీనతలతోబాటుగా ఇండియన్స్ కి ఉన్న మరో బలహీనతని కొల్లగొట్టబోతున్నాం. - అదే సినిమా పిచ్చి!" అని బిగ్గరగా నవ్వాడు బిగ్ బాస్.
జో, అభిరాం కూడా నవ్వారు.
నవ్వి నవ్వి కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి బిగ్ బాస్ కి.
కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకున్నాడు.
వెల్! నాకూ సినిమాలంటే ఇష్టమే! నేనూ సినిమాలు తెగ చూసిన వాడినే! ఇక్కడ ఒక హాలీవుడ్ స్టంట్ హీరో రోనాల్డ్ రీగాన్ అమెరికన్ ప్రెసిడెంటు అయ్యాడు. ఇప్పుడు తాజాగా ఈ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్వార్ష్ నెగ్గర్ కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు. అయితే? కేవలం సినీ స్టార్సు కావడం వల్లనో లేదా పూర్తిగా అభిమానుల ఓట్ల వల్లనో వాళ్ళు ఆ పదవులు అధిష్టించలేదు. వాళ్ళ ఓన్ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళకి వుంది. ఇండియాలో అట్లా కాదే! ఇంగితజ్ఞానం వుండదు అక్కడ. పాతికేళ్ళపాటు పేపరు కూడా చదవని వాడూ, సినీ రాజకీయాలు తప్ప పాలిటిక్సు అంటే తెలియని ఒక నటుడు ప్రాంతీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలలు తిరక్కుండానే పవర్ లోకి రావడం ఒక్క ఇండియాలోనే జరిగింది!
ఒక్క ఇండియాలోనే జరుగుతుంది కూడా!
యంగ్ మెన్! అందుకే మనం ఇండియన్స్ లో ఉన్న సినిమా పిచ్చిని పూర్తిగా కొల్లగొట్టాలి! అందుకే హాలీవుడ్ కనెక్షన్స్ వున్న మన జో ఫెల్డ్ మాన్ ని - కేస్టింగ్ డైరెక్టరుని - ఈ నాటకానికి డైరెక్టరుగా పెట్టాను. కేస్టింగ్ డైరెక్టర్ గా సినిమా ఛాన్సుల ఎర చూపిస్తూ దేశదేశాలూ తిరుగుతూ వుంటాడు జో. అతని గ్లామరు మనకి పనికివస్తుంది.
"ఆఫ్రికా అడవుల్లో వుండే ఆడపిల్లలయినా సరే 'అమెరికాలో హాలీవుడ్ సినిమా ఛాన్సు!' అంటే వంటిమీద బట్ట వున్నదా వూడిందా అని చూసుకోకుండా వెంటపడి వస్తుంది. అంత ఆకర్షణ! జో గ్లామరు అభిరాంకి పనికిరావాలి. అభిరాం అమెరికాకి పనికిరావాలి!" అన్నాడు బిగ్ బాస్.
