పరిచయం
"ఊఁ త్వరగా ఎక్కాలి."
దిగేవాళ్ళను ఆశీర్వదిస్తూ, ఎక్కేవాళ్ళను శపిస్తూ వీలయినంత ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు నుంచే ప్రయాణం చేస్తున్న వాళ్ళు. పాసింజర్ తెనాలి స్టేషన్ లో ఆగింది.
చంకలో పసిబిడ్డను ఎత్తుకొని, చేతిలో సూట్ కేసుతో దిగటానికి ప్రయత్నిస్తూ, దిగలేక, ఎవరైనా బిడ్డను అందుకుంటారేమోనని ఆశగా ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళ వైపు చూస్తూంది సావిత్రి.
రామారావు భార్య ఆమెను చూసినా చూడక పట్టించుకోనట్టు ఆమెను తోసుకుంటూ రైలు ఎక్కింది. అతి ప్రయత్నం మీద చాచిన రామారావు చేతుల్లోకి బిడ్డను అందించింది సావిత్రి.
బిడ్డను అందుకుంటూ థాంక్సు చెప్పింది సావిత్రి.
"ఫర్వాలేదండీ!" అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు.
"మీరా" అతన్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
"సావిత్రి!" అని అతను అంటూ వుండగానే రైలు కూత వేసింది.
"త్వరగా ఎక్కండి!" చురుగ్గా అన్నది రామారావు భార్య.
రామారావు ఏదో అనబోయి "ఎక్కరేం! బండి కదులుతుంటేనూ!" భార్య హెచ్చరికతో గబుక్కున వెళ్ళి బండి ఎక్కాడు. బండి అప్పటికే కదిలింది.
గేట్లో నిల్చున్న రామారావుకేసి చెయ్యి ఊపింది నవ్వుతూ సావిత్రి.
"వచ్చి కూర్చోండి!" చిరాగ్గా అన్నది రామారావు భార్య సుధ.
రామారావు యాంత్రికంగా వచ్చి భార్య ప్రక్కన కూర్చున్నాడు.
శరవేగంతో రైలు ముందుకు దూసుకు పోతూంది. రైలు కట్ట ప్రక్కగా వున్న చెట్లు వెనక్కు పరిగెత్తుతున్నాయి. స్లీపర్స్ మీద వున్న రాళ్ళు ఎగిరెగిరి పడ్తున్నాయి రైలు వేగానికి. స్మృతి పేటిక తెరుచుకుంది. కాల ప్రవాహంలో పేరుకుపోయి గడ్డ కట్టిన ఒకానొక అనుభవం ముందుకొచ్చింది.
"ఏమిటా పరధ్యానం? ఎవరావిడ?" చురుగ్గా భర్త హృదయాన్ని ఎక్సరే తీస్తున్నట్టు చూస్తూ అడిగింది సుధ.
"ఇంటికి వెళ్ళింతర్వాత చెప్తాలే!" అన్నాడు రామారావు. సుధ మూతి సున్నా చుట్టి కూర్చుంది.
"ఈ ఆడవాళ్ళకు అన్నీ అనుమానాలే" మనసులోనే అనుకున్నాడు రామారావు.
... ... ...
"అసలామె ఎవరండీ! ఏ ఊరు! మీకు తెలుసా!" రామారావు కాళ్ళకింద దిండు లాక్కుని తలక్రింద వేసుకుంటూ అడిగింది సుధ.
"ఆవిణ్ణి మర్చిపోలేదన్నమాట!"
"ఇష్టం లేకపోతే చెప్పకండి!" ముఖం గోడ వైపుకు తిప్పుకొని పడుకుంది.
"ఇంతలోకే కోపం! చెప్తాను! పూర్తిగా వినాలి మరి! మధ్యలో ఆవలిస్తే చెప్పను!" నడుంమీద చెయ్యివేసి తన వైపు భార్యను తిప్పుకుంటూ అన్నాడు రామారావు.
"ఊ హు! పెద్ద! చెప్పండి!" అన్నది సుధ.
"అయితే విను! కాని ఒక షర్తు!"
"ఏమిటి!"
"మధ్యలో కుంటి ప్రశ్నలు వెయ్యకూడదు."
"అబ్బ! చెప్పండీ! మరీ మీదంతానూ...!"
... ... ...
"నేను మద్రాసులో క్రిస్టియన్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న రోజులు. అప్రెంటీస్ చెయ్యడానికి వచ్చిన సుబ్బారావు మా రూంలో వుంటూ వుండేవాడు.
