"తను రానందా? లేక ఎవరైనా అడ్డుపడ్డారా?"
ఆమె మౌనంగా ఉండిపోయింది.
ఆ మౌనం అతన్ని మరింతగా క్రుంగదీసింది. అతని ముఖం వాడిపోయింది. కనుకొలకులలో నీరు ఉబికింది.
సాహితి గురించి చెప్పాలా, వద్దా అన్న మీమాంసలో ఉంది అనూష.
అతను మరికొద్ది క్షణాలలోనే తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. మనసు నిర్మలం చేసుకుని ప్రశాంతంగా ఆలోచించాడు.
ప్రస్తుత పరిస్థితులలో తనను ఎవరు నమ్ముతారు? తను ఆశపడినంత మాత్రాన సాహితి హఠాత్తుగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందనుకోవడం తన అవివేకం.
మగవాడు తెగించినట్టు, ఆడపిల్ల ధైర్యం చేస్తుందనుకోవడం పొరపాటే!
ప్రేమికులు పిరికివాళ్ళు కానంత వరకు ప్రేమకు చివరి తీర్పు విజయమేనని చెప్పవచ్చు. కాని ఇద్దరిలో ఏ ఒక్కరు భయపడి వెనుకంజ వేసినా, ప్రేమ విలువ ఓటమితోనే సమాధి అవుతుంది.
తను ధైర్యం చేసినా, తన ప్రేమికురాలు భయపడో, భంగపడో తనను కాదనుకుంది. ప్రస్తుతం తనేం చేయాలో అతను నిర్ణయించుకున్నాడు.
"అనూషా! నాకో సహాయం చేస్తావా?" అభ్యర్ధనగా అడిగాడు.
ఆమె క్షణం ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయింది. అంత తొందరగా సమ్రాట్ మారుతాడనుకోలేదామె.
సాహితి రాలేదన్న వాస్తవాన్ని తట్టుకోలేక అతను ప్రేమ పిచ్చిలో పడి ఏ అఘాయిత్యానీకైనా పాల్పడతాడేమోనని తను ఇప్పటివరకు హడలి పోయింది. కాని తను భయపడవలసినంతగా అతనిలో అటువంటి లక్షణాలేమీ ఆ క్షణంలో కనిపించలేదు.
"అనూషా! నాకు సహాయపడాలనిపించడం లేదా?"
ఆమె చిరునవ్వు నవ్వి ఏమిటో చెప్పమన్నట్టు తల ఊపింది.
"సాహితికి గుణపాఠంగా, నేను ఈ ముహూర్తానికే పెళ్ళి చేసుకుంటాను?" ఆవేశంగా అన్నాడు.
అర్థం కానట్టు చూసింది అనూష.
"అనూషా! ఈ ఒంటరి జీవితంతో విసిగి వేసారిపోయాను. రకరకాల ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి. నాకు పిచ్చెక్కుతుందేమోనని భయంగా ఉంది. అందుకే నన్ను మళ్ళీ మామూలు మనిషిగా తీర్చిదిద్దేందుకే వెంటనే ఓ స్త్రీ తోడు నాకు కావాలి. నీకు....నీకు ఇష్టం అయితే ఈ ముహూర్తానికే మనం పెళ్ళి చేసుకుందాం. ఏమంటావు?" ఆశగా ఆమె కళ్ళలోకి చూశాడు సమ్రాట్.
అనూషకు నవ్వాగలేదు. అతను అపార్థం చేసుకుంటాడేమోనని పెదాల మధ్యనే నవ్వును బిగబట్టింది.
సాహితి రాలేదన్న కోపంతో అతను ఈ ముహూర్తానికే తనను పెళ్ళి చేసుకుంటానంటున్నాడు. అసలు సాహితి ఎందుకు రాలేదో, ఏ పరిస్థితులలో ఉందో తెలుసుకోవలసిన అవసరం అతనికసలు ఉన్నట్టు లేదు!
ఇక, తను అవునంటే పెళ్ళి, కాదంటే ఇంకెవరిని చేసుకుంటాడో?
అతని వింత మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయింది అనూష.
"అనూషా! ఎందుకంత ఆలోచన? మన ఇద్దరి అభిరుచులు ఒకటే. అలాంటప్పుడు మనం పెళ్ళి చేసుకోవడం హర్షదాయకమే అవుతుంది. ఏమంటారు?" నచ్చచెప్పజూశాడు.
"అసలు ప్రేమంటే ఏమిటో నిర్వచనం చెప్పగలరా?" సూటిగా అడిగింది.
అనుకోని ప్రశ్నకు సమ్రాట్ సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలాడు.
"పోనీ, ప్రేమమీద మీకు అసలు నమ్మకం ఉందా?" రెట్టిస్తూ అడిగింది.
"సారీ అనూషా! ప్రేమంటే ఏమిటో చెప్పే స్థితిలో నేను లేను. అసలు నాకు ప్రేమమీదే నమ్మకం పోయింది. నాకు కావలసిందల్లా ప్రస్తుత పరిస్థితులలో ఒక స్త్రీ తోడు, అంతే....అంతే!"
"సారీ, ప్రేమంటే ఏమిటో నేను చెప్పగలను. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎవరైనా జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తారు. చావో బ్రతుకో వాళ్ళతోనే రాసిపెట్టి ఉందనుకుంటారు కాని, మీరు ఎన్నిసార్లు ప్రేమిస్తారు? ఎందరిని ప్రేమిస్తారు?" సూటిగా అడిగిన ఆమె ప్రశ్నలు అతని మొహాన లెంపకాయ కొట్టినట్టు వినిపించాయి.
సమ్రాట్ ఖిన్నుడయ్యాడు. ఆమె కళ్ళలోకి చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
"చూడండి! నా దృష్టిలో ప్రేమ పరమ పవిత్రమైనది. అది త్యాగాన్ని సయితం కోరుకుంటుంది. కాని మీ కోర్కె తెలిశాక ప్రేమకు కొత్త నిర్వచనం ఇవ్వవలసిన అవసరం ఉంటుందనిపిస్తున్నది!
"మీ దురాలోచన నాకు ఇప్పుడిప్పుడే అవగాహన అవుతున్నది. ఈ దురుద్దేశంతోనే మీరు నాకూ, ఆనంద్ కూ మధ్య మనస్పర్థలు సృష్టించడానికి ప్రయత్నించారు. లేనిపోని కట్టుకథలల్లి కరపత్రాలు వేయించారు. అవునా?" మొదటిసారిగా అనూషలో కట్టలు తెగిన ఆవేశాన్ని చూశాడతను.
అతనికి ముచ్చెమటలు పట్టాయి.
"మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని, నేను మీ దగ్గర కట్టుబానిసలా పడి ఉండాలని ఆలోచించే మీరు నాకూ ఆనంద్ కూ మధ్య అపోహలు సృష్టించడానికి ప్రయత్నించారు. ఆనంద్ ని నేను పెళ్ళి చేసుకుంటానని, ఆ తరువాత రొటీన్ జీవితంలోకి వెళ్ళిపోతానని భయపడి మా మనసులు విరిచేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సాహితి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి రాలేదు కనుక, అవకాశం కుదిరింది కనుక నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. ఇదంతా మీరు స్వార్థంతో చేసిన దురాలోచన కాదంటారా? చెప్పండి!"
"మీ ముఖం చూసి_సాహితి ఎందుకు రాలేదో చెబితే ఏం అఘాయిత్యం చేసుకుంటారోనని భయపడి చెప్పలేదు. కాని మీ వ్యాపార సరళి విన్న తరువాత మీ నిజరూపం బయటపడింది. ఇన్ స్పెక్టరు దగ్గర, బిందుమాధవిగారి దగ్గర మిమ్మల్ని సమర్థించినందుకు ఇవ్వాళ నేను సిగ్గుపడుతున్నాను. మీరు రాసే నవలలకు, మీ నిజజీవన విధానానికి ఎంతో తేడా ఉంది! మీ వలన సాహితి జీవితం ఏమైందో వెళ్ళి చూడండి!" అని విసురుగా కారు తలుపు వేసుకుంది అనూష.
ఆమె ఆవేశానికి తోడుగా దుమ్ము రేపుకుంటూ కారు మరింత వేగంగా కనుమరుగైపోయింది.
* * * *
